బీఆరెస్ పాలిట బీజేపీ భూతం!
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగనున్న వేళ.. బీఆరెస్ పరిస్థితి నానాటికీ కనాకష్టంగా మారుతున్నది. లోక్‌సభ ఎన్నికలకైనా పుంజుకునే పరిస్థితి

- రేసు నుంచి పక్కకు పోతున్న కారు!
- పార్టీ మనుగడపై నేతల్లో అనుమానాలు
- పార్టీ నుంచి జారిపోతున్నది కొందరు..
- జాగ్రత్తగా తప్పుకొంటున్నది మరికొందరు
- నాడు ప్రతిపక్షమే వద్దనుకున్న కేసీఆర్
- అదే ఉద్దేశంతో కాంగ్రెస్‌పై దెబ్బమీద దెబ్బ
- ఆ రాజకీయ ఖాళీని భర్తీ చేసిన బీజేపీ
- ఇప్పుడు బీఆరెస్‌కు అదే పెను సవాల్
విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగనున్న వేళ.. బీఆరెస్ పరిస్థితి నానాటికీ కనాకష్టంగా మారుతున్నది. లోక్‌సభ ఎన్నికలకైనా పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. గులాబీ దళపతి ఒంటెత్తు పోకడల కారణంగానే పార్టీ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తనకు ఎదురే లేదనుకున్న బీఆరెస్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో 39 సీట్లకు పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ 64 సీట్లు సాధించి.. పీఠాన్నెక్కింది. అయితే.. బీఆరెస్ ఈ లోక్‌సభ ఎన్నికల్లో కనీసం నాలుగు నుంచి గరిష్ఠంగా ఆరు లోక్‌సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతున్నదని పరిశీలకులు అంటున్నారు. దీంతో పార్టీ మనుగడపై ముఖ్య నాయకుల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలు వారిని పక్కపార్టీలవైపు చూసేందుకు ఉసిగొల్పుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు పార్టీ నుంచి జారిపోతుంటే.. మరికొందరు జాగ్రత్తగా బయటపడేందుకు ఏర్పాటు చేసుకుంటున్నట్టు పరిస్థితులను గమనిస్తే అర్థమవుతున్నది. నిజానికి ఒకప్పుడు తెలంగాణలో బీజేపీకి చోటే లేదు. ఎప్పుడూ ఒకటిరెండు సీట్లకు మించి గెలుచుకోలేదు. అయితే.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. అప్పటికి బీజేపీ పెద్దగా లేదు.. వామపక్షాలు అప్పటికే ప్రాభవం కోల్పోయాయి. ఇక ఉన్న కాంగ్రెస్‌ను కూడా దెబ్బతీస్తే.. తనకు ప్రతిపక్షమే ఉండకుండా పోతుందని కేసీఆర్ ఆలోచన చేశారని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రాజకీయ పునరేకీకరణ అనే ముసుగులో కాంగ్రెస్, టీడీపీల నుంచి పెద్ద ఎత్తున వలసలు ప్రోత్సహించారు. దీంతో రాష్ట్రంలో టీడీపీ అడ్రస్ గల్లంతైంది. కాంగ్రెస్ శిబిరం డీలాపడిపోయింది. ఈ పరిస్థితిని బీజేపీ క్యాష్ చేసుకున్నది. కాంగ్రెస్‌లోని బలమైన నాయకులను తన దరికి చేర్చుకున్నది. కాంగ్రెస్ దెబ్బతినడం వల్ల ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసింది. ప్రతిపక్షమే లేదనుకున్న చోట బీజేపీ అనూహ్యంగా పుంజుకొన్నది. ఇప్పుడు బీఆరెస్ పాలిట అదే పెను భూతంగా తయారైంది.
ఉన్నవాళ్లూ పోతున్నారు!
