Bengaluru |
విధాత బ్యూరో, కరీంనగర్: బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఆకాంక్ష సోమవారం అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మృతి చెందింది. దీంతో గోదావరిఖని మేదరిబస్తీలో విషాదం చోటు చేసుకుంది.
గోదావరిఖనికి చెందిన వ్యాపారి జ్ఞానేశ్వర్ పెద్ద కూతురు ఆకాంక్ష బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తోంది. కొన్నిరోజులు హైదరాబాద్‌లో పనిచేసిన ఆమె బెంగళూరులోని కోడిహళ్లి జీవన్ బీమానగర్ లోని ఓ అద్దె ఇంట్లో స్నేహితురాలితో కలిసి ఉంటోంది.
స్నేహితురాలు బయటకు వెళ్లిన సమయంలో ఘటన జరిగింది. ముందుగా ఆత్మహత్యగా భావించినప్పటికీ.. తర్వాత హత్యగా గుర్తించినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో పనిచేసిన సమయంలో పరిచయమైన స్నేహితుడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ విషాద ఘటనతో ఆమె కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. బెంగళూరుకు నుంచి ఆమె మృతదేహాన్ని బుధవారం గోదావరిఖనికి తీసుకురావడంతో.. విషాద ఛాయలు అలుముకున్నాయి.