BJP
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బిజెపి రాష్ట్ర నాయకులంతా ఒకే వేదికపై ఆసీనులైనా ఎడమొఖం పెడ ముఖంగా వ్యవహరించారు. బిజెపి రాష్ట్ర నాయకత్వంలో ఇటీవల గ్రూపులు, ఆధిపత్య పోరు నెలకొన్న నేపథ్యంలో మోడీ వరంగల్ పర్యటన ఈ నాయకులను ప్రస్తుతానికి కలిపినప్పటికీ, ముఖ్య నాయకులు ఎడ మొఖం, పెడ ముఖంగా వ్యవహరించారు. పైకి ఎవరికి వారు గుంభనంగా వ్యవహరించినప్పటికీ పార్టీలో మాత్రం గుసగుసలు కొనసాగుతూనే ఉన్నాయి.
మోడీ సభ సన్నాహాలను పరిశీలించేందుకు ఆదివారం హనుమకొండకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. అనంతరం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దాదాపు రాష్ట్రంలోని పార్టీ ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, అనంతరం సన్నాహాక సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ ఎడమొఖం పెడమొఖంగానే వ్యవహరించారు.
ఇరువురూ మంత్రి కిషన్ రెడ్డికి అటూ ఇటూగా కూర్చున్నారు. అయినప్పటికీ వీరిమధ్య ఎలాంటి సంభాషణగానీ, మాటలు గానీ సాగలేదు. అదేవిధంగా ఈ సమావేశానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి విజయ రామారావు హాజరయ్యారు.
ట్విట్టర్లో దున్నపోతు బొమ్మపెట్టి సంచలనం సృష్టించిన జితేందర్ రెడ్డి, బండి సంజయ్‌ని మార్చకూడదంటూ పరోక్షంగా ఈటల లక్ష్యంగా వ్యాఖ్యానం చేసిన విజయరామారావు కూడా సమావేశానికి హాజరయ్యారు. జితేందర్ రెడ్డి దున్నపోతు ట్విట్టర్ పై ఈటల కూడా ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.
బిజెపి సంస్కృతికి భిన్నంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న నాయకులను తాత్కాలికంగా మోడీ పర్యటన కలిపినప్పటికీ, రానున్న రోజుల్లో వీరి మధ్య ఐక్యత ఎలా ఉంటుందో అనే చర్చ సాగుతోంది. ఈ సన్నాహక సమావేశంలో విజయశాంతి, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానరాలేదు.
వారు రాకపోవడానికి కారణాలేంటో అనే చర్చ బీజేపీలో సాగింది. అయితే మోడీ పర్యటన రోజు వస్తారా? లేదా? అనే చర్చ పార్టీలో శ్రేణుల్లో సాగుతోంది. ఇదిలా ఉండగా ఈ సందర్భంగా రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.