కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్.. ప్రభుత్వ అధికారి కుమార్తెపై అఘాయిత్యం
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకున్నది. 22 ఏండ్ల యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది

- యూపీలోని బారాబంకీ జిల్లాలో దారుణం
- ముగ్గురు నిందితుల అరెస్టు.. కారు సీజ్
విధాత: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకున్నది. 22 ఏండ్ల యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ముగ్గురు దుండగులు యువతికి మత్తు పానియం తాగించి కదులుతున్న కారులోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..
ప్రభుత్వ అధికారి కుమార్తె కొంతకాలంగా కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ నెల ఐదో తేదీన సైకియాట్రీ డిపార్ట్‌మెంట్‌ను ఆమె సందర్శించింది. తన మొబైల్ ఫోన్‌ను చార్జ్ చేసుకోవడానికి ఆమె తరచుగా సందర్శించే స్థానిక టీ స్టాల్ వ్యాపారి సత్యం మిశ్రా సహాయం కోరింది. ఆమె మొబైల్ ఫోన్‌కు సమీపంలో పార్క్ చేసిన అంబులెన్స్‌లో అతడు చార్జింగ్ పెట్టాడు.
అయితే, కొంత సమయం తర్వాత అంబులెన్స్ అక్కడ నుంచి వెళ్లిపోయింది. మిశ్రాతో కలిసి ఆమె అంబులెన్స్ కోసం వెతకడం ప్రారంభించింది. మిశ్రా ఆమెను బారాబంకిలోని సఫేదాబాద్ ప్రాంతంలోని ధాబాకు కారులో తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు మత్తు మందు కలిపిన పానీయం తాగించాడు. మరో ఇద్దరితో కలిసి ఆమెపై కదులుతున్న కారులోనే లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇందిరానగర్ ప్రాంతంలో ఆమెను దించేశారు.
యువతి ఫిర్యాదు ఆధారంగా ఆదివారం వజీర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మరో ఇద్దరు నిందితులను సుహైల్, మహ్మద్‌గా గుర్తించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు నేరానికి ఉపయోగించిన కారు, రెండు మొబైల్ ఫోన్లు, రూ.19,830 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.