10th Paper Leak | అది లీక్‌ కాదు.. పరీక్ష మధ్యలో బయటకు వచ్చింది: CP రంగనాథ్

టెన్త్ హిందీ పేపర్ లీకేజీపై కదిలిన యంత్రాంగం విద్యాశాఖ అధికారులకు మంత్రి సబిత ఆదేశం పోలీసులను ఆశ్రయించిన విద్యాశాఖ అధికారులు లీకేజీ పై రంగంలోకి దిగిన పోలీసులు ఇది లీకేజీ కాదు కానీ.. లోపమే అంటున్న విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టెన్త్ పేపర్ లీకేజీ సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి తీవ్ర తలనొప్పిగా పరిణమించాయి. వికారాబాద్‌లో తొలిరోజే తెలుగు పేపర్ లీకేజీ వ్యవహారం దుమారం రేపు తుండగా, మంగళవారం హిందీ పేపర్ లీక్ అయినట్లు […]

10th Paper Leak | అది లీక్‌ కాదు.. పరీక్ష మధ్యలో బయటకు వచ్చింది: CP రంగనాథ్
  • టెన్త్ హిందీ పేపర్ లీకేజీపై కదిలిన యంత్రాంగం
  • విద్యాశాఖ అధికారులకు మంత్రి సబిత ఆదేశం
  • పోలీసులను ఆశ్రయించిన విద్యాశాఖ అధికారులు
  • లీకేజీ పై రంగంలోకి దిగిన పోలీసులు
  • ఇది లీకేజీ కాదు కానీ.. లోపమే అంటున్న

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టెన్త్ పేపర్ లీకేజీ సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి తీవ్ర తలనొప్పిగా పరిణమించాయి. వికారాబాద్‌లో తొలిరోజే తెలుగు పేపర్ లీకేజీ వ్యవహారం దుమారం రేపు తుండగా, మంగళవారం హిందీ పేపర్ లీక్ అయినట్లు జోరుగా ప్రచారం సాగడంతో ఏ సమాధానం చెప్పాలో తెలియక ప్రభుత్వం, అధికార యంత్రాంగం అయోమయంలో పడిపోయాయి.

ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ సమస్యపై తీవ్రంగా ప్రతిస్పందించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించి హనుమకొండ, వరంగల్ జిల్లాల డీఈవో లతో మాట్లాడారు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఆమె ఆరా తీశారు. దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారులకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు నుంచి ఇదే విధమైన ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.

పోలీసులను ఆశ్రయించిన విద్యాశాఖ అధికారులు

టెన్త్ హిందీ పేపర్ లీకేజీ వార్తల నేపథ్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల డీఈవో లు, అధికారులు తదితరులు వరంగల్ కమిషనరేట్ పోలీసులను ఆశ్రయించారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశంతో హుటాహుటిన వరంగల్ సీపీ కార్యాలయానికి చేరుకొని ఈ సంఘటనకు సంబంధించి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్వపరాలపై ప్రచార మాధ్యమాలలో వస్తున్న వివరాల కంటే తమ వద్ద కూడా అదనపు సమాచారం ఏం లేదని సంఘటనపై విచారణ జరపాలని కోరారు. దీనిపై స్పందించిన సీపీ విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు

రంగంలోకి దిగిన వరంగల్ పోలీసులు

టెన్త్ హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కమిషనరేట్ పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. అనుమానిత సెంటర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. వరంగల్ సీపీ రంగనాథ్ ఆదేశాలతో ప్రచారంలో ఉన్న కమలాపూర్ మండలం ఉప్పల్ ప్రాంతంలో ఇప్పటికే ఎంక్వయిరీ చేసినప్పటికీ ఎలాంటి ఆధారం లభించలేదు. ఈ సంఘటన సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు విచారణలో నిమగ్నమయ్యారు

