బీజేపీ ఎన్నిక‌ల బ‌డ్జెట్‌

మధ్య‌త‌ర‌గ‌తిని ఆకట్టుకునే యత్నం వేత‌న జీవుల‌కు ఎట్టకేలకు ఊర‌ట‌ ఆదాయం ప‌న్ను మిన‌హాయింపులు విధాత‌: వ‌చ్చే ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌లున్న క్ర‌మంలో ఈసారి బ‌డ్జెట్‌లో మోదీ స‌ర్కారు.. అర‌చేతిలో స్వ‌ర్గం చూపించింది. ముఖ్యంగా దేశ జ‌నాభాలో అత్య‌ధికంగా ఉన్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి, వేత‌న జీవుల‌ను ఆక‌ర్షించే ప్ర‌క‌ట‌న‌ల్నే గుప్పించింది. రాబోయే ఆర్థిక సంవ‌త్స‌రానికి (2023-24)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బుధ‌వారం పార్ల‌మెంట్‌లో ప్ర‌క‌టించిన ఈ బ‌డ్జెట్‌లో చాలా ఏండ్ల త‌ర్వాత ప‌న్ను శ్లాబుల‌ను స‌వ‌రించారు. […]

  • By: Somu    latest    Feb 01, 2023 12:31 PM IST
బీజేపీ ఎన్నిక‌ల బ‌డ్జెట్‌
  • మధ్య‌త‌ర‌గ‌తిని ఆకట్టుకునే యత్నం
  • వేత‌న జీవుల‌కు ఎట్టకేలకు ఊర‌ట‌
  • ఆదాయం ప‌న్ను మిన‌హాయింపులు

విధాత‌: వ‌చ్చే ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌లున్న క్ర‌మంలో ఈసారి బ‌డ్జెట్‌లో మోదీ స‌ర్కారు.. అర‌చేతిలో స్వ‌ర్గం చూపించింది. ముఖ్యంగా దేశ జ‌నాభాలో అత్య‌ధికంగా ఉన్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి, వేత‌న జీవుల‌ను ఆక‌ర్షించే ప్ర‌క‌ట‌న‌ల్నే గుప్పించింది. రాబోయే ఆర్థిక సంవ‌త్స‌రానికి (2023-24)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బుధ‌వారం పార్ల‌మెంట్‌లో ప్ర‌క‌టించిన ఈ బ‌డ్జెట్‌లో చాలా ఏండ్ల త‌ర్వాత ప‌న్ను శ్లాబుల‌ను స‌వ‌రించారు. ఆదాయం ప‌న్ను (ఐటీ) మిన‌హాయింపు ప‌రిమితిని కూడా పెంచారు. త‌ద్వారా సామాన్యుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నమే చేశారు. ఇక‌పోతే ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న (పీఎంఏవై) కింద ఈ బ‌డ్జెట్‌లో కేటాయింపుల‌ను ఏకంగా 66 శాతం పెంచ‌డం గ‌మ‌నార్హం. రూ.79,000 కోట్ల‌కుపైగా నిధుల‌ను కేటాయించారు. ఈ క్ర‌మంలోనే గ‌త బ‌డ్జెట్ల‌లో వ‌ల్లెవేసిన ద్ర‌వ్య‌లోటు, ద్ర‌వ్యోల్బ‌ణం, ప‌న్నుల ఆదాయం త‌దిత‌ర అంశాల‌నూ ప‌క్క‌న‌బెట్టారు.

నిధులెక్క‌డివి

ఈసారి బ‌డ్జెట్‌ను రూ.45.03 ల‌క్ష‌ల కోట్ల‌తో మోదీ స‌ర్కారు తీసుకొచ్చింది. గ‌త బ‌డ్జెట్‌తో పోల్చితే రూ.5 ల‌క్ష‌ల కోట్ల‌ను పెంచారు. అయితే క‌రోనా దెబ్బ‌తో గాడి త‌ప్పిన దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఒక‌వైపు.. ప‌డిపోయిన వినీమ‌య సామ‌ర్థ్యం మ‌రోవైపున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఈ స్థాయి నిధుల‌ను కేంద్రం ఎక్క‌డి నుంచి స‌మీక‌రిస్తుంద‌న్న వాద‌న‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. అస‌లే ద్ర‌వ్య‌లోటు ఎక్కువ‌గా ఉంద‌ని, దీంతో ఈ కేటాయింపుల్లో కోత‌లు త‌ప్ప‌వ‌న్న అభిప్రాయాలూ ఆర్థిక విశ్లేష‌కుల నుంచి వినిపిస్తున్నాయి.

