నిఘా సమాచారాన్ని బీజింగ్‌కు పంపిన స్పై బెలూన్‌..! అమెరికా దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడి..!

ఈ ఏడాది మొదట్లో అమెరికా గగనతలంలో చైనాకు చెందిన స్పై బెలూన్లు ఎగిరిన విషయం తెలిసిందే

నిఘా సమాచారాన్ని బీజింగ్‌కు పంపిన స్పై బెలూన్‌..! అమెరికా దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడి..!

SPY Balloon | ఈ ఏడాది మొదట్లో అమెరికా గగనతలంలో చైనాకు చెందిన స్పై బెలూన్లు ఎగిరిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై అమెరికా దర్యాప్తు చేపట్టగా.. ఇందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. చైనా గూఢచారి బెలూన్‌ ఇంటర్నెట్‌ను వినియోగించి బీజింగ్‌కు సమాచారాన్ని పంపిందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. గగనతలంలో గుర్తు తెలియని బెలూన్‌ ఎగురుతూ కనిపించడంతో అమెరికా దాన్ని కూల్చివేసింది. బెలూన్ల సాయంతో చైనా గూఢచర్యం చేస్తోందని అప్పట్లోనే అమెరికా ఆరోపించింది. ఈ ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొంది.


కమ్యూనికేషన్ కోసం అమెరికన్ ఇంటర్నెట్ వినియోగం


చైనీస్ బెలూన్ అమెరికన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌ను సైతం ఉపయోగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ పేరును అమెరికా ఇంకా వెల్లడించలేదు. చైనీస్ గూఢచారి బెలూన్ అమెరికా ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను ఉపయోగించిందని పలు నివేదికుల పేర్కొన్నాయి.


అయితే, దీనిపై స్పందించేందుకు ఎఫ్‌బీఐ, ఆఫీస్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ నిరాకరించారు. చైనీస్ బెలూన్ చైనాకు నావిగేషన్, లొకేషన్ సంబంధిత సమాచారాన్ని మాత్రమే పంపిందని.. ఇతర ముఖ్యమైన ఇంటెలిజెన్స్ డేటాను సేకరించిందని మాత్రమే సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఏం డేటా పంపిందనేది సేకరించాల్సి ఉందని.. అయితే అంతకు ముందు అమెరికా బెలూన్‌ను కూల్చివేసినట్లు అధికారులు చెబుతున్నారు.


గూఢచారి బెలూన్ శిథిలాలను అట్లాంటిక్ మహాసముద్రం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ శిథిలాలను పరిశీలించారు. చిత్రాలు, ఇతర డేటా సహా అన్నింటిని బెలూన్‌లో నిల్వ ఉన్నాయని.. వాటి ఆధారంగా అధికారులు అధ్యయనం చేసినట్లు పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.


ఆరోపణలను ఖండించిన చైనా


అయితే, బెలూన్‌ వాతావరణ సమాచారాన్ని సేకరించే బెలూన్ మాత్రమేనని చైనా చెబుతూ వస్తున్నది. ఈ బెలూన్‌ను గూఢచర్యానికి ఉపయోగించడం లేదని, దారి తప్పి అమెరికాకు చేరుకుందని చైనా పేర్కొంది. అదే సమయంలో ఇటీవలకాలంలో చైనా కనీసం ఐదుఖండాల్లో భారీ బెలూన్లను ప్రయోగించిందని అమెరికన్ అధికారులు పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించేందుకు చైనా ఆర్మీ ఈ కుట్ర పన్నిందని అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు.