బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి

బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం
  • నారాయణపేలో ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి


విధాత : తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో కృష్ణమ్మ విజయసంకల్ప యాత్రను కృష్ణా గ్రామం సమీపంలోని కృష్ణా నదిలో కృష్ణమ్మకు పూజలు చేసి కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారభించారు. శంఖారావం పూరించి యాత్రను ప్రారంభించారు. ఐదు క్లస్టర్ల వారిగా విజయ సంకల్ప యాత్రలను రూపొందించారు.


కొమరం భీం విజయసంకల్ప యాత్ర, రాజరాజశ్వేర విజయ సంకల్పయాత్ర, భాగ్యనగర విజయ సంకల్పయాత్ర, కాకతీయ భద్రకాళి విజయ సంకల్పయాత్ర, కృష్ణమ్మ విజయ సంకల్పయాత్రల పేర్లతో ఐదు మార్గాల గుండా యాత్రలు కొనసాగి మార్చి 2వ తేదీకి హైదరాబాద్‌కు చేరుకుంటాయి. వాటిలో మేడారం జాతర నేపధ్యలో కాకతీయ భద్రకాళీ యాత్ర కొన్ని రోజులు ఆలస్యంకానుండగా, మిగతా నాలుగు క్లస్టర్లలో యాత్రలు ప్రారంభమయ్యాయి. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలు, 114 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,500 కిలోమీటర్ల మేర ఈ విజయ సంకల్ప యాత్రలు జరుగనున్నాయి. ఈ యాత్రలో భాగంగా 106 సమావేశాలు, 102 రోడ్ షోలు నిర్వహించనున్నారు. మార్చి 2న హైదరాబాద్‌లో జరిగే యాత్రల ముగింపు సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు.