Janwada Farm House । కేటీఆర్ జన్వాడ ఫాం హౌస్‌లో కొలతలు.. కూల్చివేతకు హైడ్రా సిద్ధమైందా?
కూల్చివేతలు పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటుంది, ఎంత మంది సిబ్బంది అవసరం, అడ్డంకులు ఏమి ఉన్నాయనే అంశాలపై సమాలోచనలు చేసినట్లు తెలిసింది. కొలతలు పూర్తికావడం, హైకోర్టు నుంచి అడ్డంకులు లేకపోవడంతో ఏ క్షణమైనా హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతలు పూర్తి చేయనున్నట్లు పరిస్థితులు తెలియచేస్తున్నాయి.

Janwada Farm House । రంగారెడ్డి జిల్లా జన్వాడలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌దని చెప్పే ఫామ్ హౌస్‌లో నీటి పారుదల శాఖ ఇంజినీర్లు మంగళవారం కొలతలు నిర్వహించారు. ఫామ్ హౌస్ తనది కాదని మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించినప్పటికీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అఫిడవిట్లో ఫామ్ హౌస్ స్థలం కేటీఆర్ భార్య శైలిమ పేరుతో ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ఎంపీ హోదాలో జన్వాడ ఫామ్ హౌస్ వెళ్లగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి 14 రోజుల పాటు జైలులో పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హైడ్రా కూల్చివేతలు చేపడుతున్నదని తెలియడంతో ముందు జాగ్రత్త చర్యగా ఫామ్ హౌస్ యజమానిగా చెప్పుకుంటున్న ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు నుంచి ఊరట లభించలేదు. చట్టపరంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పునివ్వడంతో హైడ్రా దూకుడు పెంచింది. అయితే దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. చట్ట విరుద్ధంగా ఉంటే కూల్చివేతలు చేపట్టాలని, ఫామ్ హౌస్ తన స్నేహితుడిదని. లీజుకు తీసుకున్నానని బుకాయించే ప్రయత్నం చేశారు.
మంగళవారం రంగారెడ్డి జిల్లా నీటి పారుదల విభాగానికి చెందిన ఇంజినీర్లు జన్వాడలోని ఫామ్ హౌస్‌కు వెళ్లారు. ఎంత విస్తీర్ణంలో ఫామ్ హౌస్ నిర్మాణం చేశారు? హద్దులు, ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని ఎంత మేర కబ్జా చేశారు? అనేదానిపై కొలతలు వేసినట్టు సమాచారం. ఫిరంగి నాలాను ఎంత మేర పూడ్చారు? ఎఫ్టీఎల్ ఎంత వరకూ ఉన్నదనేది అక్కడ కలియదిరిగి అంచనా వేశారని తెలిసింది. నీటిపారుదల ఇంజినీర్లతో పాటు హైడ్రా అధికారులు కూడా ఫామ్ హౌస్‌ను సందర్శించారు. కూల్చివేతలు పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటుంది, ఎంత మంది సిబ్బంది అవసరం, అడ్డంకులు ఏమి ఉన్నాయనే అంశాలపై సమాలోచనలు చేసినట్లు తెలిసింది. కొలతలు పూర్తికావడం, హైకోర్టు నుంచి అడ్డంకులు లేకపోవడంతో ఏ క్షణమైనా హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతలు పూర్తి చేయనున్నట్లు పరిస్థితులు తెలియచేస్తున్నాయి.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు
చెరువుల కబ్జాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కాలేజీలపైకి వస్తే విద్యార్థులే చూసుకుంటారన్న ఒవైసీ హెచ్చరికపై స్పందించిన రంగనాథ్.. ఒవైసీ అయినా, మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్ వర్తిస్తుందని తేల్చి చెప్పారు. విద్యార్థులు రోడ్డున పడకూడదనే ఆలోచిస్తున్నామని అన్నారు. విద్యాసంవత్సరం మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులు నష్టపోతారని ఆలోచిస్తున్నామని తెలిపారు. ఆయా కాలేజీల నిర్మాణాలు అక్రమమైతే తొలగించేందుకు సమయం ఇస్తామని, వాళ్లకు వాళ్లుగా తొలగించకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు రంగనాథ్.