Karnataka | కర్ణాటకలో బీజేపీకి గడ్డు పరిస్థితే!

Karnataka । అన్ని ప్రాంతాల్లో పట్టుకు కాంగ్రెస్ వ్యూహం కింగ్ మేకర్ కావాలనుకుంటున్న జనతాదళ్ ఎస్ కర్ణాటకలో మే పదవ తేదీ నాటికి పోలింగ్ ప్రక్రియ ముగిసి 13వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. రాష్ట్రంలో రాజకీయం ఇప్పటికే వేడెక్కింది. కాంగ్రెస్‌ పుంజుకుంటుందా? బీజేపీ తన పట్టు నిలుపుకుంటుందా? జేడీఎస్‌ పరిస్థితి ఏమిటి? అనే విషయాలపై చర్చ సాగుతున్నది. విధాత ప్రత్యేకం : ఎన్నికలు జరుగబోతున్న కర్ణాటక రాష్ట్రాన్ని భౌగోళికంగా రాజకీయంగా ఆరు ప్రాంతాలుగా విభజించి చూడాల్సి ఉంటుంది. […]

  • By: Somu    latest    Mar 29, 2023 11:01 AM IST
Karnataka | కర్ణాటకలో బీజేపీకి గడ్డు పరిస్థితే!

Karnataka ।

  • అన్ని ప్రాంతాల్లో పట్టుకు కాంగ్రెస్ వ్యూహం
  • కింగ్ మేకర్ కావాలనుకుంటున్న జనతాదళ్ ఎస్

కర్ణాటకలో మే పదవ తేదీ నాటికి పోలింగ్ ప్రక్రియ ముగిసి 13వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. రాష్ట్రంలో రాజకీయం ఇప్పటికే వేడెక్కింది. కాంగ్రెస్‌ పుంజుకుంటుందా? బీజేపీ తన పట్టు నిలుపుకుంటుందా? జేడీఎస్‌ పరిస్థితి ఏమిటి? అనే విషయాలపై చర్చ సాగుతున్నది.

విధాత ప్రత్యేకం : ఎన్నికలు జరుగబోతున్న కర్ణాటక రాష్ట్రాన్ని భౌగోళికంగా రాజకీయంగా ఆరు ప్రాంతాలుగా విభజించి చూడాల్సి ఉంటుంది. 1. బెంగుళూరు అర్బన్ 2. ఓల్డ్ మైసూరు. 3. ముంబయి కర్ణాటక 4. కోస్తా కర్ణాటక 5. హైదరాబాద్ కర్ణాటక 6. మధ్య కర్ణాటక. ఈ ఆరు ప్రాంతాల వారిగా ఫలితాలే రాష్ట్ర రాజకీయాలను నిర్దేశిస్తాయి. కాంగ్రెస్, బీజేపీ జాతీయ పక్షాలతో పాటు ప్రాంతీయ పార్టీ అయిన జనతా దళ్ (ఎస్) ప్రధాన పార్టీలుగా ఉన్నాయి.

ఒక్కలిగలు, లింగాయతులదే రాజకీయ ప్రాబల్యం

కర్ణాటకలో ఒక్కలిగలు, లింగాయతులు రాజకీయంగా ప్రాబల్యంగల రెండు కులాలు. లింగాయతులకు కోస్తా, ముంబయి కర్ణాటక (ఉత్తరాన) ప్రాంతాలలో ప్రాబల్యం ఉన్నది. మధ్య కర్ణాటకలో వీరికి గట్టి పట్టు ఉన్నది. వీరు ఇటీవలి ఎన్నికల వరకు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. ఒక్కలిగలు దక్షిణాదిన పాత మైసూరు ప్రాంతంలో బలంగా ఉన్నారు. ఈ పాత మైసూరు ప్రాంతంలో జనతాదళ్ ఎస్ బలంగా ఉండటానికి ఒక్కలిగల మద్దతే ప్రధాన కారణం.

