రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం: హన్నన్ మొల్ల

విధాత: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల పేరుతో వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ శక్తులకు దేశ సంపద దోచి పెడుతూ రైతు వ్య‌తిరేకిగా మారిందని రైతు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి హన్న‌న్‌ మొల్ల విమర్శించారు. నల్లగొండ నాగార్జున కళాశాలలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభలలో ఆయన మాట్లాడుతూ.. దేశం సంక్షోభంలో ఉందని రైతు ఆత్మహత్యలు నిత్యకృత్యాలుగా మారాయ‌న్నారు. గిట్టుబాటు ధర లభించక పంట నష్టపరిహారాలు, వ్యవసాయ సబ్సిడీలు […]

  • By: krs    latest    Nov 27, 2022 3:00 PM IST
రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం: హన్నన్ మొల్ల

విధాత: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల పేరుతో వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ శక్తులకు దేశ సంపద దోచి పెడుతూ రైతు వ్య‌తిరేకిగా మారిందని రైతు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి హన్న‌న్‌ మొల్ల విమర్శించారు. నల్లగొండ నాగార్జున కళాశాలలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభలలో ఆయన మాట్లాడుతూ..

దేశం సంక్షోభంలో ఉందని రైతు ఆత్మహత్యలు నిత్యకృత్యాలుగా మారాయ‌న్నారు. గిట్టుబాటు ధర లభించక పంట నష్టపరిహారాలు, వ్యవసాయ సబ్సిడీలు కరువై రైతాంగానికి వ్యవసాయం భారంగా తయారైందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమల్లో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంద‌ని, రైతు సంఘం రానున్న రోజుల్లో రైతన్న పోరాటాలను ఉధృతం చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామ‌ని తెలిపారు.

రైతు సంఘానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. శ్రమ దోపిడి, పీడిత ప్రజల విముక్తి కోసం ఏర్పడిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4వేలమంది బలిదానం చేసిన వారిలో వెయ్యి మంది నల్ల‌గొండ నుంచే ఉన్నారన్నారు. వీర నారీమణి స్వర్గీయ మల్లు స్వరాజ్యం పుట్టిన గడ్డ నల్లగొండకు నేను రావడం గర్వకారణంగా ఉందన్నారు.

కిసాన్ సభ ఆవిర్భావం నుంచి రైతుల కోసం పోరాటాలు నడిపిందని, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దీనివలన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నార న్నారు. కిసాన్ సభ ఆరంభం నుంచి భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం పోరాటాలు చేస్తూనే ఉందన్నారు. రైతుల కోసం రానున్న రోజుల్లో రైతు సంఘం పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటుందన్నారు.

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ దేశంలో సంవత్సరానికి 10వేల మంది, రాష్ట్రంలో 500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. మోడీ సర్కార్ ఆధాని, అంబానీ నివేదికలను అనుసరిస్తుంది తప్పా స్వామి నాథన్ నివేదికలు పట్టించుకోవట్లేదని విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటాలు ఒక్కటే మార్గమన్నారు.

రైతులు వేసిన ఓట్లతో గెలిచిన నరేంద్ర మోడీ రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలు తీసుకొచ్చాడన్నారు. రైతుల భూములను లాక్కొని కార్పొరేట్ శక్తుల చేతులో పెట్టార‌ని దుయ్యబట్టారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతులకోసం కేవలం వామపక్షాలు మాత్రమే పోరాటాలు చేస్తున్నాయ‌ని గుర్తు చేశారు.

సమావేశంలో రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ధవలె, నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, బుర్రి శ్రీరాములు, మల్లు లక్ష్మీ, తుమ్మల వీరారెడ్డి, సుదర్శన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.