ఇండియాలో 177 పెద్ద పులులు మృతి.. అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లోనే

2023 ఏడాదిలో ఇండియాలో 177 పెద్ద పులులు మృతి చెందిన‌ట్లు కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ నివేదిక‌ వెల్ల‌డించింది.

ఇండియాలో 177 పెద్ద పులులు మృతి.. అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లోనే

న్యూఢిల్లీ : 2023 ఏడాదిలో ఇండియాలో 177 పెద్ద పులులు మృతి చెందిన‌ట్లు కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ నివేదిక‌ వెల్ల‌డించింది. అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 45 పులులు మృతి చెందిన‌ట్లు పేర్కొంది. అయితే కొన్ని మీడియాల్లో 2023లో 202 పులులు చ‌నిపోయిన‌ట్లు క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ క‌థ‌నాల‌పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. డిసెంబ‌ర్ 25, 2023 నాటికి కేవ‌లం 177 పులులు మాత్ర‌మే చ‌నిపోయాయ‌ని స్ప‌ష్టం చేసింది. ఇందులో 54 శాతం పులులు టైగ‌ర్ రిజ‌ర్వ్ వెలుప‌లే చ‌నిపోయిన‌ట్లు తెలిపింది.

మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 45, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 40, ఉత్త‌రాఖండ్‌లో 20, త‌మిళ‌నాడులో 15, కేర‌ళ‌లో 14 పులులు చ‌నిపోయిన‌ట్లు కేంద్రం తెలిపింది.ప్ర‌స్తుతం ఇండియాలో 3167 పులులు ఉన్న‌ట్లు పేర్కొంది. ప్రపంచంలోని 70 శాతానికి పైగా పులులకు ఇండియా నిల‌యంగా ఉంది. దేశంలో కనీసం 3167 పులులు ఉన్నాయ‌ని కేంద్రం తెలిపింది. భారతదేశంలో పులులు ఏడాదికి 6 శాతం ఆరోగ్యకరమైన రేటుతో పెరుగుతున్నాయని చెప్పింది.

దేశ వ్యాప్తంగా మొత్తం 54 టైగ‌ర్ రిజ‌ర్వ్ కేంద్రాలు ఉన్నాయ‌ని కేంద్రం తెలిపింది. ఈ కేంద్రాలో 78 వేల చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. దేశంలోని భౌగోళిక ప్రాంతంలో 2.30 శాతానికి పైగా విస్త‌రించి ఉంది. ఈ ఏడాది కొత్త‌గా రాణి దుర్గావ‌తి టైగ‌ర్ రిజ‌ర్వ్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది.