Babu – Modi | బాబు- మోదీ దోస్తీకి ఉత్తరాది పెట్టుబడిదారుల యత్నం!

Babu - Modi బీజం పడింది- కలువడమే మిగిలింది మోదీ వ్యతిరేక కూటమి కోసం ప్రయత్నాల్లో నితీశ్‌ బడాబాబుల ప్రోద్బలంతోనే బాబు వాఖ్యలు? విధాత: ప్రధాని నరేంద్రమోదీని ప్రశంసలతో ముంచెత్తుతూ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) మాట్లాడటం వెనుక ఉత్తరాదికి చెందిన కొందరు పెట్టుబడిదారుల హస్తం ఉన్నట్టు తెలుస్తున్నది. మోదీకి, బాబుకు మధ్య దోస్తీ కుదిర్చి, వారిద్దరినీ కలిపేందుకు జరిగిన ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబుతో మోదీపై ప్రశంసల వర్షం కురిపించారని విశ్వసనీయవర్గాలు అంటున్నాయి. ఈ ప్రయత్నాల్లో […]

  • By: Somu    latest    Apr 29, 2023 12:29 PM IST
Babu – Modi | బాబు- మోదీ దోస్తీకి ఉత్తరాది పెట్టుబడిదారుల యత్నం!

Babu – Modi

  • బీజం పడింది- కలువడమే మిగిలింది
  • మోదీ వ్యతిరేక కూటమి కోసం ప్రయత్నాల్లో నితీశ్‌
  • బడాబాబుల ప్రోద్బలంతోనే బాబు వాఖ్యలు?

విధాత: ప్రధాని నరేంద్రమోదీని ప్రశంసలతో ముంచెత్తుతూ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) మాట్లాడటం వెనుక ఉత్తరాదికి చెందిన కొందరు పెట్టుబడిదారుల హస్తం ఉన్నట్టు తెలుస్తున్నది. మోదీకి, బాబుకు మధ్య దోస్తీ కుదిర్చి, వారిద్దరినీ కలిపేందుకు జరిగిన ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబుతో మోదీపై ప్రశంసల వర్షం కురిపించారని విశ్వసనీయవర్గాలు అంటున్నాయి. ఈ ప్రయత్నాల్లో వారు సఫలీకృతం అవుతున్నారని తెలుస్తున్నది.

గతంలో ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయ స్నేహం ఉన్నప్పటికీ మధ్యలో కాస్త గ్యాప్‌ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చర్యలకు నిరసనగా చంద్రబాబు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు. కొంత కాలంగా మోదీని చంద్రబాబు ఒక్క మాట కూడా అనకుండా అవసరమైనప్పుడల్లా మద్దతు ఇస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ.. గ్యాప్‌ మాత్రం అలానే కొనసాగుతున్నది.

దీనిని పూడ్చి, ఇద్దరి మధ్య స్నేహం మళ్లీ కొనసాగేలా ఉత్తర భారతదేశానికి చెందిన కొందరు బడా పెట్టుబడిదారులు బాధ్యత తీసుకున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తున్నది.
ఇటీవల రిపబ్లిక్‌ టీవీ నిర్వహించిన కాంక్లేవ్‌కు చంద్రబాబును ఉద్దేశపూర్వకంగానే ఆహ్వానించారని, ప్రశంసలు కురిపించాలని ముందుగానే ఆయనకు సంకేతాలు ఇచ్చారని అంటున్నారు.

రిపబ్లిక్‌ టీవీ బీజేపీకి అనుకూలంగా ఉంటుందనే విషయం బహిరంగ రహస్యమే. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా తనపై ఉన్న కేసులరీత్యా మోదీకి అనుకూలంగానే ఉంటున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే.. మోదీకి, జగన్‌కు మధ్య దూరం పెంచాలనే ఆలోచనలో ఉన్న చంద్రబాబు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని పలువురు అంటున్నారు.

రిపబ్లిక్‌ టీవీ కాంక్లేవ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తారు. మోదీ వల్లనే దేశానికి ప్రపంచంలో గుర్తింపు వచ్చిందన్నారు. మోదీ విధానాలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

వాస్తవంగా చంద్రబాబు నాయుడు గతంలో మోదీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. బాబు అధికారంలో ఉండగా ఏపీకి ప్రత్యేక హోదా కావాలని, విశాఖను ప్రత్యేక రైల్వే జోన్‌గా ప్రకటించాలని అడిగారు. ఆనాడు చంద్రబాబు ఏపీకి చెందిన ఈ రెండు హామీలను అమలు చేయనందుకే మోదీతో విభేదించి, ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చారు.

కానీ నేడు దేశంలో రాజకీయ ఈక్వేషన్లు మారాయి. నిన్న మొన్నటి వరకు మోదీ కూటమిలో ఉన్న బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ బయటకు వచ్చారు. ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిపి ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని దేశమంతా తిరుగుతున్నారు. ఈ కూటమిలో పలు ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు చేరుతున్న పరిస్థితి కూడా ఉన్నది. దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమికి సానుకూల వాతావరణం ఏర్పడుతున్నది.

అయితే బీజేపీ వ్యతిరేక కూటమికి నితీశ్‌ లాంటి పెద్ద మనిషి ముందుకు రావడంతో అదే స్థాయి ఉన్న మరో నేత చేత మోదీని పొగిడించాలన్న భావనతో ఉన్న కొంత మంది ఉత్తరాది బడా పెట్టుబడి దారులు చంద్రబాబును అందుకు ఎంచుకున్నారని, తమ ప్రయత్నంలో వారు సఫలమయ్యారని చర్చ నడుస్తున్నది. మోదీకి చంద్రబాబుకు మధ్య సయోధ్య కుదిర్చితే దేశంలో మోదీకి మరి కొన్ని పార్టీల నుంచి మద్దతు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేసినట్లు తెలిసింది.

వాస్తవంగా ఏపీలో ఇప్పటికే అధికార పార్టీ నాయకుడు సీఎం జగన్‌ మద్దతు పూర్తిగా మోదీకే ఉన్నప్పటికీ, బాబుకు ఉన్నంత పలుకుబడి జాతీయ రాజకీయాల్లో జగన్‌కు ఉండదని అంచనా వేసి, ఆ మేరకు బాబును దగ్గరకు తీసినట్లు సమాచారం. బాబు కూడా రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా మోదీకి దగ్గర కావడానికి చంద్రబాబు తనకు అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించు కుంటున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఇద్దరూ కలువడానికి బీజం పడిందని, కలువడమే మిగిలిందని వ్యాఖ్యానిస్తున్నారు.

Chandrababu | మోదీ.. ప్రపంచ వ్యాప్తంగా దేశానికి గుర్తింపు తెచ్చారు: తెడ్డు మర్లేసిన చంద్రబాబు