విమానంలో పాము.. భయాందోళనకు గురైన ప్రయాణికులు
పాము కనిపిస్తే చాలు భయపడిపోతాం.. దానికి దూరంగా పారిపోతాం

- థాయ్ ఎయిర్‌ఏషియా విమానంలో ఈ నెల 13న ఘటన
- ఆలస్యంగా వెలుగులోకి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
విధాత: పాము కనిపిస్తే చాలు భయపడిపోతాం.. దానికి దూరంగా పారిపోతాం. కానీ, పాము మన తలపైనే తచ్చాడుతూ కనిపిస్తే.. ఎటూ కదలలేని పరిస్థితి మనకు దాపురిస్తే.. ఆ భయం ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇలాంటి భయానక ఘటన థాయ్ ఎయిర్ ఏషియా విమాన ప్రయాణికులకు ఎదురైంది. అసలు ఏం జరిగిందంటే..
విమానయాన సంస్థ థాయ్ ఎయిర్ ఏషియా విమానంలో ఇటీవల పాము కనిపించింది. ఈ నెల 13న థాయ్ ఎయిర్‌ఏషియాకు చెందిన ఎఫ్‌డీ 3015 విమానం బ్యాంకాక్ నుంచి ఫుకెట్‌కు బయలుదేరింది. డాన్ మువాంగ్ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఫుకెట్ విమానాశ్రయంలో దిగాల్సి ఉన్నది. విమానం గాలిలో ఉన్నప్పుడు, ఒక ప్రయాణికుడు లగేజీ బ్యాక్స్ పై చిన్నపాము సంచరించినట్టు గమనించాడు. పామును ఇతర ప్రయాణికులు కూడా చూడటంతో వారంతా భయాందోళనలకు గురయ్యారు.
ఈ ఘటనను టిక్‌టాక్ యూజర్ ఒకరు వీడియో రికార్డ్ చేశాడు. విమానం ల్యాండ్ అయ్యేలోపు ఆ చిన్న పామును సిబ్బంది పట్టుకున్నారు. ప్రయాణికులెవరూ గాయపడలేదు. విమాన సహాయకురాలు పామును ఖాళీ ప్లాస్టిక్ బ్యాగ్‌లోకి పంపించింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత అటవీ అధికారులకు చూపించగా బ్రిడ్ల్ స్నేక్‌గా గుర్తించారు. ఇది విషరహిత జాతి పాము అని చెప్పారు. చిన్నపాటి పాము విమానంలోకి ఎలా ప్రవేశించిందనే విషయం వెంటనే తెలియరాలేదు.