తోట పవన్‌పై దాడి.. హనుమకొండలో హై టెన్షన్!

పశ్చిమలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వినయ్ అనుచరులు దాడిచేశారని కాంగ్రెస్ ఆరోపణ సీసీ కెమెరాల్లో రికార్డైన దాడి దృశ్యాలు దాడికి పాల్పడిన వారిలో నలుగురిని గుర్తించిన పోలీసులు హాస్పిటల్లో పరామర్శించిన రేవంత్ రెడ్డి సీపీని కలిసి ఫిర్యాదు చేసిన టీపీసీసీ చీఫ్ హనుమకొండ(Hanumakoda) జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పైన గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడి సంఘటన రాజకీయ రంగును పులుముకుంటుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఈ […]

తోట పవన్‌పై దాడి.. హనుమకొండలో హై టెన్షన్!
  • పశ్చిమలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
  • వినయ్ అనుచరులు దాడిచేశారని కాంగ్రెస్ ఆరోపణ
  • సీసీ కెమెరాల్లో రికార్డైన దాడి దృశ్యాలు
  • దాడికి పాల్పడిన వారిలో నలుగురిని గుర్తించిన పోలీసులు
  • హాస్పిటల్లో పరామర్శించిన రేవంత్ రెడ్డి
  • సీపీని కలిసి ఫిర్యాదు చేసిన టీపీసీసీ చీఫ్

హనుమకొండ(Hanumakoda) జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పైన గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడి సంఘటన రాజకీయ రంగును పులుముకుంటుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఈ దాడి రాజకీయ వైరానికి తెరతీసింది. ఈ సంఘటనతో హ‌నుమకొండలో హై టెన్షన్ నెలకొంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఈ ఘటన జరగడంతో కాంగ్రెస్ వర్గాలు కూడా ఈ ఘ‌ట‌న‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: యువజన కాంగ్రెస్(Youth congres) నాయకుడు తోట పవన్‌పై దాడి సంఘటన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ తీవ్ర దుమారాన్ని రేపింది. ఇప్పటికే కాంగ్రెస్ గులాబీ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితిలో ఈ దాడి జరగడం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారింది.

దాడికి పాల్పడింది అధికార పార్టీ అనుచరులే అని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, ఇలాంటి దాడులకు తాము వ్యతిరేకమని గులాబీ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ విషయమై కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ స్థితిలో ఈ దాడి సంఘటన పోలీసులకు పరీక్షగా మారనున్నది.

సీసీటీవీ దృశ్యాలు లభ్యం

పవన్(Pavan)పై దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను కాంగ్రెస్ నేతలు మంగళవారం వెలుగులోకి తీసుకువచ్చారు.

టీపీసీసీ(Tpcc chief) చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా హన్మకొండ అమృతా టాకీస్ సెంటర్లో జరిగిన కాంగ్రెస్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో తోట పవన్‌పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. పవన్‌ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

నలుగురు నిందితుల గుర్తింపు

పవన్‌పై దాడి విషయమై కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించినట్లు చెబుతున్నారు. పోలీసులకు అందిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి అందులో దాడికి పాల్పడిన నలుగురు నిందితులను ఇప్పటికే గుర్తించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వీరిని అదుపులోకి తీసుకొని ఘటన పూర్వపరాలు విచారించేందుకు పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలిసింది నిందితులు పోలీసులకు చిక్కితే గాని సంఘటనకు కారణాలు పూర్తిగా తెలియ రాకపోవచ్చు.

కాంగ్రెస్(congress) శ్రేణుల ఆగ్రహం

పవన్‌పై దాడి సంఘటనతో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులే ఈ దాడికి పాల్పడినట్లుగా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

పవన్‌ను పరామర్శించిన రేవంత్

హనుమకొండ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తోట పవన్‌ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తగిన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు. ఏదైనా చికిత్స నిమిత్తం అపోలోకు తరలించాలని సూచించారు. ఈ సందర్భంగా పవన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారిని రేవంత్ రెడ్డి ఓదార్చారు. మీకు అండగా పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు.

సీపీని(CP) కలిసిన రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను మంగళవారం నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. కార్యకర్తలు నాయకులతో పాదయాత్రగా వెళ్లి సీపీని కలిశారు. చట్టపరంగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి సీపీని కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలపై ఇలాంటి దాడులు సరైనవి కావని ఎలాంటి ఒత్తిడిలకు లొంగిపోకుండా చర్యలు చేపట్టాలని విన్నవించారు.

దాడులు చేస్తే సహించేది లేదు

తమ పార్టీ కార్యకర్తలపై అక్రమంగా దాడులు చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పవన్ పై దాడి చేసిన నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో కేసును నీరు గార్చాలని ప్రయత్నిస్తే ఆందోళన చేపడుతామని స్పష్టం చేశారు. పవన్ దాడిపై ప్రత్యర్థి పార్టీ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ వెంట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మల్లురవి, వేంనరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

వరంగల్ తోట పవన్ పై దాడికి పాల్పడ్డ బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ధర్నా చేపట్టారు. ముందు జాగ్రత్తగా ఛీ‌ఫ్‌విప్‌, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్ క్యాంపు ఆఫీసు వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.