Telangana | నిరుద్యోగులకు శుభవార్త.. వయోపరిమితి రెండేండ్లు పెంపు
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. ప్రస్తుతమున్న గరిష్ట వయోపరిమితిని 44 ఏండ్ల నుంచి 46 ఏండ్లకు పెంచింది.

హైదరాబాద్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. ప్రస్తుతమున్న గరిష్ట వయోపరిమితిని 44 ఏండ్ల నుంచి 46 ఏండ్లకు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే యూనిఫామ్ సర్వీసులకు ఈ వయోపరిమితి పెంపు వర్తించదు అని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తోంది. జాబ్ క్యాలెండర్‌ను త్వరలోనే ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు వేదికలపై చెప్పారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పెంచిన పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ఇక మెగా డీఎస్సీ కూడా నిర్వహిస్తామని రేవంత్ తెలిపారు. ఈ నేపథ్యంలో వయోపరిమితి పెంచడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.