Amethi । అమేథీ నుంచి సమాజ్‌వాదీ పోర్టీ పోటీ?
సంకేతాలిచ్చిన పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ పొత్తు రాజకీయంలో కొత్త ట్విస్ట్ Amethi । కాంగ్రెస్‌తో కలిపి కూటమి ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్టు చెబుతున్న సమాజ్‌వాదీ పార్టీ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న ప్రాంతంగా చెప్పే అమేథీలో ఈసారి తామే పోటీ చేస్తామని సమాజ్‌వాది పార్టీ సంకేతాలు ఇచ్చింది. విధాత : కాంగ్రెస్ పార్టీ క్రమం తప్పకుండా పోటీచేసే అమేథీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ ఈసారి పోటీ చేయదా? కాంగ్రెస్‌కు వదిలి పెడుతున్న ఈ […]

- సంకేతాలిచ్చిన పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్
- పొత్తు రాజకీయంలో కొత్త ట్విస్ట్
Amethi । కాంగ్రెస్‌తో కలిపి కూటమి ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్టు చెబుతున్న సమాజ్‌వాదీ పార్టీ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న ప్రాంతంగా చెప్పే అమేథీలో ఈసారి తామే పోటీ చేస్తామని సమాజ్‌వాది పార్టీ సంకేతాలు ఇచ్చింది.
విధాత : కాంగ్రెస్ పార్టీ క్రమం తప్పకుండా పోటీచేసే అమేథీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ ఈసారి పోటీ చేయదా? కాంగ్రెస్‌కు వదిలి పెడుతున్న ఈ నియోజకవర్గంలో సమాజ్‌వాది పార్టీ (Samajwadi Party) పోటీకి దిగనున్నదా? ఎస్‌పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) ఇచ్చిన సంకేతాలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఆదివారం అమేథీలో పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరైన అఖిలేశ్‌యాదవ్.. ట్విట్టర్‌లో ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు.
‘అమేథీలో పేద మహిళల పాట్లు చూసి చాలా బాధ కలిగింది. ఇక్కడ చాలాసార్లు వీఐపీలు గెలిచారు, ఓడారు. కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ లేదు. ఇక్కడే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక మిగతా రాష్ట్రం గురించి చెప్పనవసరం లేదు’ అని ఆయన ట్వీట్ చేశారు. ‘ఈసారి అమేథీ గొప్ప వ్యక్తులను కాదు.. గొప్ప మనసున్నవారిని ఎన్నుకుంటుంది. అమేథీ నుంచి పేదరికాన్ని నిర్మూలించేందుకు ఎస్‌పీ ప్రతినబూనుతున్నది’ అని పేర్కొన్నారు.
వాస్తవానికి అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉన్న ప్రాంతం. ఇక్కడ గత ఎన్నికల్లో (2019 parliamentary elections) కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) పై బీజేపీ నేత స్మృతి ఇరానీ (Smriti Irani) విజయం సాధించారు. ముందు జాగ్రత్త చర్యగా కేరళలోని వాయనాడ్ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ గాంధీ.. అమేథీలో ఓడిపోయినా వాయనాడ్ ఎంపీగా లోక్‌సభలోకి ప్రవేశించగలిగారు.
అయితే.. ఈసారి ప్రియాంక గాంధీ సైతం ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అదే జరిగితే ప్రియాంక గాంధీ (Prianka Gandhi) అమేథీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ సమాజ్‌వాది పార్టీ పోటీ చేయాలనుకుంటే కాంగ్రెస్ ఒప్పుకొంటుందా? రాహుల్ లేదా ప్రియాంక పోటీ చేయాల్సిన స్థానాన్ని వదులుకుంటుందా? అనేది పెద్ద ప్రశ్నగా ఉన్నది.
సిలిండర్‌వాలీ ఎంపీ
అమేథీ ఎంపీ స్మృతి ఇరానీని ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన అఖిలేశ్.. ఆమెను సిలిండర్ వాలీ (Cylinder Waali) ఎంపీగా అభివర్ణించారు. 2024 ఎన్నికల్లో ఆమెను ఓడించాలని పిలుపునిచ్చారు. ‘గతంలో బీజేపీవారు నెత్తిన గ్యాస్ సిలిండర్లు మోసేవారు. ఈ రోజు ద్రవ్యోల్బణం (inflation) ఆల్‌టైం హైకి చేరింది. కానీ.. వారి నుంచి ఎలాంటి సమాధానం ఉండదు’ అని వ్యాఖ్యానించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో గ్యాస్ ధరలు పెరిగినప్పుడు స్మృతి ఇరానీ, ఇతర బీజేపీ నేతలు గ్యాస్ సిలిండర్లతో ధర్నాలు చేసిన సందర్భాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేశారు.