హైదరాబాద్ జూపార్కులో.. 125 ఏండ్ల వయసున్న తాబేలు మృతి
హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో 125 ఏండ్ల వయసున్న తాబేలు మృతి చెందింది. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆ తాబేలు చనిపోయినట్లు జూ అధికారులు తెలిపారు

హైదరాబాద్ : హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో 125 ఏండ్ల వయసున్న తాబేలు మృతి చెందింది. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆ తాబేలు చనిపోయినట్లు జూ అధికారులు తెలిపారు. మగ జాతికి చెందిన ఈ తాబేలు శనివారం(మార్చి 16) మృతి చెందిందని పేర్కొన్నారు.
గత పది రోజుల నుంచి తాబేలు ఎలాంటి ఆహారం తీసుకోలేదని, చివరకు శనివారం తుదిశ్వాస విడిచిందని చెప్పారు. దీంతో పది రోజుల నుంచి వైద్యం అందించినప్పటికీ లాభం లేకుండా పోయిందన్నారు. ఈ తాబేలును నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ నుంచి 1963లో నెహ్రూ జూ పార్కుకు తరలించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జూలో 95 ఏండ్ల తాబేలు ఉంది.
ఇక చనిపోయిన తాబేలుకు వెటర్నరీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. తాబేలు శరీరంలోని పలు అవయవాలు దెబ్బతినడం కారణంగా చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. తదుపరి పరిశోధనల కోసం తాబేలు నమూనాలను రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కాలేజీకి పంపారు.