బారా ఖూన్ మాఫీ!

దేశంలో రెండు ప‌ర్యాయాలు వ‌రుస‌గా అధికారాన్ని చెలాయిస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ

బారా ఖూన్ మాఫీ!

ఆరోప‌ణ‌లు చేసిన వారికే బీజేపీ అవ‌కాశం 

వ‌ల‌స‌నేత‌ల‌కే లోక్‌సభ టికెట్ల కేటాయింపు

అది ఆ పార్టీకి బ‌ల‌మా? బ‌ల‌హీన‌తా?

పాత నేత‌ల్లో తీవ్ర అసంతృప్తి సెగలు

పార్టీ కోసం మేము.. ప‌ద‌వులు వారికా?

ఎన్నిక‌ల వేళ అంత‌ర్గ‌త అసమ్మ‌తి

గెలుపొక్క‌టే బీజేపీ అధిష్ఠానానికి ల‌క్ష్యం!

విధాత ప్ర‌త్యేక ప్ర‌తినిధి : దేశంలో రెండు ప‌ర్యాయాలు వ‌రుస‌గా అధికారాన్ని చెలాయిస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) మూడ‌వ సారి పీఠాన్ని కైవ‌సం చేసుకునేందుకు బారాఖూన్‌ మాఫీ సిద్ధాంతాన్ని అమ‌లు చేస్తోందా? పార్ల‌మెంట్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయ‌డంలో ఈ విధానానికి ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త‌నిస్తోందా? పొద్దునలేస్తే నీతులు వ‌ల్లిస్తూనే త‌మ అవ‌సరార్థం, అధికారం కోసం ఎవ‌రికైనా సీటు ఇచ్చేందుకు వెనుకంజ‌వేయ‌డంలేదా? లోక్‌సభ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక తీరు గమనిస్తే అవుననే సమాధానాలే వస్తున్నాయి. గ‌తంలో తాము తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేసిన నేత‌ల‌నే పార్టీలో చేర్చుకుని టికెట్లివ్వ‌డాన్ని చూసి ఆ పార్టీలోని పాత త‌రం నేత‌లు విస్తుపోతున్నారు. పైగా మోదీ ప్ర‌ధానిని చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మంటూనే అవినీతికి అస్కారం లేదని నీతులు వల్లిస్తున్నారని, ద‌శాబ్దాలుగా పార్టీని న‌మ్ముకుని, క‌ష్ట‌సుఖాల్లో పార్టీలోనే కొన‌సాగుతూ ఎన్నిక‌ల్లో పోటీకి అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న వారిని కాదని టికెట్లు పందేరం చేస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న‌టి వ‌ర‌కు తాము తీవ్ర ఆరోప‌ణ‌లు చేసి, తిట్టిపోసిన వారినే త‌మ నెత్తిన తెచ్చిపెట్ట‌డాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. కొంద‌రు త‌మ స‌హ‌చ‌రుల వ‌ద్ద‌, పార్టీ స‌మావేశాల్లో ఇదే విష‌యాన్ని లేవ‌నెత్తుతుండ‌గా మ‌రి కొంద‌రు మాత్రం ప్రైవేటు సంభాషణల్లో ఆవేద‌న‌తో ర‌గిలిపోతున్నారు. స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మొక్క‌టే ల‌క్ష్యంగా మోదీ నేతృత్వంలోని బీజేపీ ఎదుగుదల‌గా మ‌రికొంద‌రు సెటైర్లు వేస్తున్నారు. ఇది పార్టీ బ‌లాన్ని పెంచుతుందా? బ‌ల‌హీన‌త‌కు సూచ‌నా? అనే సంశయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. 

ప‌దేళ్ళ క్రితం పార్టీ ప‌రిస్థితిని ప‌క్క‌న‌పెడితే గ‌త రెండు ప‌ర్యాయాలుగా అంటే దాదాపు ద‌శాబ్ద‌కాలం నుంచి మోదీ నేతృత్వంలో కూడా తెలంగాణ‌లో పార్టీ ప‌రిస్థితి నిర్మాణాత్మ‌కంగా పెద్ద‌గా మెరుగుప‌డ‌లేద‌ని తాజా వ‌ల‌స‌ల ప్రోత్సాహాన్ని చూస్తే స్ప‌ష్ట‌మ‌వుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పోల్చితే ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రో నాలుగు స్థానాలు పెరుగ‌వ‌చ్చుగానీ, పార్టీ నిర్మాణాత్మ‌కంగా ఎద‌గ‌లేద‌నేందుకు పార్టీలోకి సాగుతున్న వ‌ల‌స‌లూ, వ‌ల‌స‌నేత‌ల‌కు ఇస్తున్న ప్రాధాన్య‌ం చాటుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