కాంగ్రెస్ పార్టీ:

ఒకప్పుడు కర్ణాటక అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో విస్తరించి ఉన్న అత్యంత బలమైన రాజకీయ పక్షం. 2008లో కాంగ్రెస్ పార్టీ ఎదురు దెబ్బ తిన్నది. కేవలం 80 స్థానాలు గెలుచుకోగలిగింది. కానీ 2013 నాటికల్లా మళ్ళా పుంజుకొని 122 సీట్లతో మెజారిటీ సాధించింది. 2018లో జనతాదళ్ ఎస్ తో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ 2019లో బీజేపీ ఈ ప్రభుత్వాన్ని కూలదోసింది. ఇప్పడు కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా బీజేపీని సవాలు చేస్తున్నది.

బీజేపీ, జేడీఎస్‌లలోనే బలమైన సామాజిక వర్గాలు

కర్ణాటకలో రెండు బలమైన సామాజిక వర్గాలైన ఒక్కాలిగలు, లింగాయతులు జనతాదళ్ ఎస్, బీజేపీ పార్టీలలో మోహరించి ఉన్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య నేతృత్వంలోని బలహీనవర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలను ఏకం చేసి అధికారంలోకి రావాలనే సిద్ధరామయ్య వ్యూహం గత ఎన్నికలలో కాంగ్రెస్ కు కొంత లాభించినప్పటికీ, మెజారిటీ స్థానాలు ఇవ్వలేక పోయింది.

అయితే కాంగ్రెస్ అన్ని వర్గాలకు వేదిక అనే అభిప్రాయం బలంగా ఉన్నది. అన్ని కులాలు, గ్రూపులు కాంగ్రెస్ లో ఉన్నాయి. ఒక్కలిగ వర్గానికి చెందిన డి.కె. శివకుమార్ కాంగ్రెస్‌లో బలమైన నాయకుడు. అతడి సహాయంతో జనతాదళ్ బలంగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలోకి చొచ్చుకుపోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది.

గత ఎన్నికలలో సిద్ధరామయ్య మాదిరిగానే ఈసారి శివకుమార్ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. బీజేపీ పట్ల అసహనంతో ఉన్న లింగాయతులను కూడా మంచి చేసుకోవడానికి కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తున్నది. రాష్ట్రమంతా బలంగా విస్తరించి ఉన్న పార్టీగా అటు జనతాదళ్ ఎస్ ను, ఇటు బీజేపీని ఢీకొంటున్నది.

జనతాదళ్ (ఎస్)

2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి జేడీఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2008 ఎన్నికల్లో తీవ్రంగా ఎదురు దెబ్బ తిన్నది. అసెంబ్లీలోని మొత్తం 224 స్థానాల్లో జేడీఎస్‌కు 28 మాత్రమే లభించాయి. 2013లో పార్టీ బలం 40 స్థానాలకు పెరిగింది. కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది. 2018లో కాంగ్రెస్ తో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2019లో బీజేపీ ఈ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చింది.

మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి నాయకత్వంలో జేడీఎస్‌ ఈ ఎన్నికల్లో తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నది. అయితే ఈ పార్టీ పాత మైసూరు ప్రాంతంలోనే బలంగా ఉన్నది. ఉత్తరాదిన తన బలం చాటుకోవాలని యత్నిస్తున్నది. కాంగ్రెస్, బీజేపీలకు మెజారిటీ రాకుంటే కింగ్ మేకర్ గా మారుతానని, వీలైతే ముఖ్యమంత్రి పదవి చేపడుతానని కుమారస్వామి భావిస్తున్నారు.

బీజేపీ:

ప్రస్తుత అధికార బీజేపీకి అసెంబ్లీలోని మొత్తం 224 స్థానాలకు గాను 119 సీట్లున్నాయి. దక్షిణాదిన బీజేపీ అధికారంలోకి రావడమనేది ఆశ్చర్యకరమైన విషయం. 2008లో బీజేపీ కర్ణాటకలో అధికారం చేపట్టడానికి కారణం బీఎస్ యడ్యూరప్ప నాయకత్వంలోని లింగాయతుల మద్దతే. దీంతో యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు.

అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ కేంద్ర నాయకత్వం యడ్యూరప్పను దెబ్బతీయాలని, తద్వారా లింగాయతులను ప్రాంతీయ రాజకీయ శక్తిగా నిలువకుండా నిర్వీర్యం చేయాలని కుట్రలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. 2011లో యడ్యూరప్పపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపివేసింది. (2016 నాటి కల్లా యడ్యూరప్ప ఆ ఆరోపణల నుంచి విముక్తుడయ్యారు) బీజేపీ కేంద్ర నాయకత్వం చేత అవమానాలు భరించలేక 2012లో బయటకు వచ్చి కర్ణాటక జనత పక్ష పేర సొంత పార్టీ పెట్టుకున్నాడు.

2013 ఎన్నికల్లో యడ్యూరప్ప పార్టీకి ఎనిమిది స్థానాలే లభించాయి. కానీ పది శాతం ఓట్లు తెచ్చుకోగలిగింది. 2008 ఎన్నికల్లో 110 స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. 2013 ఎన్నికల్లో లింగాయతుల మద్దతు లేకపోవడంతో 40 స్థానాలకే పరిమితమైంది. దీంతో బీజేపీ మళ్ళీ యడ్యూరప్పను పార్టీలో చేర్చుకున్నది. 2018 ఎన్నికలలో అతి పెద్ద రాజకీయ పక్షంగా మారినప్పటికీ, మెజారిటీ స్థానాలు లభించలేదు. 2019లో కాంగ్రెస్ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ అధికారంలోకి వచ్చింది.

మొదట యడ్యూరప్పనే ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ, ఆ తరువాత అవమానకర రీతిలో అతడిని దింపివేసింది. 2021లో యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆయన స్థానంలో లింగాయతుల సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్ బొమ్మయిని ముఖ్యమంత్రిని చేసింది. లింగాయతులలో శాఖా పరమైన చీలికలు తేవడం ద్వారా బలహీనపరచాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తున్నది. అయితే లింగాయతులు బీజేపీ తమ రాజకీయ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు.

లింగాయతుల ఆగ్రహానికి గురైన బీజేపీ ఈ సారి మెజారిటీ సాధించగలదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా అధికారానికి వచ్చిన తరువాత అవినీతి ఆరోపణలతో అప్రతిష్ఠ పాలైంది. ప్రభుత్వ వ్యతిరేకత, లింగాయతుల ఆగ్రహం, యడ్యూరప్ప సహాయ నిరాకరణ మొదలైన అంశాలు బీజేపీపై ప్రభావం చూపవచ్చు అనే అభిప్రాయం ఉన్నది.

ప్రాంతాల వారీగా..

బెంగళూరు అర్బన్:
ఈ ప్రాంతంలో మొత్తం 28 సీట్లుండగా, 2018 ఎన్నికల్లో 26 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 13, బీజేపీ 11, జనతాదళ్ ఎస్ రెండు గెలుచుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ.

పాత మైసూరు :
ఇక్కడ 66 సీట్లున్నాయి. 2018 ఎన్నికల్లో జేడీఎస్‌ 30, కాంగ్రెస్ 20, బీజేపీ 15 గెలుచుకున్నాయి. ఇక్కడ పోటీ జేడీఎస్‌, కాంగ్రెస్ మధ్య ఉంటుంది.

ముంబయి కర్ణాటక :
ఈ ప్రాంతంలో 44 స్థానాలున్నాయి. 2018 ఎన్నికల్లో బీజేపీ 26, కాంగ్రెస్ 16, జేడీఎస్‌ రెండు స్థానాలు సాధించాయి. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే.

కోస్తా :
ఇక్కడ 19 స్థానాలున్నాయి. 2018 ఎన్నికల్లో బీజేపీ 16, కాంగ్రెస్ మూడు స్థానాలు దక్కించుకున్నాయి.

హైదరాబాద్ కర్ణాటక:
ఇక్కడ మొత్తం స్థానాలు 40. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ 21, బీజేపీ 15, జనతా దళ్ ఎస్ నాలుగు సీట్లు తెచ్చుకున్నాయి.

మధ్య కర్ణాటక :
ఇక్కడ మొత్తం స్థానాలు 27. బీజేపీకి 21, కాంగ్రెస్‌కు ఐదు సీట్లు వచ్చాయి