Narayana: కేసీఆర్, జగన్ ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి వెళ్లక పోవడం ప్రజా తీర్పును అవమానించడమే

- కేసీఆర్, జగన్ పై సీపీఐ నేత నారాయణ విమర్శలు
- ‘రాజకీయ పార్టీలపై కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం
- మోడీ గుప్పిట్లో రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం
Narayana:
విధాత ప్రత్యేక ప్రతినిధి: ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ఎమ్మెల్యే లుగా గెలిచి అసెంబ్లీకి వెళ్లక పోవడం ప్రజా తీర్పును అవమానించడమేనని అన్నారు. ఒకవేళ అసెంబ్లీకి వెళ్లకుంటే వారు రాజకీయ సన్యాసం తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ (Narayana) సూచించారు. కేసీఆర్, జగన్ తో పాటు మోడీ తీరు పై విమర్శలు చేశారు. అదే విధంగా రాజకీయ పార్టీలపై కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం రోజు రోజుకూ పెరిగిపోతున్నదని, ఇది సమాజానికి ప్రమాదకరమని హెచ్చరించారు.
వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా మంగళవారం నారాయణ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనదైన పద్ధతిలో స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ శక్తులు బలపడుతూ రాజకీయాలను శాసిస్తున్నారని, అమెరికాలో ఎలాన్ మస్క్, ఇండియాలో ఆదానీ ఒక్కటవుతున్నారని అన్నారు. నేడు రాజకీయ శక్తులను డామినేట్ చేసేలా కార్పొరేట్ శక్తులు ఎదిగారని అన్నారు. కార్పొరేట్ శక్తులు ప్రజలకు సేవ చేయరని, వారికి లాభం ఒక్కటే లక్ష్యం అని అన్నారు.
మోడీ చేతిలో రాజ్యాంగ సంస్థల నిర్వీర్యం
ప్రపంచంలో అమెరికా ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించాలనుకోవడం, కమ్యూనిస్టు దేశాలను బలహీన పరచడం చేసినట్లుగానే దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమ మాట వినని వారిపై రాజ్యంగ సంస్థల చేత దాడి చేయించి దారికి తెచ్చుకుంటున్నారని నారాయణ అన్నారు. మోడీ పాలనలో గజదొంగలను, దోపిడీ దారులను వెనకేసుకు రావడం వలన మొత్తం వ్యవస్థ దెబ్బ తిన్నదని అన్నారు. జ్యుడీషియల్ లో సైతం తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు పదవులు కట్టబెట్టారని, జ్యుడీషియల్ తో సహా ఎన్నికల కమిషన్, ఈడి,సీబీఐ లాంటి సంస్థలను మోడీ తన గుప్పిట్లో పెట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకటే ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజన్ సర్కారులా అభివృద్ధి జరుగుతుందంటే మరి మణిపూర్, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉన్నా ఎందుకు విఫలమయ్యాయని ప్రశ్నించారు. ప్రస్తుతం జమిలి ఎన్నికల పేరుతో ఒకే దేశం, ఒకే ఎన్నిక అంటూ కొత్త నాటకానికి తెర తీశారని, ఇది రాష్ట్రాల స్వతంత్రను నియంత్రించడమేనని అన్నారు.
ఎంపీ ఎన్నికల్లో తగ్గిన మోడీ ప్రభావం
మోడీ పాలన బాగా ఉంటే 303 సీట్ల నుండి 242 ఎంపీ స్థానాలకు ఎందుకు పడిపోయారని నారాయణ అన్నారు. దేశంలోనే ఏ ప్రధానికి రానంత తక్కువ మెజారిటీతో మోడీ గెలిచారని, చంద్రబాబు,నితీష్ లను లొంగదీసి కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. మొన్నటి డిల్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఇచ్చిన లిక్కర్ కుంబకోణం డబ్బును తీసికొని ఆప్ ఓడిపోయిందని, ఆ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, ఆప్ కలవకుండా మోడీ ఆప్ ను బ్లాక్ మెయిల్ చేశారని అన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్,తెలంగాణాలోనూ ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాల ద్వారా పార్టీలను బీజేపీ గుప్పిట్లో పెట్టుకుంటున్నదని అన్నారు. దేశంలో రాజకీయ పార్టీలు ఏం చేసినా మార్పు కోసం కమ్యూనిస్టు లుగా తాము ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
రాష్ట్రాన్ని నాశనం చేసిన బీఆరెఎస్
తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల కుప్ప చేయడం వల్ల నిధులు లేక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేక పోతున్నదని నారాయణ అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణా ను 7లక్షల కోట్ల అప్పలలోకి బీఆర్ఎస్ నెట్టివేసిందని అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల వ్యవస్థలను బీఆర్ఎస్ చెడగొట్టిందని, వాటిని అధిగమించడానికి రేవంత్ సర్కారు తంటాలు పడుతున్నదని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ లు ఒక్కటేనని, అందువల్ల తాము అప్పుడే వాటికి వ్యతిరేకంగా నిలబడిన కాంగ్రెస్ ను విమర్శించబోమని అన్నారు. తమకు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ప్రజల కోసం పోరాడుతామని, కమ్యూనిస్టుల పునరేకీకరణ కు కృషి చేస్తామని అన్నారు.
రాష్ట్రంలో జరిగిన కులగణనను స్వాగతిస్తున్నామని, దాని వలన రాజకీయాల్లో గుత్తాధిపత్యం పోతుందని, కులగణన వలన రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని అన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఐ కి రెండు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని ఎన్నికల పొత్తులో భాగంగా మాట ఇచ్చిందని,దానికి కట్టుబడి ఉండాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి,జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, సీనియర్ నాయకులు మోతె లింగారెడ్డి, నాయకులు కర్రె లక్ష్మణ్, మునిగాల బిక్షపతి, జక్కు రాజు గౌడ్,వేల్పుల సారంగపాణి, కొట్టెపాక రవి, బత్తిని సదానందం, మాలోతు శంకర్, కామెర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.