Protein Shake | ప్రొటీన్ షేక్ తాగితే.. బాలుడి ప్రాణాలు పోయాయి! ఇంతకు.. అవి సురక్షితమేనా..?
Protein Shake విధాత: ప్రొటీన్ షేక్ తీసుకోవడం వల్లనే 16 ఏళ్ల బాలుడు బ్రెయిన్ దెబ్బ తిని మరణించాడని లండన్ (London) లోని వెస్ట్ మిడిల్ సెక్స్ హాస్పటల్ తాజాగా ప్రకటించింది. 2020 ఆగస్టు 15న భారత సంతతికి చెందిన పుష్ప తన కుమారుడికి కాస్త కండ పెరగాలని ఒక ప్రొటీన్ షేక్‌ను కొని తెచ్చారు. అది తాగిన అతడి కుమారు రోహన్‌కు మూడు రోజుల తర్వాత అనారోగ్యం కలగడంతో మిడిల్‌సెక్స్ ఆసుపత్రికి తరలించగా అతడికి చికిత్స […]

Protein Shake
విధాత: ప్రొటీన్ షేక్ తీసుకోవడం వల్లనే 16 ఏళ్ల బాలుడు బ్రెయిన్ దెబ్బ తిని మరణించాడని లండన్ (London) లోని వెస్ట్ మిడిల్ సెక్స్ హాస్పటల్ తాజాగా ప్రకటించింది. 2020 ఆగస్టు 15న భారత సంతతికి చెందిన పుష్ప తన కుమారుడికి కాస్త కండ పెరగాలని ఒక ప్రొటీన్ షేక్‌ను కొని తెచ్చారు.
అది తాగిన అతడి కుమారు రోహన్‌కు మూడు రోజుల తర్వాత అనారోగ్యం కలగడంతో మిడిల్‌సెక్స్ ఆసుపత్రికి తరలించగా అతడికి చికిత్స పని చేయని స్థాయిలో బ్రెయిన్ దెబ్బతినడంతో మృతి చెందాడు. అయితే అతడి బ్రెయిన్‌కు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో అక్కడి వైద్యులకు అంతు పట్టలేదు.
దీంతో మృతుడి శరీర భాగాలను ఆసుపత్రిలోనే భద్రపరిచి పరిశోధనలు చేశారు. అతడు ఆసుపత్రిలో చేరడానికి మూడు రోజుల ముందు తీసుకున్న ప్రొటీన్ షేకే రోహన్ మరణానికి కారణమైందని తాజాగా నివేదికను విడుదల చేశారు. ప్రొటీన్ షేక్ తీసుకోవడం వల్ల అతడిలో దాని స్థాయి పెరిగిపోయి అరుదైన జెనెటిక్ పరిస్థితి అయిన ఆర్నథైన్ ట్రాన్స్‌కారంబైలేస్ (ఓటీసీ) తలెత్తిందని నివేదికలో పేర్కొన్నారు.
దీంతో అసలు ప్రొటీన్ షేక్‌ల శాస్త్రీయత, అవసరంపై నిపుణులు గొంతెత్తారు. అంతే కాకుండా వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్‌లను తప్పని సరిగా ప్రొటీన్ షేక్‌ల ఉత్పత్తులపై ముద్రించాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.
ప్రొటీన్ గురించి తెలుసా?
మనకి కండ పెరగాలంటే ప్రొటీన్ అనే మైక్రో న్యూట్రియంట్ చాలా అవసరం. అందుకే కండలు పెంచే వారంతా ఈ ప్రొటీన్ షేక్‌లను ఆశ్రయిస్తారు. అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి డ్రింక్‌లను ఆశ్రయించాలి. ఎంత మొత్తంలో ప్రొటీన్‌ను తీసుకుంటే సురక్షితం అన్న అంశాలపై గురుగ్రాంలోని సీకే బిర్లా హాస్పటల్‌లో పని చేస్తున్న డా.తుషాల్ తయాల్ కొన్ని వివరాలు వెల్లడించారు.
ప్రొటీన్ షేక్‌లు సురక్షితమేనా?
మార్కెట్‌లో దొరికేవన్నీ సహజంగా తయారుచేసిన ప్రొటీన్ ఉత్పత్తులు కాదని తుషార్ పేర్కొన్నారు. వీటిని ప్రాథమికంగా సోయాబీన్స్, పీస్, వరి, గుడ్లు, పాలు మొదలైన వాటితో చేసినా తర్వాత కృత్రిమ పదార్థాలనూ కలుపుతున్నారని తెలిపారు. వీటిలో కృత్రిమ షుగర్‌లు, విటమిన్‌లు, ఫ్లేవరింగ్ ఏజెంట్లు, థిక్‌నర్స్ మొదలైనవి ఉంటాయన్నారు. ‘ఒక యువకుడు 50 కేజీల బరువు ఉన్నాడనుకుంటే అతడికి రోజుకు 50 x 0.8 గ్రాముల ప్రొటీన్ అవసరం.
అంతకన్నా ఎక్కువ తీసుకుంటే అది కిడ్నీలపై అధిక ఒత్తిడిని కలిగించి.. వాటి వైఫల్యానికి దారి తీస్తాయి. కొంతమందికి అలర్జీ వచ్చే ప్రమాదమూ ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. సోయాతో తయారైన ప్రొటీన్ పౌడర్ కాస్త సైడ్ ఎఫెక్ట్‌లు ఎక్కువ ఇస్తుందని తుషార్ తెలిపారు.
అందులో ఫైటో ఈస్ట్రోజన్ ఎక్కువ మోతాదులో ఉండటంతో హార్మోన్‌ల సమతౌల్యం దెబ్బతిని జుట్టు రాలడం మొదలవొచ్చని వెల్లడించారు. మొత్తంగా చెప్పేదేంటంటే ప్రొటీన్ను కృత్రిమంగా తీసుకుంటే సమస్యలను ఆహ్వానించినట్టేనని వాటి వల్ల లివర్, కిడ్నీ ప్రమాదంలో పడతాయని స్పష్టం చేశారు.
టీనేజర్లు ప్రొటీన్ డ్రింక్‌లను మానేయాలా?
ఏ వయసు వారు ప్రొటీన్ డ్రింక్‌లను తీసుకోవచ్చు, తీసుకోకూడదు అనే దానిపై ఎటువంటి నిబంధనలూ భారత్‌లో లేవని తుషార్ వెల్లడించారు. ఇప్పుడు వస్తున్న ప్రొటీన్ షేకుల్లో పెద్ద మొత్తంలో షుగర్, సింథటిక్ పదార్థాలు ఉండటం వల్ల అవి తీసుకున్న వారిలో ఊబకాయం, హార్మోన్ సమస్యలు తలెత్తుతున్నాయని వెల్లడించారు. ప్రొటీన్ను మన ఆహారంలో భాగంగా సహజంగానే తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒక వేళ సప్లిమెంట్లు తీసుకోవాల్సి వచ్చినా డాక్టర్ల పర్యవేక్షణలోనే అది జరగాలని తెలిపారు.