bail to Kavitha । కవితకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
బీఆరెస్ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.

bail to Kavitha । బీఆరెస్ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ (ఇప్పటికే రద్దయింది)లో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ, సీబీఐ దాఖలు చేసిన కేసులో ఆమె ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ధర్మాసనం ఈడీ, సీబీఐ వ్యవహార శైలిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా వ్యవహరించాలని పేర్కొన్నది. ఇదే కేసులో ఎంపిక చేసుకున్న కొందరిని అప్రూవర్‌లుగా మార్చుకున్న పద్ధతిని ప్రశ్నించింది. ‘విచారణ పారదర్శకంగా ఉండాలి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని సాక్షిగా చేశారు. రేపొద్దున్న మీకు నచ్చినవారిని ఎంచుకుంటారా? ఏ నిందితుడినీ మీరు ఎంపిక చేసుకోవడం, నిర్ణయించుకోవడం చేయజాలరు. ఇక పారదర్శకత ఎక్కడుంది? ’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది పాదర్శక, యోగ్యమైన విధానమా? అని నిలదీసింది. కవిత ఐదు నెలలకు పైగా జైల్లో ఉన్నారని, ఆమెను కేంద్ర సంస్థలు దర్యాప్తు చేయడం ముగిసిందని వ్యాఖ్యానిస్తూ బెయిల్ మంజూరు చేసింది.
ఉన్నస్థాయిలో ఉన్న మహిళకు పీఎంఎల్‌ఏ సెక్షన్ 45 వర్తించదన్న ఢిల్లీ హైకోర్టు అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. ఎమ్మెల్సీ కవితను 2023 మార్చి 15న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఆప్ నేతలకు వంద కోట్లను ఇచ్చినట్టు చెబుతున్న సౌత్ గ్రూప్‌లో కవిత కీలక సభ్యురాలని ఆరోపిస్తూ ఆమెను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తదుపరి తీహార్ జైలు నుంచి ఏప్రిల్ 11న సీబీఐ అధికారులు అమెను అరెస్టు చేశారు.
ఇటువంటి కేసు దర్యాప్తు కోసం దరఖాస్తుదారు (కవిత) కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొన్నది. రెండు కేసులలో బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై ఒకటిన ఇచ్చిన ఆదేశాలను కోర్టు పక్కనపెట్టింది. రెండు కేసులలో పది లక్షల చొప్పు బెయిల్ బాండ్లు సమర్పించాలని కవితను ఆదేశించిన కోర్టు.. ఆమె తన పాస్‌పోర్టును విచారణ కోర్టుకు అప్పగించాలని సూచించింది. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు లేదా సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించరాదని కవితకు స్పష్టం చేసింది. ఈ స్కాంలో కవిత పాత్ర ఉన్నదనేందుకు మెటీరియల్‌ను చూపించాలని ఈడీ, సీబీఐలను కోర్టు కోరింది. ఇప్పటికే రెండు సంస్థలు కవిత దర్యాప్తును పూర్తి చేసినందున ఆమెకు బెయిల్ ఇవ్వాలని కవిత తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి కోరారు. ఇదే కేసులో ఆగస్ట్ 9న ఆప్ నేత మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. తన మొబైల్ ఫోన్లను కవిత ధ్వంసం/ ఫార్మాట్ చేశారని, సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని దర్యాప్తు సంస్థల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు పేర్కొన్నారు. అయితే.. అవన్నీ బోగస్ అని రోహత్గి స్పష్టం చేశారు.