317 జీవోను సవరిస్తారా? లేదా?: బండి సంజయ్
ఉద్యోగ, ఉపాధ్యాయులకు గొడ్డలిపెట్టుగా మారిన 317 జీవోను సవరిస్తారా? లేదా? అనే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు

- ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
- చీఫ్ సెక్రటరీ కార్యాలయం వద్ద
- పడిగాపులు పడుతున్నా పట్టించుకోరా?
- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్
విధాత బ్యూరో, కరీంనగర్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు గొడ్డలిపెట్టుగా మారిన 317 జీవోను సవరిస్తారా? లేదా? అనే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 317 జీవోను సవరించాలని బీజేపీ పెద్దఎత్తున పోరాటాలు చేసిందని, తాను జైలుకు సైతం వెళ్లానని చెప్పారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఈజీవోను సవరించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు.
సోమవారం చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని చర్లపల్లికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ రూ.23 లక్షల కేంద్ర నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజలతో కలిసి బీరప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గొల్ల కురుమలు బండి సంజయ్ కు గొంగడి బహూకరించారు.
అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. చొప్పదండి నియోజకవర్గంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగు నీరు రాక రైతులు పంటలు ఎండిపోతున్నాయనే బాధలో ఉన్నారని తెలిపారు. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని గత కొద్దిరోజులుగా రైతులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని ఆయన అధికారులను కోరారు.
కేసీఆర్ మూర్ఖత్వపు ఆలోచనతోనే జీవో
కేసీఆర్ ప్రభుత్వ మూర్ఖత్వపు ఆలోచనవల్ల రూపుదిద్దుకున్న 317 జీవో ఉద్యోగ, ఉపాధ్యాయులను చెట్టుకొకరిని, పుట్టకొకరిని చేసిందని బండి సంజయ్ విమర్శించారు. ఈ జీవో కారణంగా చాలామంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆత్మహత్యలు, హఠాన్మరణాల పాలైన విషయాన్ని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం ఈజీవోను సవరించే ప్రయత్నం చేయలేదన్నారు.
దీనిపై బీజేపీ పెద్దఎత్తున ఆందోళన చేపట్టిందని, తాను స్వయంగా కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో ధర్నా చేస్తే పోలీసులు గ్యాస్ కట్టర్లతో కార్యాలయ గేట్లను ధ్వంసం చేసి అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లిన విషయాన్ని ఉదహరించారు. జీవోను సవరించాలని కాంగ్రెస్ నేతలు కూడా కోరారని, తాము అధికారంలోకి వస్తే జీవోను సవరిస్తామని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తున్నా జీవో సవరణలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇబ్బందులు ప్రభుత్వం కంటికి కన్పించడం లేదా? అని నిలదీశారు.
కలెక్టర్, ఎస్ఈతో మాట్లాడిన బండి సంజయ్
నారాయణపూర్ రిజర్వాయర్ నీటి విడుదలపై ఆదివారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో మాట్లాడిన బండి సంజయ్, సోమవారం జిల్లా ఇరిగేషన్ అధికారితో చర్లపల్లి గ్రామం నుండి ఫోన్ లో మాట్లాడారు. ఈ ప్రాంతంలో నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సానుకూలంగా స్పందించిన ఇరిగేషన్ అధికారులు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.