తెలంగాణలో.. బెంగాల్, యూపీ తరహా రాజకీయాలు
టీఆర్ ఎస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులు భయభ్రాంతులకు గురిచేసి, లొంగదీసుకొనే యత్నాలు దాడులతో గతంలో లబ్ధి పొందిన బీజేపీ క్యాడర్ ను రక్షించుకునేందుకు కేసీఆర్ కౌంటర్ అటాక్ విధాత: తెలంగాణ రాష్ట్రంలో బెంగాల్, యూపీ తరహా రాజకీయాలు ఆరంభమయ్యాయి. ఉన్న అధికారాన్నినిలబెట్టు కోవడం కోసం టీఆర్ఎస్, తెలంగాణలో పాగా వేయడం కోసం బీజేపీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో బలపడటం కోసం దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నాయన్న ఆరోపణలు బలంగా […]

- టీఆర్ ఎస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులు
- భయభ్రాంతులకు గురిచేసి, లొంగదీసుకొనే యత్నాలు
- దాడులతో గతంలో లబ్ధి పొందిన బీజేపీ
- క్యాడర్ ను రక్షించుకునేందుకు కేసీఆర్ కౌంటర్ అటాక్
విధాత: తెలంగాణ రాష్ట్రంలో బెంగాల్, యూపీ తరహా రాజకీయాలు ఆరంభమయ్యాయి. ఉన్న అధికారాన్నినిలబెట్టు కోవడం కోసం టీఆర్ఎస్, తెలంగాణలో పాగా వేయడం కోసం బీజేపీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో బలపడటం కోసం దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ మేరకు గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఇన్ కమ్ టాక్స్(ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యాపారులు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులకు చెందిన పలు కంపెనీలు, వారి ఇండ్లపై ఏక దాటిగా దాడులు నిర్వహిస్తున్నారు.
మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్ది రాజు రవిచంద్ర, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి పీఏలు, ఎమ్మెల్సీ కవిత బంధువులు, ఇతర సన్నిహితులు, తాజాగా మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు ఆయనకు చెందిన విద్యాసంస్థలు, కొడుకు, కూతురు, సోదరుల ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇవే కాకుండా అనేక మంది స్థిరాస్థి వ్యాపారుల ఇండ్లు, కార్యాలయాలు, పలు షాపింగ్ మాల్స్‌పై కూడా ఐటీ దాడులు చేస్తున్నది. వరుసగా జరుగుతున్న దాడులతో తెలంగాణలో వ్యాపారస్థులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పుడు తమపై దాడులు జరుతాయో నన్నభయంతో వణికి పోతున్నారు.
రాజకీయ నేతల వ్యపారాలు, వారి భాగస్వాములపై వరుసగా దాడులు చేయడం ద్వారా భయ పెట్టి నేతలను తమ దారిలోకి తెచ్చుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తున్నది. బెంగాల్ రాష్ట్రంలో కూడ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే తీరుగా బీజేపీ వ్యవహరించింది. తమ దారికి వచ్చిన వారిని వదిలేసి, దారికి రాని వారిపై దాడులు చేసింది. ఐటీ, ఈడీ. సీబీఐలను విచ్చల విడిగా ప్రయోగించింది.
ఇదే తీరుగా ఉత్తర ప్రదేశ్‌లో విపక్షాల నేతల సంబంధీకులు, అనుయాయులు, వ్యాపారులపై అనేక దాడులు నిర్వహించింది. ఇలా ఎన్నికలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో ఏకబిగిన ఐటీ, ఈడీ, సీబీఐలతో విరివిగా దాడులు చేయించిందన్న ఆరోపణలు బీజేపీపై బలంగా వినిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాలలో ఎన్నికల తరువాత అంతా గప్‌చుప్ అన్నట్లుగా ఉంటుంది. ఎలాంటి దాడులు లేవు.. కేసులు లేవని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఈ రెండు రాష్ట్రాలలో ఈడీ, ఐటీ అధికారుల దాడులతో బీజేపీ భారీగా లబ్ధి పొందిందని విశ్లేషకులు అంటున్నారు. పశ్చిమ బెంగాల్లో కేవలం మూడు సీట్లకు మాత్రమే పరిమితమైన బీజేపీ గడిచిన ఎన్నికలకు ముందు అనుసరించిన విధానంతో 70 సీట్లకు బీజేపీ పెరిగిందని అంటున్నారు. ఇదే తీరుగా యూపీలో అధికారం కోల్పోయే పరిస్థితి నుంచి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోగలిగిందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
ఈడీ, ఐటీ దాడులను ప్రయోగించి మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్నికూల్చగలిగిందని అంటున్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే బీజేపీ అధికారంలోకి రావడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలను యథేచ్ఛగా వినియోగిస్తుందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా మరో 10 నెలల్లో అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ ఇలాంటి అస్త్రాలనే ఉపయోగిస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
బీజేపీ ఐటీ, ఈడీలను ఉపయోగించి నేతలను దారికి తెచ్చుకోవాలని చేస్తుంటే, సీఎం కేసీఆర్ తన క్యాడర్‌ను రక్షించుకోవడానికి కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా టీఆర్ ఎస్‌ను నిర్వీర్యం చేయాలని చూసిన బీజేపీకి టీఆర్ ఎస్ కౌంటర్ అటాక్ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్నిబట్టబయటలు చేసింది.
ఫామ్ హౌజ్‌లో బేరానికి దిగిన వారిపై కేసులు పెట్టింది. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ విచారణ చేస్తున్నది. విచారణకు హాజరుకానీ బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలకు సిట్ నోటీసులు జారీచేసింది. ఇలా బీజేపీ చేయిస్తున్న దాడులకు టీఆర్ ఎస్ కౌంటర్ అటాక్ చేస్తున్నది. ఇలా రాష్ట్రంలో మొదటి సారి బెంగాల్, యూపీ తరహా రాజకీయాలకు బీజేపీ ఆజ్యం పోసిందంటున్నారు. ఈ దాడులు ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.