72మందితో బీజేపీ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితా వెల్లడి

పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ కేంద్ర నాయకత్వం బుధవారం ప్రకటించింది

72మందితో బీజేపీ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితా వెల్లడి

తెలంగాణలో మరో 6 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

పెండింగ్‌లో వరంగల్‌, ఖమ్మం స్థానాలు

విధాత, హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ కేంద్ర నాయకత్వం బుధవారం ప్రకటించింది. 72మందితో రెండో జాబితాను వెల్లడించింది. ఇందులో తెలంగాణ లోక్‌సభ స్థానాల అభ్యర్థులకు సంబంధించి 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 9మంది అభ్యర్థులను ప్రకటించగా, రెండో జాబితాలో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిది. మహబూబ్‌నగర్ లోక్ సభ స్థానం అభ్యర్థిగా మాజీ మంత్రి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణను ప్రకటించారు. మెదక్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మహబూబాబాద్ అభ్యర్థిగా మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, ఆదిలాబాద్ అభ్యర్థిగా గోడెం నగేశ్‌, పెద్దపల్లి అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్, నల్లగొండ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేర్లను ప్రకటించారు. ఇప్పటివరకు తెలంగాణలోని 17లోక్‌సభ స్థానాలకు గాను రెండు జాబితాలలో కలిపి 15స్థానాల అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్టానం వరంగల్‌, ఖమ్మం స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఇతర పార్టీల నుంచి కొత్తగా పార్టీలో చేరిన వారికి ఈ దఫా మెజార్టీ సీట్లు కేటాయించడం గమనార్హం. అలాగే ఆదిలాబాద్ ఎంపీ స్థానం టికెట్‌ను సిటింగ్ ఎంపీ సోయం బాపురావుకు నిరాకరించడం జరిగింది.