Teenmar Mallanna| కవిత మనుషులే దాడి చేశారు: తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna| కవిత మనుషులే దాడి చేశారు: తీన్మార్ మల్లన్న

గన్ మెన్ తుపాకితో నన్ను చంపాలనుకున్నారు
దాడులతో బీసీ ఉద్యమం..బీసీ రాజకీయ పార్టీ ఆగదు
రక్తపు మరకలతోనే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం
కిరాయి గుండాలతో దాడి చేయించి..నాపై ఫిర్యాదు విడ్డూరం
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

విధాత, హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మనుషులే నా కార్యాలయంపైన, సిబ్బందిపైన దాడి చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) తెలిపారు. దాడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 20-30 మంది జాగృతి..కవిత జిందాబాద్ అంటూ నాపై దాడి చేశారని..నా గన్ మెన్లపై కూడా దాడి చేశారన్నారు. కల్వకుంట్ల సుజిత్ రావు నా గన్ మెన్ బాలకృష్ణ నుంచి గన్ లాక్కుని నాపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడని.. శ్రీనివాస్ అనే మరో గన్ మెన్ నుంచి పిస్టల్ లాక్కోబోయారన్నారు. కవిత మనుషులే దాడి చేశారని ఆధారాలు ఉన్నాయన్నారు. నేను బీసీల రాజకీయ పార్టీ ప్రకటన చేయగానే గంటల వ్యవధిలో కవిత తన మనుషులతో నాపై దాడి చేయించిందన్నారు. దాడులతో బీసీలు భయపడుతారని కవిత భావిస్తుందని..నా కార్యాలయంపై దాడితో ఏర్పడిన రక్తపు మరకల సాక్షిగా చెబుతున్నామని తెలంగాణ రాష్ట్రంలో బరాబర్ రాజకీయ పార్టీగా బీసీ పార్టీతో ముందుకు రాబోతున్నామన్నారు. బీసీలు రాజకీయ పార్టీ రావద్దనే కుట్రలో భాగంగానే కవిత ఈ దాడులకు పాల్పడిందన్నారు.

మేం ప్రభుత్వంపై పోరాడుతుంటే నీకు బాధ ఎందుకు?

తెలంగాణ ఉద్యమంలో 1500మందిని కేసీఆర్ చంపాడని..నేరేళ్ల ఘటనలో దళితులను కేటీఆర్ చంపించాడని..కేటీఆర్ మనుషులు గతంలో నా కార్యాలయంపై దాడికి పాల్పడ్డారన్నారు. కాని కవిత హత్యాయత్నం చేయిస్తుందని మాకు ఈ దాడితో అర్థమైందన్నారు. దాడులతో బీసీ ఉద్యమం ఆగబోదని..రాబోయే మూడేళ్లలో మిమ్మల్ని రాజకీయంగా అణిచివేయడం ఖాయమన్నారు. ఇక మీరా మేమా తేల్చుకుంటామని..కల్వకుంట్ల కుటుంబం…రెండున్నర కోట్ల బీసీలా ఈ రాష్ట్రంలో తేల్చుకుంటామన్నారు. మేం మా వాటా కోసం ప్రభుత్వాన్ని అడుతున్నాం..ప్రభుత్వం మాసలహాలు వింటుంది..తప్పులుంటే సరిదిద్దుకుంటుందన్నారు. ప్రభుత్వంపై మేం పోరాడుతుంటే నీకు బాధ ఎందుకని కవితను మల్లన్న ప్రశ్నించారు. నీకు ఉనికి కావాలంటే కేసీఆర్ దగ్గర అడుక్కొవాలన్నారు. ఇలాంటి దాడులతో బీసీలు భయపడుతారనుకుంటే నీ భ్రమ..మరింత దిగజారి ప్రజల్లో చులనకవుతారని…మీరు ఇలాంటి చిల్లర మల్లర పనులు బంద్ చేయాలని డిమాండ్ చేశారు. మీ నాయన మీద, అన్నమీద ఉన్న ప్రస్టేషన్ మా బీసీలపై చూపిస్తే సహించేది లేదన్నారు.

కవిత ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేయాలి

సాటి ఎమ్మెల్సీపై దాడికి పాల్పడిన కవిత ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని..దీనిపై మండలి చైర్మన్ సహా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. ప్రజాక్షేత్రంలో బీసీ ఆడబిడ్డలు కవితను తరిమికొట్టడం ఖాయమన్నారు. కవిత రాజకీయాలను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం..ఈ రక్తపు మరకలతోటే రేపటి నుంచి ప్రజల వద్దకు వెలుతున్నామన్నారు. కవిత కిరాయి గుండాలతో నాపై దాడి చేసి..ఉల్టా నాపై మండలి చైర్మన్ కు, డీజీపీకి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: తీన్మార్ మల్లన్న

బీసీ ఉద్యమంతో కవితకు సంబంధం లేదన్న నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మలన్న స్పష్టం చేశారు. నీ కులానికి మా కులాలకు కంచం పొత్తు ఉందా..మంచం పొత్తు ఉందా అని అడిగానన్నారు. కంచం పొత్తు అంటే కలిసి బంతి భోజనం చేయడమని.. మంచం పొత్తు అనేది తెలంగాణలో వియ్యం అందుకునే సందర్భంలో వాడే ఊతపదం అన్నారు. ఇలాంటి దాడి ఘటనతో భయపడబోనన్నారు. దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్లాల్లో నాకు తెలుసు అని మల్లన్న చెప్పారు.