భూ తగాదాలతో.. పరస్పరం గొడ్డళ్లతో దాడులు
విధాత : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా అడ్డగూడూరు మండలం మానాయి కుంట గ్రామంలో భూతగాదాల్లో అన్నదమ్ములు రక్తసంబంధం మరచి పరస్పరం గొడ్డళ్ళతో దాడులు చేసుకొని నరుక్కున్నారు. గత కొంతకాలంగా అన్నదమ్ములైన మార్క సైదులు, వీరయ్య ల మధ్య భూతగాదాలు సాగుతున్నాయి. బుధవారం వీరయ్య వ్యవసాయ భూమిలో అచ్చులు తోలు, సైదులు , అతని కొడుకు శేఖర్ లు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా తలెత్తిన ఘర్షణలో వీరయ్య అతని కుమారుడు ప్రభాస్ లు, సైదులు అతని కుమారుడు శేఖర్ లు పరస్పరం గొడ్డళ్ల తో దాడులు చేసుకున్నారు. ముందస్తుగానే ఘర్షణకు సిద్ధమై వారు గొడ్డళ్ల తో దాడి చేసుకోగా దాడుల్లో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు చేతులు అక్కడికక్కడే తెగిపోగా, తలపై, వెన్నుపూసల్లో గాట్లు పడ్డాయి.
ఇరుగుపొరుగు రైతులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు క్షతగాత్రులను మోత్కూర్ ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం, బోనగిరి ఆసుపత్రికి తరలించారు. అటు నుంచి హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. వారంతా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అడ్డగుడురు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.