NDA కూటమి నుంచి.. అన్నా డీఎంకే ఔట్‌

NDA కూటమి నుంచి.. అన్నా డీఎంకే ఔట్‌

విధాత: దేశ రాజకీయాల్లో కొనసాగుతున్న ఎన్డీయే, ఇండియా కూటమిల మధ్య రాజకీయ ఆధిపత్య పోరులో సోమవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే పార్టీ ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించింది. చైన్నెలో సోమవారం జరిగిన అన్నా డీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షుల ముఖ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు.

పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపి మునుస్వామి సమావేశ నిర్ణయాన్ని వెల్లడించారు. ఎన్డీయేతో, బీజేపీతో తమ పార్టీ పూర్తిగా సంబంధాలు తెంచుకుందాని ప్రకటించారు. బీజేపీ నేతల వైఖరినే ఇందుకు కారణమని ఆరోపించారు. గత ఏడాది కాలంగా తమిళనాడు బీజేపీ నేతలు తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేస్తున్న నేపధ్యంలో అన్నాడీఎంకే నాయకత్వం ఎన్డీయో కూటమితో తెగతెంపులు చేసుకుంది.

ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్న తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ మంత్రి ఉదయనిధి మారన్ సనాతన ధర్మంపై చేసిన వివాదస్పద వ్యాఖ్యల నేపధ్యంలో బీజేపీ ఆ పార్టీ నాయకత్వంపై విమర్శల దాడి సాగించింది. ఇటు తమ మిత్రపక్షమైన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామిపై కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తరుచు విమర్శలు చేశారు.

ఈ నేపధ్యంలో అన్నాడీఎంకే తీవ్ర అసంతృప్తితో ఎన్డీయే కూటమి నుంచి వైదొలగింది. దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా ఉన్న తమిళనాడు నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ఎన్డీయే కూటమిలో లేకపోవడం బీజేపీకి ఇబ్బందికరంగా మారనుందని భావిస్తున్నారు.