వ‌ల‌స‌ల నేత‌ల‌కే తొలి ప్రాధాన్య‌ం

తెలంగాణ బీజేపీలో ప్ర‌స్తుతం వ‌ల‌స‌నేత‌ల‌కే పెద్ద పీట వేశారనేది నిర్వివాదాంశం. రాష్ట్రంలో 17 లోక్‌స‌భ స్థానాలుండ‌గా ఇప్ప‌టికే అన్ని స్థానాల‌కు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించి బీఆర్ఎస్‌, కాంగ్రెస్ కంటే ముందు వ‌రుస‌లో ఉన్నారు. 17 స్థానాల్లో ఇద్ద‌రు మాత్ర‌మే తొలి నుంచి బీజేపీని న‌మ్ముకుని ఆ పార్టీలో ప‌నిచేస్తున్న నాయ‌కులుగా చెప్ప‌వ‌చ్చు. మిగిలిన వారిలో 2018 ముందు అంటే గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో చేరిన వారున్నారు. మిగిలిన వారిలో మెజార్టీ అభ్యర్థులు కొద్ది రోజుల క్రితం ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారు కావ‌డం గమనార్హం. ఇందులో కొంద‌రికైతే పార్టీలో క‌నీస ప్రాథ‌మిక స‌భ్య‌త్వం ఇవ్వ‌క‌ముందే అభ్యర్థులుగా ప్రకటించేయడం విడ్డూరం. ఈ ప‌రిణామాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్న సొంత పార్టీ సీనియ‌ర్ నేత‌లు కొంద‌రు తమ పార్టీ అభ్య‌ర్థులను ఇత‌ర పార్టీల్లో వెతుక్కుంటున్నామని చెబుతున్నారు. ఈ వ‌చ్చే నాయ‌కుల్లో ఎక్కువ మందిపై గ‌తంలో తామే ఆరోప‌ణ‌లు చేశామ‌ని మ‌రీ గుర్తు చేయ‌డం కొస‌మెరుపు. 

గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెలంగాణ నుంచి న‌లుగురు బీజేపీ ఎంపీలుగా గెలుపొందారు. సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు గంగాపురం కిష‌న్ రెడ్డి, క‌రీంన‌గ‌ర్ నుంచి మాజీ రాష్ట్ర అధ్య‌క్షుడు, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బండి సంజ‌య్ కుమార్‌, నిజామాబాద్ నుంచి ధ‌ర్మ‌పురి అర్వింద్‌, ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు గెలుపొందారు. ఇందులో కిష‌న్‌రెడ్డి, సంజ‌య్ త‌ప్ప అర్వింద్, బాపూరావు ఇత‌ర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారే. 

పంచ‌పాండ‌వులు.. మంచంకోళ్ళు

పంచ‌ పాండ‌వులు మంచ‌కోళ్ళు అనే సామెత మాదిరిగా బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక సాగిందనే జోకులు పేలుతున్నాయి. సొంత పార్టీ నేత‌ల కంటే ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారికే పిలిచి మ‌రీ పీట‌వేశారు. గ‌త ఎన్నిక‌ల్లో గెలుపొందిన న‌లుగురిలో 2024 తాజా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తిరిగి పోటీ చేసేందుకు ముగ్గురికి మ‌రోసారి అధిష్ఠానం అవ‌కాశం క‌ల్పించింది. గిరిజన బిడ్డ సోయం బాపూరావుకు మొండి చెయ్యి చూపెట్టింది. బీఆర్ఎస్ నుంచి వ‌చ్చిన గోడం న‌గేశ్‌కు అవ‌కాశం క‌ల్పించింది. మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కిష‌న్ రెడ్డి మిన‌హా మిగిలిన ముగ్గురు ఎంపీలు అంతకు ముందు ఎమ్మెల్యేలుగా పోటీచేసి ఓట‌మిపాల‌య్యారు. సోయం బాపూరావు త‌న‌కు టికెట్ ద‌క్క‌క‌పోవ‌డం ప‌ట్ల అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. ఆయ‌న పార్టీ మారుతారా? బీజేపీలోనే కొన‌సాగుతారా? వేచిచూడాల్సిందే. ఇక మిగిలిన 13 స్థానాల్లో వ‌ల‌స‌ప‌క్షుల‌కే ప్ర‌ధమ ప్రాధాన్య‌ం ఇచ్చారు. మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందే బీఆర్ఎస్ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరి హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో గెలిచారు. తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హుజురాబాద్, గ‌జ్వేల్‌లో పోటీ చేసి, రెండు చోట్లా ఓటమిపాలయ్యారు. ఇప్పుడు మ‌ల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తున్నారు. రెండు స్థానాల్లో ఓట‌మిపాలైన వ్య‌క్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ టికెట్ ఆశించిన కొంద‌రు ఆశావ‌హులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ చేరిక త‌ర్వాత కొద్ది రోజులకు కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి బీజేపీలో చేరారు. గ‌తంలో ఆయ‌న చేవెళ్ళ నుంచి బీఆరెస్‌ ఎంపీగా గెలిచారు. త‌దుప‌రి కాంగ్రెస్ పార్టీలో చేరి అటునుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు చేవెళ్ళ బీజేపీ టికెట్ ద‌క్కింది. గ‌తంలో టీఆర్ఎస్‌లో ప‌నిచేసి బీజేపీలో చేరిన ర‌ఘునంద‌న్ రావు దుబ్బాక నుంచి మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన‌ప్ప‌టికీ మెద‌క్ ఎంపీ టికెట్ ద‌క్కించుకున్నారు. కాంగ్రెస్ నుంచి గ‌త ఎన్నిక‌ల‌కు ముందే బీజేపీలో చేరిన డీకే అరుణ‌కు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ స్థానం కేటాయించారు. ఇక పెద్దపల్లి ఎంపీ టికెట్ పొందిన గోమాస శ్రీ‌నివాస్ తాజాగా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. నాగ‌ర్ క‌ర్నూల్ అభ్య‌ర్థిగా పోతుగంటి భ‌ర‌త్‌కు అవ‌కాశం క‌ల్పించారు. భ‌ర‌త్ తండ్రి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేర‌డంతో కుమారుడికి చాన్సు ద‌క్కింది. జ‌హీరాబాద్ అభ్య‌ర్థిగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీపాటిల్‌ను నిలిపారు. న‌ల్ల‌గొండ నుంచి హుజురాబాద్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డికి, వ‌రంగ‌ల్ నుంచి వ‌ర్ద‌న్న‌పేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్‌కు, భువ‌న‌గిరి నుంచి మాజీ బీఆర్ఎస్ ఎంపీ బూర న‌ర్స‌య్య‌గౌడ్‌కు, మ‌హ‌బూబాబాద్ నుంచి మాజీ బీఆర్ఎస్ ఎంపీ అజ్మీరా సీతారామ్ నాయ‌క్‌కు, ఖ‌మ్మం నుంచి ఆర్ఎస్ఎస్ నేప‌థ్యం ఉన్న‌ తాండ్ర వినోద్ రావుకు అవ‌కాశం క‌ల్పించారు. హైద‌రాబాద్ నుంచి పార్టీలో క‌నీస స‌భ్య‌త్వంలేని మాధ‌వీల‌త‌కు టికెట్ ఇచ్చారు. 