ఎన్నికల ఫలితాల నాటికి, ఇప్పటికి ఓటర్లలో ఎంతో మార్పు కనిపిస్తుండటంతో బీఆరెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, పలువురు ముఖ్య నేతలు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. జారిపోతున్నవారిని బతిమలాడేందుకు కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగినా ఫలితం కనిపించడం లేదని చెబుతున్నారు. దానికి తాజా ఉదాహరణగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. వర్థన్నపేట నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన ఆరూరి రమేశ్ పార్టీ వీడకుండా చూసేందుకు బుధవారం హైడ్రామాయే నడిచింది. ఆయన ఇంటికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా వెళ్లి.. రమేశ్‌ను దాదాపు బలవంతంగా కారులో ఎక్కించుకుని కేసీఆర్ ముందుకు తీసుకెళ్లారు. వరంగల్ ఎంపీ సీటును రమేశ్‌కు కేసీఆర్ ఆఫర్ చేసినా.. మీకో దండం మీ సీటుకో దండం అన్నట్టుగా ఆయన నిరాకరించారని సమాచారం. కానీ పార్టీలోనే ఉంటానని, వేరే పార్టీలోకి వెళ్లేది లేదని బాస చేసిన రమేశ్.. 24 గంటల్లోనే తాను అనుకున్నదే చేస్తూ.. బీజేపీలో చేరేందుకు ఢిల్లీకి పయనమయ్యారు. ఇదిలా ఉన్నదో లేదో.. మాజీ మంత్రి మల్లారెడ్డి మరో షాక్ ఇచ్చారు. ఆయన నేరుగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, దక్షిణాదిలో ప్రభావవంతమైన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ను కుమారుడు, అల్లుడితో సహా వెళ్లి కలిశారు. వాస్తవానికి మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా మల్లారెడ్డిని బీఆరెస్ అధినాయకత్వం కొద్ది రోజులుగా కోరుతున్నదని సమాచారం. అయితే.. ఆయన కుమారుడు భద్రారెడ్డికి బీఆరెస్ టికెట్ ఖరారైందని అనుకుంటున్న సమయంలో మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిసారించింది. మల్లారెడ్డి కబ్జాలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో కబ్జా చేసి కట్టిన భవనాల కూల్చివేతలు మొదలయ్యాయి. ఆ సమయంలో పెడబొబ్బలు పెట్టిన మల్లారెడ్డి.. ఏది ఏమైనా తాను కేసీఆర్ వెంటే ఉంటానంటూ ప్రతినలుబూనారు. అదే సమయంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి తమపై చర్యల విషయంలో ఉపశమనం కల్పించాల్సిందిగా వేడుకున్నారని సమాచారం. ఊ.. అంటే వెంటనే పార్టీ తీర్థం పుచ్చుకుంటానని, ఎలా చెబితే అలా నడుచుకుంటానని కాళ్లు పట్టుకున్నంత పనిచేశారని బయట చెవులు కొరుక్కుంటున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి నరేందర్‌రెడ్డి తీసుకెళ్లారని, సీఎం మాత్రం ససేమిరా అన్నారని సమాచారం. దీంతో అట్నుంచి నరుక్కొద్దామనే ఆలోచనతో బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్‌ను కలిశారని చర్చ నడుస్తున్నది. ప్రియాంక గాంధీతో అప్పాయింట్‌మెంట్ ఇప్పించాలని వేడుకున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అక్కడ ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
బలం, బలగం ఎప్పుడూ ఒక్కరి దగ్గరే ఉండిపోవు!
అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంటు ఎన్నికల పరిస్థితులు వేరుగా ఉంటాయి. అసెంబ్లీలో విజయం సాధించిన పార్టీలు పార్లమెంటులో కూడా అదే ఊపును కొనసాగిస్తాయని అనుకోవడం రాజకీయాల్లో సాధ్యం కాదు. కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి 2019 పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ తరువాత జరిగిన హుజూర్ నగర్, హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. కానీ.. ఎదురుదెబ్బలు తట్టుకుని, అధికారంలోకి వచ్చింది. అందుకే బలం, బలగం ఎప్పుడూ ఒక్కరి దగ్గరే ఉండిపోవని, మారిపోతుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు బీఆరెస్ నుంచి బలం, బలగం కాంగ్రెస్‌కు, బీజేపీకి మళ్లాయని వ్యాఖ్యానిస్తున్నారు.
బీఆరెస్ ఏం చెప్పి ఓట్లడగాలి?
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ అని బీఆరెస్ చెప్పుకోవడమే కాకుండా.. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరని సవాళ్లు విసిరింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ కాబోతున్నది. అటు బీజేపీకి ప్రధాని అభ్యర్థిగా మోదీ ఉన్నారు. రాహుల్ తమ ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ చెబుతున్నది. బీఆరెస్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా చెప్పుకొనే అవకాశం లోక్‌సభ ఎన్నికల్లో ఉండదు. లోక్‌సభ ఎన్నికల్లో దేశ రాజకీయాలను ఓటర్లు పరిగణనలోకి తీసుకుని ఓటేస్తారు. ఇప్పుడు దేశ రాజకీయాల్లో బీఆరెస్ పాత్ర ఏంటనే ప్రశ్న కూడా వస్తుంది. పోనీ ఎవరు ప్రధాని కావడానికి మద్దతు ఇస్తారనే విషయం చెప్పుకొనే పరిస్థితిలో కూడా బీఆరెస్ లేదు. కేవలం.. తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే బీఆరెస్‌కు ఓటేయాలని కేసీఆర్ కానీ, కేటీఆర్ లేదా హరీశ్ కానీ చెబుతున్నారు. ఇది కూడా ఆ పార్టీకి బూమర్యాంగ్ అయ్యే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ‘తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతాం అంటే.. మరి ఈ పదేళ్లలో బీఆరెస్ ఎంపీలు ఒరగబెట్టిందేంటనే ప్రశ్నలు వస్తాయి. మోదీ హయాంలో ఏమీ జరగలేదని బీఆరెస్ నాయకులే అంటున్నారు. మరి ఏమీ జరగకుంటే బీఆరెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో ఎందుకు ఓటేయ్యాలి అనే చర్చ కూడా ముందుకు వస్తుంది’ అని ఒక సీనియర్ విశ్లేషకుడు అన్నారు. ఇక పార్టీ ఇప్పట్లో బాగుపడే అవకాశం లేనందునే పలువురు నాయకులు జారిపోతున్నారని, జాగ్రత్తగా తప్పుకుంటున్నారని చెబుతున్నారు. కొత్తగా పార్టీలో చేరే వారు లేక, అభ్యర్థులు అనుకున్నవారు జారిపోతుండటంతో కొత్తవారిని ఎంచుకోవాల్సిన పరిస్థితి బీఆరెస్‌కు తలెత్తుతున్నదని అంటున్నారు. కొందరిని బలవంతంగా బరిలో దింపుతున్నారన్న అభిప్రాయాలూ ఉన్నాయి.
బీఆరెస్‌తో పొత్తుతో సాధించేది ఏంటి?
ఇన్నాళ్లూ పొత్తులంటేనే పొసగని బీఆరెస్.. ఇప్పుడు బీఎస్పీతో పొత్తుకు సిద్ధపడటం గమనార్హం. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షాల పొత్తుతో బీఆరెస్ బయటపడింది. కానీ.. గెలిచిన తర్వాత వామపక్షాలను తన గుమ్మం తొక్కనివ్వలేదు. పూచిక పుల్లలా తీసిపడేవారని వామపక్ష శ్రేణులు వాపోయాయి. ఇప్పుడు అవసర కాలంలో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. నిజానికి బీఎస్పీకి రాష్ట్రంలో సుమారు మూడు శాతం ఓటింగ్ ఉన్నది. అయినా.. కేసీఆర్ కొండ దిగి వచ్చి మరీ బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారని పరిశీలకులు అంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39
శాతం, బీఆరెస్‌కు 37శాతం, బీజేపీకి 14 శాతం ఓట్లు వచ్చాయి. మారిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్‌కు ఏ మాత్రం వ్యతిరేక ఓటు ఉన్నా దానిని బీఆరెస్ అందిపుచ్చుకోగలదా? లేక ఆ ఓట్లను బీజేపీ తనవైపు తిప్పుకొంటుందా? అనేది చూడాలి. ఒకవేళ వ్యతిరేక ఓటు బీఆరెస్‌కు లభించని పక్షంలో ఆ పార్టీ మరింత బలహీనపడిపోవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. అదే జరిగితే.. తానే అవకాశం ఇస్తే ఎదిగిన బీజేపీ.. తాను ఎదిగేందుకు దోహదం చేసిన బీఆరెస్‌ను స్వాహా చేయడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.