అధికారుల నిర్ల‌క్ష్యం.. అదనంగా మూడేండ్లు జైలులోనే వ్య‌క్తి

  • By: Somu    latest    Sep 27, 2023 11:38 AM IST
అధికారుల నిర్ల‌క్ష్యం.. అదనంగా మూడేండ్లు జైలులోనే వ్య‌క్తి
  •  బెయిల్ మెయిల్ ఓపెన్ చేయ‌లే!
  • అధికారుల నిర్ల‌క్ష్యంతో జైలు జీవితం
  • బాధితుడికి 1 ల‌క్ష ప‌రిహారం ఇవ్వాల‌ని గుజ‌రాత్ ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశం


విధాత‌: గ‌తంలో ఉద్యోగ అపాయింట్‌మెంట్ లెట‌ర్లు పోస్టాఫీసుల ద్వారా అందేవి. కొన్నిసార్లు లెట‌ర్లు చేరాల్సిన తేదీకి ఆల‌స్యంగా అంద‌డం మూలంగా అభ్య‌ర్థులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వ‌చ్చేది. కానీ, ఇప్పుడు ఆధునిక‌ యుగం.. అన్ని స‌మాచారాలు ఈమెయిల్స్‌, మెస్సేజ్‌ల ద్వారా క్ష‌ణాల్లోనే అందుతున్నాయి. అయినా, కొంద‌రు వాటిని ఓపెన్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌రికొంద‌రు న‌ష్ట‌పోతూనే ఉన్నారు.


ఈ త‌ర‌హా నిర్ల‌క్ష్య ఘ‌ట‌న‌ తాజాగా గుజ‌రాత్‌లో వెలుగులోకి వ‌చ్చింది. బెయిల్ మెయిల్‌ను జైలు అధికారులు స‌కాలంలో ఓపెన్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల బాధితుడు మూడేండ్లు అద‌నంగా జైలులోనే ఉండాల్సి వ‌చ్చింది. దీనిపై బాధితుడు హైకోర్టును ఆశ్ర‌యించ‌గా, రూ.1 ల‌క్ష న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని గుజ‌రాత్ హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.


అస‌లు కేసు ఏమిటంటే..


ఓ హత్య కేసులో 27 ఏండ్ల చంద‌న్‌జీ ఠాగూర్‌కు జీవిత ఖైదు శిక్ష ప‌డింది. ఆ శిక్ష‌ను అనుభవిస్తున్నప్పుడు హైకోర్టు అత‌డి శిక్ష‌ను ర‌ద్దు చేయ‌డ‌మే కాకుండా బెయిల్ 2020 సెప్టెంబర్ 29న బెయిల్ కూడా మంజూరుచేసింది. ఈమేర‌కు హైకోర్టు రిజిస్ట్రీ జైలు అధికారుల‌కు బెయిల్ ఆర్డర్‌ను మెయిల్‌చేసింది. జైలు అధికారులు మెయిల్‌ను తెరువ‌లేదు.


హైకోర్టు రిజిస్ట్రీ జిల్లా సెష‌న్స్ కోర్టుకు సైతం బెయిల్ ఆర్డ‌ర్‌ను ఈ మెయిల్ చేశారు. కానీ, వారు కూడా కోర్టు ఆదేశాలు అమలు చేశారా? లేదా అనేది విచారించలేదు. అధికారుల నిర్ల‌క్ష్యంగా మూలంగా బాధితుడు అద‌నంగా మూడు సంవ‌త్స‌రాలు అంటే 2023 వరకు జైలులోనే ఉన్నాడు. దోషి తాజాగా బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది


“అభ్యర్థి, విడుదలై తన స్వేచ్ఛను అనుభవించగలిగినప్పటికీ, ఈ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుకు సంబంధించి రిజిస్ట్రీ లేదా సెషన్స్ కోర్టును సంప్రదించడానికి జైలు అధికారులు శ్రద్ధ చూపనందున మాత్రమే జైలులోనే ఉండవలసి వచ్చింది” అని న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ సుపేహియా, జస్టిస్ ఎంఆర్ మెంగ్డేలతో కూడిన డివిజన్ బెంచ్ వెల్ల‌డించింది.


కాగా.. 14 రోజుల్లోగా దోషికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించింది. దోషి వయస్సు సుమారు 27 సంవత్సరాలు. అతను ఇప్పటికే 5 సంవత్సరాలకు పైగా జైలు శిక్షను అనుభవించాడు. అందువల్ల, న్యాయ ప్రయోజనాల కోసం, జైలు అధికారుల నిర్లక్ష్యానికి దరఖాస్తుదారుకి తగిన పరిహారం అందించాల్సిందేన‌ని తీర్పులో పేర్కొన్న‌ది.