కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
దేశంలోనే అతిపెద్ద కోచింగ్ హబ్‌గా పేరుగాంచిన కోటా నగరంలో విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి

- నీట్‌కు సిద్ధమయ్యే యువకుడి బలవన్మరణం
- నిరుడు 26 మంది విద్యార్థులు సూసైడ్
- ఈ ఏడాది తొలినెల కాకముందే మరొకరు
విధాత: దేశంలోనే అతిపెద్ద కోచింగ్ హబ్‌గా పేరుగాంచిన కోటా నగరంలో విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నివారణ చర్యలు తీసుకున్నా విద్యార్థుల ఆత్మహత్యలకు తెరపడటం లేదు. తాజాగా మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన మహ్మద్ జైద్.. మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి అఖిల భారత ప్రవేశ పరీక్ష అయిన నీట్‌కు సిద్ధమవుతున్నాడు. కోటలోని జవహర్ నగర్ ప్రాంతంలోని హాస్టల్‌లో నివాసం ఉండేవాడు. మంగళవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని కనిపించాడు. జైద్ నీట్‌లో తన రెండవ ప్రయత్నానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇంకా సూసైడ్ నోట్ ఏదీ కనుగొనబడలేదు. జైద్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడానికి ప్రభుత్వ అధికారులు, కోటా కోచింగ్ సెంటర్లు చేస్తున్న ప్రయత్నాలకు తాజా ఘటన గండి కొట్టింది. గత ఏడాది ఒక్క కోటాలో 26 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు కోచింగ్ సెంటర్లకు నిరుడు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్రం కూడా గత వారం కోచింగ్ సెంటర్ల కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో 16 ఏండ్లలోపు విద్యార్థులను చేర్చుకోవడంపై నిషేధం విధించింది. విద్యార్థులకు వినోదం కూడా ఉండేలా సూచనలు చేసింది.