విధాత: గత కొన్నేళ్లుగా జైలు జీవితాన్ని గడుపుతున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ మంగళవారం బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. కొంతకాలంగా వీల్‌చైర్‌కే పరిమితమైన సాయిబాబా ప్రస్తుతం నాగపూర్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే అతనిపై చేసిన ఆరోపణలన్నీ కొట్టివేస్తూ, ఆయన అనుచరులను కూడా నిర్దోషులుగా బాంబే హైకోర్టు తేల్చింది. వెంటనే అతన్ని విడుదల చేయాలని జైలు అధికారులను ఆదేశించింది. సాయిబాబాకు మావోయిస్టులతో లింకులు ఉన్నాయని, దేశంలో శాంతి భద్రతలకు ముప్పుగా తయారయ్యాడన్న ఆరోపణలతో ప్రభుత్వం ఆయనపై ఉపా చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేసింది.
2017లో మహారాష్ట్రలోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు సాయిబాబాతోపాటు, మరో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తర్వాత 2022 అక్టోబర్ 14న బాంబే హైకోర్టు గడ్చిరోలి సెషన్స్ కోర్టు విధించిన యావజీవ కారాగార శిక్షను కొట్టివేస్తూ సాయిబాబాను నాగపూర్ జైలు నుండి విడుదల చేసింది. ఆ తరువాత ఈ విషయంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టి తిరిగి పరిశీలించాలని ఆదేశించింది. దీంతో సాయిబాబాను ప్రభుత్వం తిరిగి జైల్లో నిర్బంధించింది.
ప్రస్తుతం కేసును పరిశీలించిన బాంబే హైకోర్టు మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు మహారాష్ట్ర ప్రభుత్వం సాయిబాబాపై పెట్టిన కేసులన్నీ కొట్టివేస్తూ, వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో ఆయన కుటుంబ సబ్యులు, సన్నిహితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతే కాకుండా సాయిబాబా ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కోర్టు సరైన తీర్పు వెల్లడించిందని పలువురు న్యాయ శాస్త్ర నిపుణులు హర్షం వ్యక్తం చేశారు.