వృద్ధిదాయ‌క బ‌డ్జెట్ కాదు

మోదీ స‌ర్కారు ప్ర‌క‌టించిన బ‌డ్జెట్‌.. వృద్ధిదాయ‌క బ‌డ్జెట్ కాద‌ని, కేవ‌లం ఎన్నికల స్టంట్‌గా క‌నిపిస్తున్న‌ద‌న్న విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే నిరుద్యోగుల గురించి ఏమాత్రం ప‌ట్టించుకోలేద‌ని, దేశ‌వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థ‌లు భారీగా ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న వేళ వారికి ఉప‌శ‌మ‌నం క‌లిగించడంపై నిర్మ‌లా సీతారామ‌న్ దృష్టి పెట్ట‌లేద‌ని అంటున్నారు. చిరు వ్యాపారుల‌కూ పాన్ కార్డు లింకు పెట్టార‌ని, ఖాయిలా ప‌రిశ్ర‌మ‌ల‌కు ఊత‌మివ్వ‌లేద‌ని చెప్తున్నారు. ఆఖరుకు గ్రామీణ పేదలకు ఎంతో ఉపకరించే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు ప్రతిఏటా తగ్గిపోతున్నాయని, ఈ బడ్జెట్‌లోనూ గతం కంటే కేటాయింపులు తగ్గాయని గుర్తు చేస్తున్నారు.

క‌ర్ణాట‌కకు ప్ర‌త్యేక నిధులు

త్వ‌ర‌లో ఎన్నిక‌లు రాబోతున్న క‌ర్ణాట‌క కోసం ఈ బ‌డ్జెట్‌లో కొత్త కేటాయింపులే జ‌రిగాయి. ఆ రాష్ట్రంలో వెనుక‌బ‌డ్డ ప్రాంతాల‌కు, అక్క‌డ సాగు రంగానికి రూ.5,300 కోట్లు ఇచ్చారు. ఇదే క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా 50 టూరిస్ట్ స్పాట్‌ల అభివృద్ధికి ప్ర‌త్యేక నిధులు ప్ర‌క‌టించారు. అయితే తెలంగాణ త‌దిత‌ర విప‌క్ష పార్టీల ఏలిక‌లో ఉన్న రాష్ట్రాల‌కు మాత్రం న్యాయం చేయ‌లేద‌ని, రైల్వే బ‌డ్జెట్‌లోనూ ఆశించిన స్థాయిలో ప్ర‌క‌ట‌న‌లు లేవ‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. ఇక కీల‌క‌మైన వ్య‌వ‌సాయం, పారిశ్రామిక, త‌యారీ రంగాల‌కు పెద్ద‌పీట కూడా వేయ‌క‌పోవడం బ‌డ్జెట్ లోపాల‌ను ఎత్తిచూపుతున్న‌ది.

కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులివే

ఏపీలోని సంస్థలకు
విశాఖ స్టీల్ ప్లాంటుకు రూ.683 కోట్లు.
పెట్రోలియం యూనివర్సిటీకి రూ.168 కోట్లు.
కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.41,338 కోట్లు

తెలంగాణలోని సంస్థలకు
సింగరేణికి రూ.1,650 కోట్లు.
ఐఐటీ హైదరాబాద్‌కు ఈఏపీ కింద రూ.300 కోట్లు.
కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ.21,470 కోట్లు.

తెలుగు రాష్ట్రాల్లో గిరిజన వర్సిటీలకు రూ.37 కోట్లు.

దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ.6,835 కోట్లు
బీబీనగర్, ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌కూ నిధులు
సాలార్జంగ్ సహా.. అన్ని మ్యూజియాలకు రూ.357 కోట్లు.
మణుగూరు, కోట భార జల కర్మాగారాలకు రూ.1,473 కోట్లు