Adilabad | భిన్నత్వంలో ఏకత్వం.. చారిత్రక, ఆధ్యాత్మిక, ఆచారాల సమ్మేళనం
Adilabad రాజు ఆదిల్షా పేరిట ఏర్పడిన జిల్లా నేటికీ పోరాటాలకు స్ఫూర్తి కొమురం భీం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక కథనం (విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్) పచ్చని చెట్లు.. గల గల పారే సెలయేళ్లు.. కొండల మీది నుండి హోయలు ఒలకబోస్తూ కిందికి దూకే జలపాతాలు… చారిత్రక ప్రదేశాలు… పురాతన ఆలయాలు… ఇలా ఎన్నొ ఎన్నెన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్న ప్రదేశం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. శాతవాహనులు, వాకాటకులు, విష్ణుకుండినులు, కాకతీయులు, గోండు రాజులు, బహమని […]

Adilabad
- రాజు ఆదిల్షా పేరిట ఏర్పడిన జిల్లా
- నేటికీ పోరాటాలకు స్ఫూర్తి కొమురం భీం
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక కథనం
(విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్)
పచ్చని చెట్లు.. గల గల పారే సెలయేళ్లు.. కొండల మీది నుండి హోయలు ఒలకబోస్తూ కిందికి దూకే జలపాతాలు… చారిత్రక ప్రదేశాలు… పురాతన ఆలయాలు… ఇలా ఎన్నొ ఎన్నెన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్న ప్రదేశం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. శాతవాహనులు, వాకాటకులు, విష్ణుకుండినులు, కాకతీయులు, గోండు రాజులు, బహమని సుల్తానుల ఏలుబడిలో ఉన్న చారిత్ర నేపథ్యం కలిగి ఉన్న జిల్లా ఇది. గతంలో ఈ జిల్లాను పరిపాలించిన ఆదిల్ షా పేరు మీదుగా ఆదిలాబాద్ పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
మరోవైపు గోదావరి, పెన్ గంగా, ప్రాణహిత నదులు సరిహద్దులుగా విలసిల్లుతున్న జిల్లా. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఆదిలాబాద్ జిల్లా సొంతం. బొగ్గు గనులు, సిమెంట్ కర్మాగారాలు, పేపర్ మిల్లు, జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులతో పారిశ్రామికంగా ముందుకు సాగుతున్న జిల్లా. అయితే కాలక్రమంలో కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. సర్ సిల్క్ వంటి పరిశ్రమ ఆనవాలే లేకుండా పోయింది. ఎత్తు పల్లాలు, కొండ కోనలు, లోయలు ఇలా భౌగోళికంగా భిన్న పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేక సంస్కృతులు, భిన్నమైన ఆచార వ్యవహారాలు కలిగి ఉన్నప్పటికి ఇక్కడి ప్రజలు సమైఖ్య భావంతో కలిసి మెలిసి ఉండటం ఈ జిల్లా ప్రత్యేకత.
ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. వర్షాధారం మీదనే వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. కడెం, స్వర్ణ, సాథ్నాల, మత్తడి వాగు, శ్రీపాద ఎల్లంపల్లి, కొమురంభీం ప్రాజెక్టులు జిల్లా రైతుల సాగు నీటి అవసరాలను తీరుస్తున్నాయి. ప్రధాన వాణిజ్య పంటలతోపాటు ఉద్యాన పంటలవైపు కూడా రైతులు మొగ్గు చూపుతున్నారు. కుంటాల, పొచ్చెర, సప్తగుండాల వంటి ఎన్నో జలపాతాలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
బాసర సరస్వతి క్షేత్రం, జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, వాంకిడి ప్రాచీన శివాలయం, వేలాల గుట్ట మల్లన్న, కదిలే పాపహరేశ్వరాలయం, చెన్నూరులోని ఆగస్తేశ్వరాలయం ఇలా ఎన్నో పురాతన ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. గత చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్న కోటలు, బురుజులు నిర్మల్, ఇందారం, వడూరు, సిర్పూర్, ఉట్నూరు వంటి ప్రాంతాల్లో ఇప్పటికి కనిపిస్తాయి. అటు పోరాటపటిమలోనూ జిల్లా ఏమాత్రం తీసిపోలేదని నిరూపించారు ఇక్కడి పోరాట వీరులు.
గిరిజనుల హక్కుల కోసం పోరాడి అమరుడైన కొమురంభీం, హక్కుల కోసం సాగించిన పోరాటంలో అమరుడైన రాంజీ గోండుల స్పూర్తితో అటు తెల్లవారికి, ఇటు నిజాం నిరంకుశ పాలనక్ వ్యతిరేకంగా పోరాడిన వీరులు కూడా ఎందరో ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోనే భౌగోళికంగా సువిశాలమైన ఈ జిల్లా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనతో నాలుగు జిల్లాలుగా రూపాంతరం చెందింది. ఉమ్మడిగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా ఇపుడు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలుగా ఏర్పడింది.
రాజకీయ ముఖచిత్రం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో గత 2018లో జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఆసిఫాబాద్ నియోజవర్గంలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ.. ఆ పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్లో చేరడంతో పది అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో చేరాయి. 2023 చివర్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రస్తుత అధికార బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారో ఇతర పార్టీలకు అవకాశం కల్పిస్తారో వేచి చూడాలి.
అదిలాబాద్ పార్లమెంట్ నియోజవర్గానికి 17వ లోక్సభ సభ్యునిగా బీజేపీ తరఫున 2019 లో సోయం బాపూరావు గెలుపొందారు. 1952 లో సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి గెలుపొందగా 1957 నుండి 1980 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. అనంతరం ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం మీద
అదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుండి 7 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు గెలిచి లోక్సభలో అడుగు పెట్టారు. టీడీపీ ఆరు సార్లు గెలిచింది.
రెండుసార్లు తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున అభ్యర్థులు గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. ప్రస్తుతం బీజేపీ నుంచి సోయం బాపూరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నియోజవర్గం ప్రజలు 18వ సారి పార్లమెంట్ స్థానానికి 2024 లో ఏ పార్టీ నుండి ఏ అభ్యర్థిని గెలిపిస్తారో వేచి చూడాల్సిందే!