పేపర్ లీకేజీ కాదు కానీ.. పేపర్ బయటికి వచ్చింది: సీపీ రంగనాథ్

పరీక్షలు ప్రారంభమైన తర్వాత హిందీ పేపర్ బయటికి వచ్చినందున దీన్ని లీకేజీ అనలేము కానీ…. బయటకు వచ్చినట్లుగా భావిస్తున్నామని వరంగల్ సీపీ రంగనాథ్ మీడియాకు వెల్లడించారు. అయితే ఈ పేపర్ లీకేజీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నుంచి జరిగిందా? ఇతర ప్రాంతాలలో జరిగిందా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. నిర్వహణ పరమైన లోపం జరిగినట్టుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఎందుకంటే పరీక్ష సెంటర్ల లోపలికి విద్యార్థులు వెళ్లిన తర్వాత పేపర్ బయటికి వచ్చినందున రాసేవారికి పెద్దగా ఉపయోగపడకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇన్విజిలేట‌ర్లే చేసి ఉంటార‌న్న అనుమానాల‌ను కూడా సీపీ వ్యక్తం చేశారు. ముందుగా గ‌తంలో టీవీ చానెల్‌లో ప‌నిచేసిన ఓ రిపోర్టర్ నుంచి విద్యాశాఖ అధికారుల‌కు స‌మాచారం అందిన‌ట్లు సీపీ వెల్లడించారు. అత‌నికి స‌మాచారం ఏ విధంగా అందింద‌న్న దానిపై కూడా విచార‌ణ జ‌రుపుతున్నట్లుగా పేర్కొన్నారు. సాయంత్రంలోగా నిందితుల‌ను ప‌ట్టుకునే ప్రయ‌త్నం చేస్తామ‌న్నారు.

ఇత‌ర జిల్లాల్లోనూ పేప‌ర్లు సోష‌ల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లోనూ తిరుగుతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. ఈనేప‌థ్యంలోనే వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ జిల్లాల్లోనే పేప‌ర్ ప‌త్రాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లుగా ఆధారాల్లేవ‌ని అన్నారు. లీక్ అయిన పేపరు ఈరోజు పరీక్షకు సంబంధించినదేనని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారని ఆయన స్పష్టం చేశారు.

లోపాలపై పటిష్ట చర్యలు చేపడతాం

పరీక్ష సెంటర్ల నిర్వహణ, పర్యవేక్షకులపై నిఘా, విద్యాశాఖ పరమైన నిబంధనలు అన్నీ పరిశీలిస్తున్నామన్నారు. ఏదేమైనా నిర్వహణ లోపంగా భావిస్తున్నట్లు సీపీ స్పష్టం చేశారు. ఈ లూపోల్‌ను కనిపెట్టి సరిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

విద్యాశాఖ అధికారులు మేము ఈ విషయాన్ని మీడియా ద్వారానే తెలుసుకున్నామని చెప్పారని అన్నారు. అయితే అనుమానిస్తున్నట్లు ఉప్పల్ ప్రాంతం నుంచి లీకైనట్లు ఎలాంటి ఆధారాలు ప్రస్తుతానికి లభించలేదని స్పష్టం చేశారు.

సైబర్ క్రైమ్ పోలీసులు ఈ విషయం ఎలా బయటికి వచ్చిందనే అంశాలను టెక్నాలజీ ద్వారా తెలుసుకునే పనిలో నిమగ్నం అయ్యారని చెప్పారు. ముందుగా ఈ వార్త ఏ గ్రూపులో పోస్ట్ అయిందో తెలిసిపోతుందని, ఆ తదుపరి దోషులెవరో తేలిపోతుందని అన్నారు.

అయితే పరీక్ష సెంటర్లు పెద్ద మొత్తంలో ఉన్నందున సరియైన పోలీసు నిఘా పెట్టేందుకు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తమ పరంగా తీసుకుంటామన్నారు. విద్యాశాఖ నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని సీపీ తెలియచేశారు.