Gun Shooting in Malakpet| మలక్ పేటలో కాల్పులు..సీపీఐ నేత హత్య

విధాత: హైదరాబాద్ మలక్ పేట లో కాల్పుల ఘటన కలకలం రేపింది. శాలివాహన నగర్ పార్కులో మార్నింగ్ వాక్ చేస్తున్న సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్ (43)పై గుర్తు తెలియని దుండుగులు ఆరురౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. కాల్పుల్లో చందునాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. తన భార్య, కుమార్తె కళ్ల ముందే..స్థానికులు అంతా చూస్తుండగానే నలుగురు దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. స్విఫ్ట్ కారులో వచ్చిన నలుగురు దుండగులు చందునాయక్ పై కారం చల్లి కాల్పులు జరిపారు. చందునాయక్ స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లి. కుటుంబంతో కలిసి చైతన్యపురిలో నివాసం ఉంటున్నాడు. భూతగదాల కారణంగానే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల సమాచారం అందుకున్న సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యకుమార్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. నిందితుల కోసం 10బృందాలతో గాలింపు చేపట్టామని, సంఘటన స్థలంలో 5బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. స్పాట్ లో దొరికిన బుల్లెట్లను చూస్తే ఒకే వెపన్ తో ఫైరింగ్ చేసినట్లు తెలుస్తోందన్నారు. సీసీ కెమెరాలతో పాటలు ఇతర ఆధారాలు సేకరిస్తున్నామని..పాతకక్షలు, భూతగదాల నేపథ్యంలో విచారణ కొనసాగిస్తున్నాని తెలిపారు.
నిందితులు ఉపయోగించిన కారును గుర్తించామని..త్వరలోనే వారిని అరెస్టు చేస్తామన్నారు. చందు నాయక్ పై గతంలో ఉన్న పాత కేసులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. .నాగోల్ సాయి నగర్ లో గుడిసెలకు సంబంధించి నాలుగు సంవత్సరాల క్రితం భాను అనే వ్యక్తితో చందు నాయక్ కి ఘర్షణ తలెత్తింది. అప్పట్లో చందు నాయక్ అనుచరులు భానుని హత్య చేసినట్లుగా సమాచారం. ఈ కేసులో చందునాయక్ సైతం నిందితుడిగా ఉన్నారు. చందునాయక్ ను హత్య చేసే ముందు దుండగులు మంగళవారం ఉదయం ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఇంటి నుండి పార్కుకు వెళ్లిన చందు నాయక్ ను ఫాలో అయిన దుండగులు..పార్క్ నుండి బయటికి రాగానే కాల్చి చంపారు.
నిందితుల లొంగుబాటు
మలక్ పేట్ కాల్పల ఘటన నిందితులు నలుగురు పోలీసుల ఎదుట లొంగిపోయారు. చందు నాయక్ పై కాల్పుల జరిపి హత్య చేసిన కేసులో ప్రధాన సూత్రధారులు రాజేష్, సుధాకర్ తో పాటు మరో ఇద్దరు లొంగిపోయారు. నిందితులు వాడిన స్విఫ్ట్ కారును పోలీసులు సీజ్ చేశారు.