కాకతీయ యూనివర్సిటీకి అవినీతి మరకలు

ఉన్నత విద్య అందించాల్సిన కాకతీయ యూనివర్సిటీని అవినీతి మరక వెంటాడుతోంది.

  • By: Somu    latest    Jan 05, 2024 11:48 AM IST
కాకతీయ యూనివర్సిటీకి అవినీతి మరకలు
  • వెల్లువెత్తుతున్న ఆరోపణలు, విమర్శలు
  • ఏసీబీ వలలో కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్
  • రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కిష్టయ్య
  • యూనివర్సిటీలో ఆయనకే కీలక బాధ్యతలు
  • వెనుక వున్న అదృశ్య హస్తమెవరిది?
  • విచారణ కమిటీ వేయాలని డిమాండ్


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉన్నత విద్య అందించాల్సిన కాకతీయ యూనివర్సిటీని అవినీతి మరక వెంటాడుతోంది. కొద్ది రోజుల క్రితం యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ తాటికొండ రమేష్ పై వర్సిటీలోని వివిధ విద్యార్థి సంఘాలు తీవ్ర అవినీతి ఆరోపణలు చేశాయి. పీహెచ్డీ అడ్మిషన్ల వ్యవహారంలో ఆయన అనుకూలురకు సీటు ఇప్పించేందుకు అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి.


అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పక్షాలు విద్యార్థులకు అండగా నిలిచాయి. వీసీగా రమేష్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి యూనివర్సిటీలో అనేక అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు కొనసాగుతూ వస్తున్నాయి. తనకు అనుకూలమైన వ్యక్తులను ముఖ్య స్థానాల్లో పెట్టుకొని ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారని విమర్శలున్నాయి. రిజిస్టార్, అసిస్టెంట్ రిజిస్టార్లను, రిటైర్డ్ ప్రొఫెసర్లను తనకు అనుకూలమైన స్థానాల్లో, ముఖ్యమైన పోస్టుల్లో పెట్టి ఈ వ్యవహారాలు సాగిస్తున్నారని బహిరంగంగానే విమర్శలు సాగుతున్నాయి.


ఈ నేపథ్యంలో శుక్రవారం యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య అవినీతికి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టు పడడం సంచలనంగా మారింది. కిష్టయ్య వెనుక యూనివర్సిటీకి చెందిన ముఖ్యమైన వారి హస్తం ఉందన్న విమర్శలను విద్యార్థి సంఘాలే కాకుండా వర్సిటీ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ సాగుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్లు యూనివర్సిటీ వ్యవహారాలపై ప్రత్యేక విచారణ కమిటీని నియమించి, విచారణ చేపిస్తే అవినీతి అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.


లంచం తీసుకుంటూ పట్టుబడిన కిష్టయ్య


కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య ఏసీబీ వ‌ల‌కు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఒక హాస్టల్ లో పాలు పోసే వ్యక్తి నుంచి రూ.50 వేల లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. పాలు పోసే వ్యవహారంలోనే ఈ స్థాయి లంచం డిమాండ్ చేస్తే, మిగిలిన వ్యవహారాల్లో కిష్టయ్య హస్తలాగవం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు.


ఆర్ట్స్ కాలేజీ వ్యవహారంలో ఆరోపణలు


ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర రుసుముల స్వీకరణలో జరిగిన రూ.3 కోట్ల కుంభకోణంపై ఏఆర్ కిష్టయ్య, ప్రిన్సిపాల్ బన్నా అయిలయ్యపై కమిటీ విచారణ చేస్తున్న సయమంలోనే కేయూ వీసీ రమేష్.. కిష్టయ్యను యూనివర్సిటీ క్యాంపస్‌కు మార్చారు. న్యాక్ కోసం కేటాయించిన రూ.10 కోట్ల బిల్లుల్లో చేతివాటం కోసమే కిష్టయ్యను క్యాంపస్‌కు వీసీ బదిలీ చేయించారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి.


యూనివర్సిటీలో కీలకమైన నాలుగు కార్యాలయాలకు కిష్టయ్య ఒక్కడినే అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా వీసీ ర‌మేష్‌ నియమించారనే ఆరోపణలు బ‌లంగా ఉన్నాయి. న్యాక్ సందర్భంగా వర్సిటీలో రోడ్లు, హాస్టళ్లు, ఇతర బిల్డింగ్‌ల‌ కోసం రూ.10 కోట్లు కేటాయించారు. వీటిలో కమీషన్ల కోసమే బిల్డింగ్ డివిజన్, పబ్లికేషన్స్ సెల్, హాస్టల్ ఆఫీస్‌తోపాటు యూనివర్సిటీ ఆడిట్ ఆఫీస్‌కు కూడా కిష్టయ్యనే అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా నియమించారు. ఒక్క హాస్టల్ లోనే పాలు అమ్మే వ్యాపారి దగ్గరి నుంచి రూ.50 వేలు లంచం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.


ఇంకా దీని వెనుక పెద్ద తిమింగలాలు ఉన్నాయనే అనుమానంతో ఏసీబీ విచారణ జరుపుతోంది. దీంతో పాటు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుతున్నారు.


హైకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రి


గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనా కాలంలో యూనివర్సిటీలు, ఎస్డీఎల్సీలు, హాస్టళ్లలో మెస్ విషయంలో, ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో అనేక అవినీతి ఆరోపణలు వెలుగుచూశాయి. అయినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనివల్లనే వీసీలు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకొని, యూనివర్సిటీలను అవినీతికి అడ్డగా మార్చారు.


ప్రభుత్వం యూనివర్సిటీలను అభివృద్ధి చేయకపోగా, వాటిని భ్రష్టుపట్టించింది. ఇవాళ యూనివర్సిటీల్లో ఏసీబీ దాడులు జరగడం అవినీతికి పరాకాష్ట. యూనివర్సిటీల గౌరవం, లక్ష్యం పూర్తిస్థాయిలో దిగజారి పోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి సిటింగ్ జడ్జి చేత విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలి.