అభివృద్ధిని చూసి జగదీశ్‌రెడ్డిని ఆశీర్వదించండి
బీఆరెస్ పాలనలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగింది.. మీ ఆశీర్వాదమే మాకు కొండంత అండ. రాబోయే ఎన్నికల్లో మంత్రి జగదీశ్ రెడ్డికి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలి

– సూర్యాపేటలో బీఆరెస్ హ్యాట్రిక్ ఖాయం
– సునీత జగదీశ్ రెడ్డి ప్రచారం
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ‘బీఆరెస్ పాలనలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగింది.. మీ ఆశీర్వాదమే మాకు కొండంత అండ. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మంత్రి జగదీశ్ రెడ్డికి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలి’ అని ప్రజలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్ సూర్యాపేట అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సతీమణి సునీత జగదీశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట పట్టణంలోని 14 వ వార్డు వినాయక నగర్, కృష్ణ కాలనీలో బుధవారం ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
మహిళలకు బొట్టు పెడుతూ, మ్యానిఫెస్టోను వివరించారు. తెలంగాణ సర్కారు చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సూర్యాపేటలో జరిగిన అభివృద్ధిని వివరించారు. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టోలో ప్రకటించిన అంశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే సూర్యాపేట ను మెట్రో నగరానికి దీటుగా మంత్రి జగదీశ్ రెడ్డి అభివృద్ధి చేయడం ఖాయం అన్నారు.