విధాత, హైదారాబాద్ : కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay )పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పరువు నష్టం దావా(Defamation Case) వేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో తనకు పరువు నష్టం జరిగిందంటూ ఆయనపై కేటీఆర్ రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్ ని డిసెంబర్ 15న సివిల్ కోర్టు విచారించనుంది.
గతంలో కేటీఆర్ డ్రగ్స్ వాడరని, ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని 2024 అక్టోబర్ 23 బుధవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు కేటీఆర్ పరువు నష్టం నోటీసు పంపారు. ఇటీవల ఆగస్టు 8, 2025న విలేకరుల సమావేశంలో గ్రూప్1 పేపర్ లీకేజీ ఆందోళన సమయంలో నా ఫోన్ ట్యాప్ చేసి పోలీసులు ముందుగానే మా ఇంటికి వచ్చారని బండి సంజయ్ అన్నారు. గ్రూప్–1 పేపర్ లీకేజీ కేసు విచారించిన జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలపై ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. 2025, ఆగస్ట్ 12న బండి సంజయ్కు లీగల్ నోటీస్ పంపారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై చేసిన ఆరోపణలపై 48 గంటల్లో క్షమాపణలు చెప్పాలని.. లేదంటే కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. నోటీసులపై బండి సంజయ్ స్పందిచకపోవడంతో కేటీఆర్ న్యాయ పోరాటానికి దిగారు. తాజాగా సంజయ్ పై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తన ప్రతిష్టను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఈ ఆరోపణలు చేశారని కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ తన తన రాజకీయ ప్రత్యర్థులపై వేసిన రెండవ పరువు నష్టం కేసు ఇది. సమంతా రూత్ ప్రభు నుంచి నటుడు నాగ చైతన్య విడాకులకు తనను బాధ్యురాలిని చేస్తూ తెలంగాణ అటవీ, పర్యావరణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ కేటీఆర్ ఆమెపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు.