Andhra Pradesh: పైసలివ్వని పురస్కారాలు ఎందుకు? అవార్డులపై సర్పంచుల పెదవి విరుపు

Andhra Pradesh విధాత‌: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కొన్ని గ్రామా పంచాయతీలను పలు అంశాల్లో ఎంపిక చేసి బాగా పని చేసి, గుణాత్మక మార్పు సాధించిన వాటికీ ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అవార్డులు ప్రకటించింది. ఐతే వీటిని సర్పంచులు నిర్వేదంతో చూస్తూ అయ్యో రామ అనుకుంటున్నారు. వాస్తవానికి గ్రామ పంచాయతీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్స్ కింద నిధులు ఇస్తుంటాయి. వాటితో గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ బిల్లుల చెల్లింపు.. ఇతరత్రా అభివృద్ధి […]

Andhra Pradesh: పైసలివ్వని పురస్కారాలు ఎందుకు? అవార్డులపై సర్పంచుల పెదవి విరుపు

Andhra Pradesh

విధాత‌: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కొన్ని గ్రామా పంచాయతీలను పలు అంశాల్లో ఎంపిక చేసి బాగా పని చేసి, గుణాత్మక మార్పు సాధించిన వాటికీ ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అవార్డులు ప్రకటించింది. ఐతే వీటిని సర్పంచులు నిర్వేదంతో చూస్తూ అయ్యో రామ అనుకుంటున్నారు.

వాస్తవానికి గ్రామ పంచాయతీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్స్ కింద నిధులు ఇస్తుంటాయి. వాటితో గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ బిల్లుల చెల్లింపు.. ఇతరత్రా అభివృద్ధి పనులు చేపట్టి గ్రామ పరిపాలన కొనసాగిస్తారు. ఈ వ్యవహారాలన్నీ గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా సాగుతాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఏ పద్దుకింద వచ్చిన డబ్బులైనా తీసి నగదు బదిలీ, సంక్షేమ పథకాలకు బట్వాడా చేసేస్తుండడంతో ఎక్కడి నిధులూ సరిపోవడం లేదు. దీంతో కేంద్ర నిధులు సైతం రాష్ట్రప్రభుత్వం కాజేసింది.

దీంతో సర్పంచులకు చేయడానికి పనులూ లేవు.. వాళ్ళ ఖాతాల్లో నిధులూ లేని పరిస్థితి వచ్చింది. దీంతో కొందరు సర్పంచులు చేతి డబ్బులు పెట్టుకుని గ్రామాల్లో వీధి లైట్లు వేయిస్తున్నారు. చిన్నచిన్న మరమ్మతు పనులుకు సైతం వాళ్ళే డబ్బు సమకూరుస్తూ నడిపిస్తున్నారు. కొందరు సర్పంచులు ఐతే అప్పులు తెచ్చి మరీ పంచాయతీలను సాకుతున్నారు. పరువు కాపాడుకునేందుకు ఏదోలా తిప్పలు పడుతున్నారు.

ఏది ఎలా ఉన్నా జాతీయ పంచాయతీరాజ్ దినం చేపట్టాలి కాబట్టి ప్రభుత్వం ఏప్రిల్ 24 న రాష్ట్రంలోని 27 గ్రామ పంచాయ‌తీల‌ను రాష్ట్ర‌స్థాయి పుర‌స్కారాల‌కు ఎంపిక చేసింది. వీటిలో పేద‌రిక నిర్మూల‌న‌-ఉపాధి అవ‌కాశాలు క‌ల్ప‌న , ఆరోగ్య‌ పంచాయ‌తీ, చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయ‌తీ, నీటి సౌక‌ర్యం పుష్క‌లంగా ఉన్న పంచాయ‌తీ, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయ‌తీ, ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయ‌తీ త‌దిత‌ర విభాగాలున్నాయి.

ఈ సందర్భంగా ఆయా సర్పంచులను కలెక్టరేట్ కు పిలిచి ఓ షీల్డ్ ఇచ్చి, కలెక్టర్‌తో ఫోటో తీయించి పంపుతున్నారు. చేతిలో రూపాయి లేకుండా.. గ్రామాల్లో తాము పనులు సైతం చేపట్టకుండా ఈ అవార్డులు ఇలా ఇచ్చుట ఏమిటో తెలియడం లేదని సర్పంచులు అంటున్నారు.