ఆరోప‌ణ‌లు చేసిన నేత‌ల‌కే అవ‌కాశం

రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు, బండ్లు ఓడలు కావడమొక్కటే కాదు.. వీరు వార‌వుతార‌న్న‌ట్లు ఎదుటి పార్టీలో ఉన్న‌ప్పుడు తీవ్ర విమ‌ర్శ‌లు చేసి త‌మ పార్టీలో చేర‌గానే పునీతులైన‌ట్లుగా భావించ‌డం ఇటీవ‌ల ప‌రిపాటిగా మారింది. తాజా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ ఎంపీ టికెట్ పొందిన అనేక మందిపై బీజేపీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన విష‌యాన్ని ఇప్పుడు విప‌క్షాలు, రాజ‌కీయ‌వాదులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేలుగా ఉన్న‌పుడు సైదిరెడ్డి, ఆరూరి ర‌మేశ్‌పై తీవ్రమైన భూక‌బ్జా ఆరోప‌ణ‌లు ఇదే బీజేపీ నాయ‌కులు చేశారు. హుజుర్ న‌గ‌ర్‌లో భూ ఆక్ర‌మ‌ణ‌ల వ్య‌వ‌హారం పెద్ద దుమారాన్ని రేపింది. అప్ప‌టి రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై దాడి కూడా జ‌రిగింది. ఇక ఆరూరి ర‌మేశ్‌ భూక‌బ్జాలపై అప్పటి జిల్లా అధ్య‌క్షుడు, రాష్ట్ర అధ్య‌క్షుడు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వీరితో పాటు బీబీ పాటిల్, రాములుపై విమ‌ర్శ‌లు చేశారు. త‌మ పార్టీలో చేర్చుకోగానే వారిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌న్నీ తూచ్ అన్న‌ట్లుగా బీజేపీ అధిష్ఠానం, రాష్ట్ర నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోప‌ణ‌లు, న‌డ‌వ‌డిక ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెట్టి అధికారం, ఎన్నిక‌ల్లో భారీగా ఖ‌ర్చుచేసే నాయ‌కుల‌ను ఎంపీక చేయ‌డం రివాజుగా మారింద‌ని ఆ పార్టీ నాయ‌కులే ఆవేద‌న‌తో పాటు అసంతృప్తితో ఉన్నారు. తొలి నుంచి పార్టీ జెండా మోసిన త‌మ‌ను కాద‌ని వ‌ల‌స‌నేత‌ల‌కు ప‌ట్టం క‌ట్టార‌ని మండిప‌డుతున్నారు. పార్టీని కాపాడింది తామైతే ప‌ద‌వులు మాత్రం వారికి ద‌క్కుతున్నాయ‌ని అంటున్నారు. ఎన్నిక‌ల‌ నాటికి పార్టీలో నెల‌కొన్న ఈ అసంతృప్తి ఏ విధంగా వ్య‌క్త‌మ‌వుతుందోన‌నే చ‌ర్చ బీజేపీలో సాగుతోంది.