అమెరికాలో హత్యకు గురైన తెలుగు విద్యార్థి అభిజిత్‌ పరుచూరి

ఉన్నత చదువులు చదవాలని విదేశాలకు తరలి వెళుతున్న భారతీయ విద్యార్థుల జీవితాలు అప్పుడప్పుడు విషాదాంతం అవుతున్నాయి.

  • By: Somu    latest    Mar 18, 2024 10:33 AM IST
అమెరికాలో హత్యకు గురైన తెలుగు విద్యార్థి అభిజిత్‌ పరుచూరి

బోస్టన్‌: ఉన్నత చదువులు చదవాలని విదేశాలకు తరలి వెళుతున్న భారతీయ విద్యార్థుల జీవితాలు అప్పుడప్పుడు విషాదాంతం అవుతున్నాయి. తాజాగా తెలుగు విద్యార్థి అభిజిత్‌ పరుచూరి (20) అమెరికాలో హత్యకు గురయ్యాడు. డబ్బు, అతని ల్యాప్‌టాప్‌ కోసం అభిజిత్‌ను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.


అభిజిత్‌ తల్లిదండ్రులు పరుచూరి చంద్రశేఖర్‌, శ్రీలక్ష్మి. వారిది గుంటూరు జిల్లా బుర్రిపాలెం. అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీలో అభిజిత్‌ ఇంజినీరింగ్‌ చదువుకుంటున్నాడు. అభిజిత్‌ తల్లిదండ్రులకు అతడొక్కడే కుమారుడు. అతడిని హత్య చేసినవారిని ఇంకా గుర్తించలేదు. అభిజిత్‌ శవం ఒక కారులో యూనివర్సిటీ ప్రాంగణంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో పడేసి ఉండటం కనిపించిందని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన హత్య అనేక సందేహాలను రేకెత్తించింది.


ఇతర విద్యార్థులతో అభిజిత్‌ వాగ్వాదానికి దిగి ఉండొచ్చన్న అనుమానాలూ ఉన్నాయి. అభిజిత్‌ చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థి అని అతని కుటుంబీకులు పేర్కొన్నారు. అభిజిత్‌ పై చదువులకు విదేశాలకు వెళతానంటే అతడి తల్లి గట్టిగా వ్యతిరేకించారని, కానీ, అతడి భవిష్యత్తు బాగుంటుందని అంగీకరించారని తెలిపారు. అభిజిత్‌ భౌతికకాయాన్ని శుక్రవారం రాత్రి బుర్రిపాలెంకు తీసుకువచ్చారు. ఈ ఏడాది అమెరికాలో దాడులకు గురై చనిపోయిన ఘటనల్లో ఇది తొమ్మిదవది.