మా పార్టీలోకి రండి.. కాంగ్రెస్ నేతలకు బీజేపీ వల!
రండి మేమున్నామంటూ పిలుపులు వలస నేతలకే బాధ్యతలు విధాత: కాంగ్రెస్ పార్టీలో బలం, బలగం ఉన్న నేతలపై బీజేపీ దృష్టి కేంద్రీకరించింది. ఏ పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలను బీజేపీలోకి తీసుకోవాలనేది నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ నుంచే బీజేపీలోకి వలన వెళ్లిన నేతలకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన సీనియర్ నేతలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విడివిడిగా పలువురు […]

- రండి మేమున్నామంటూ పిలుపులు
- వలస నేతలకే బాధ్యతలు
విధాత: కాంగ్రెస్ పార్టీలో బలం, బలగం ఉన్న నేతలపై బీజేపీ దృష్టి కేంద్రీకరించింది. ఏ పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలను బీజేపీలోకి తీసుకోవాలనేది నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ నుంచే బీజేపీలోకి వలన వెళ్లిన నేతలకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన సీనియర్ నేతలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విడివిడిగా పలువురు కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేతలు పలు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలతో మాట్లాడినట్లు సమాచారం.
అన్నీ మేము చూసుకుంటాం.. టికెట్లు పక్కాగా మనకే ఇస్తారు. వచ్చే సారి కేంద్రంలోనూ బీజేపీనే అధికారంలోకి వస్తుంది. పనులవుతాయి.. అందరం కలిసి బీజేపీ నుంచి గట్టిగా పోరాడితే ఇక్కడ కూడా అధికారంలోకి రావచ్చు.. రండి కలిసి కొట్లాడుదామని ఈ నేతలు హమీలు ఇస్తూ ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.
అప్పుడు మన మంతా కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్‌పై కొట్లాడాం.. గట్టిగా పోరాడినా కూడా ఓడిపోవాల్సి వచ్చింది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభ మసక బారింది. దేశంలో మోడీ, అమిత్‌షాల హవా గాలి వీస్తోంది.
కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ సరిగ్గా లీడ్ చేయడం లేదు.. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో తెలియదు.. ఇలాంటి పరిస్థితిలో కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కంటే బీజేపీనే బెటర్ అని సదరు నాయకులు కాంగ్రెస్‌లో ఉన్న కొంత మంది నేతలకు మైండ్ వాష్ చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది.
రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టినా… అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ కేడర్ బాగా దెబ్బతిని ఉన్నదని, రాష్ట్రంలో కూడా కేడర్ బాగా దెబ్బతిన్నట్లుగా మనకు కనిపిస్తోందని సదరు నేతలు కొంత మంది కాంగ్రెస్‌లో ఉన్న నేతలకు వీరు హిత బోధ చేస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ కోల్పోయిందని చెపుతున్నారట.. ఇందుకు ఉదాహరణగా ఉప ఎన్నికల్లో హుజూర్ నగర్ సిట్టింగ్ సీట్‌ను కాంగ్రెస్ కోల్పోయిన మాట వాస్తవం కాదా అని చెపుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు పీసీసీ అధ్యక్షుడుగా ఉండి కూడా తన సిట్టింగ్ సీట్‌ను కోల్పోవడం అంటే కాంగ్రెస్ బాగా దెబ్బతిన్నట్లే కదా? అని చెపుతున్నారని తెలిసింది.
అలాగే ప్రజాక్షేత్రంలో అత్యంత బలమున్న జానారెడ్డి కూడా ఓడిపోయారని చెప్తున్నారట. ఇదే సమయంలో బీజేపీ దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాలలో గెలిచిన విషయాన్ని వివరిస్తున్నారు. మునుగోడులో అతి స్వల్ప తేడాతో ఓడిపోయామని, ఈ మూడు నియోజక వర్గాలో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయిన విషయాన్ని ఈ సందర్భంగా చె పుతున్నారట…
కాంగ్రెస్ పార్టీ కంటే వ్యక్తిగతంగా మీకే ఎక్కువ బలం, బలగం ఉంటుందని, బీజేపీలోకి వస్తే మీ బలానికి, పార్టీ శక్తి, ఇమేజ్ తోడై గెలుస్తామని చెపుతున్నారట.. కేసీఆర్ మీద గెలవడానికి కాంగ్రెస్ కంటే… బీజేపీనే బెటర్.. రండి బ్రదర్స్, రండి సిస్టర్స్ కలిసి బీజేపీలో పని చేద్దామని ఈ నేతలు కాంగ్రెస్‌లో కాస్త స్వంత బలం ఉన్న నేతలకు ఎరవేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ మేరకు పలు జిల్లాలకు చెందిన నేతలతో మాట్లాడినట్లు సమాచారం. స్వంత బలం ఉన్నా… కాంగ్రెస్ సీటు ఇస్తుందో లేదోనన్నసందేహాలతో కొట్టుమిట్టాడుతున్న నేతలతో కూడా మాట్లాడుతున్నట్లు చర్చ జరుగుతోంది. సదరు నేతలు స్వయంగా కానీ, లేదా తమకు నమ్మకస్తుల ద్వారా కానీ సమాచారం అందిస్తూ బీజేపీలోకి రావాలని కోరుతున్నట్లు తెలిసింది.