Mahbubnagar | ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో BRS.. కాంగ్రెస్ పోటాపోటీ! ఎన్నికల వాతావరణం షురూ
Mahbubnagar | జోరుగా నేతల పర్యటనలు పట్టుకోసం బీఆరెస్ ఎమ్మెల్యేల ఆరాటం గెలుపు సాధనకు కాంగ్రెస్ నేతల పోరాటం పోటా పోటీగా గ్రామాల్లో పర్యటనలు సిట్టింగ్ ఎమ్మెల్యేలను నిలదీస్తున్న జనం విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గ్రామాల్లో రాజకీయం వేడెక్కుతోంది. అధికార, విపక్షాల పార్టీలకు చెందిన నాయకులు గ్రామాల బాట పట్టారు. ఈసారి మళ్ళీ తామే గెలుపొందాలనే పట్టుదలతో అధికార ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో సంక్షమే పథకాలతో […]

Mahbubnagar |
- జోరుగా నేతల పర్యటనలు
- పట్టుకోసం బీఆరెస్ ఎమ్మెల్యేల ఆరాటం
- గెలుపు సాధనకు కాంగ్రెస్ నేతల పోరాటం
- పోటా పోటీగా గ్రామాల్లో పర్యటనలు
- సిట్టింగ్ ఎమ్మెల్యేలను నిలదీస్తున్న జనం
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గ్రామాల్లో రాజకీయం వేడెక్కుతోంది. అధికార, విపక్షాల పార్టీలకు చెందిన నాయకులు గ్రామాల బాట పట్టారు. ఈసారి మళ్ళీ తామే గెలుపొందాలనే పట్టుదలతో అధికార ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో సంక్షమే పథకాలతో సందడి చేస్తున్నారు. గ్రామాల్లో చిన్నచిన్న కార్యక్రమాలకు వెళ్లి ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
మహబూబ్ నగర్ నియోజకవర్గంలో:
బీఆరెస్‌కు చెందిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గత వారం నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వార్డుల్లో తిరుగు తున్నారు. సమయం దొరికినప్పుడల్లా టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడంతో తన ఉనికి కాపాడుకునేoదుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై విరుచుకు పడుతున్నారు.
పాలమూరులో మంత్రి చేసిన, చేస్తున్న అరాచకాలు బట్ట బయలు చేస్తున్నారు. ఇక్కడి డీసీసీ అధ్యక్షులు గౌని మధుసూదన్ రెడ్డి ప్రతి రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశాలు పెట్టి మంత్రి తీరును ఎండగడుతున్నారు. ఎన్నికల ఆఫిడవిట్ టాంపరింగ్ కేసులో మంత్రి పై కేసు నమోదు చేసినా ఇంత వరకు అరెస్ట్ చేయలేదని, వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పాలమూరులో పట్టు నిలుపు కునేందుకు కాంగ్రెస్, బీఆరెస్‌లు పోటీ పడుతున్నాయి.
జడ్చర్ల నియోజకవర్గంలో :
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆరెస్ నాయకులు పోటా పోటీగా ప్రచారం మొదలు పెట్టారు. బీఆరెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇప్పటికే ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డారు. నియోజకవర్గ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. ఈ సారి గెలిస్తే మంత్రి పదవి వస్తుందనే ధీమాలో ఉన్నారు.
గెలుపు సాధనకు ఇప్పటి నుంచే గ్రామాల్లోకి వెళుతున్నారు. ఎమ్మెల్యే కు ధీటుగా కాంగ్రెస్ నేత అనిరుద్ రెడ్డి గ్రామాల బాట పట్టారు. నెల రోజుల నుంచి ప్రజా సంహిత అనే కార్యక్రమంతో గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సారి కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటానని, ప్రజా సేవలో ఉండేందుకు ఈ సారి తనకే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.
దేవరకద్ర నియోజకవర్గంలో:
ఇక్కడి బీఆరెస్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటన చేపడుతున్నారు. గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. వ్యతిరేకత ఉన్న గ్రామాల్లో ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆయనకు ధీటుగా డీసీసీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసు కుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత నుంచి ఆయన ప్రజలతో మమేకమవుతున్నారు.ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఇక్కడ రాజకీయ వేడి రగులుకుంటోంది.
నారాయణపేట నియోజకవర్గంలో:
సిటింగ్ బీఆరెస్ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి ఎన్నికల తరువాత అతని వ్యాపారం ఉన్న రాయచూరుకే పరిమితం అయ్యారు. ఎప్పుడో సారి చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళుతుంటారు. గత నాలుగు రోజుల నుంచి నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న కుంభం శివకుమార్ రెడ్డి ఇదివరకే గ్రామాల పర్యటన ప్రారంభించారు. పలు మండల కేంద్రాలలో సభలు ఏర్పాటు చేసి ప్రచారం మొదలు పెట్టారు. నియోజకవర్గంపై నిర్లక్ష్యం వహిస్తున్న ఎమ్మెల్యే తీరును అడుగడుగునా విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరును ఎండగడుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
మక్తల్ నియోజకవర్గంలో:
ఇక్కడ ప్రచారం ఇంకా మొదలు పెట్టలేదు. బీఆరెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాత్రం కులవృత్తుల కోసం ప్రభుత్వం అందించిన లక్ష రూపాయల చెక్కుల పంపిణీలో బిజీ గా ఉన్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో:
అందరి దృష్టి అంతా ఈ నియోజకవర్గం పైనే ఉంది. ఇక్కడి బీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, బీఆరెస్ బహిష్కృత నేత, ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు జూపల్లి కృష్ణారావు మధ్య ప్రచార వార్ నడుస్తుంది. జూపల్లిని ఎలాగైనా ఓడించాలని ఎమ్మెల్యే గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకం అవుతున్నారు. అంతే ధీటుగా జూపల్లి ప్రచారం చేస్తున్నారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలను ఒకే తాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో :
ఇక్కడి కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇద్దరు ఉద్దండులు కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి ఒక్కటైతే తన రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరం అవుతుందనే ఉద్దెశంతో ఇక్కడి బీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి గ్రామాల బాట పట్టారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ, సంక్షేమ పథకాల పంపిణీతో ప్రజలను ఆకట్టు కునే పనిలో పడ్డారు.
గద్వాల నియోజకవర్గంలో :
నియోజకవర్గంలో ఆదిలోనే బీఆరెస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఇక్కడి జడ్పీ చైర్ పర్సన్ సరిత కాంగ్రెస్ పార్టీ లో చేరడం తో బీఆరెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అప్పుడే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించి ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. బీజేపీ నుంచి మాజీ మంత్రి డికే. అరుణ గట్టి పోటీ ఇవ్వనున్నారు.
అలంపూర్ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో :
బీఆరెస్ ఎమ్మెల్యే అబ్రహంకు సొంత పార్టీలో వ్యతిరేకం ఉన్నా తనకే టికెట్ వస్తుందనే ధీమాలో ప్రచారం మొదలు పెట్టారు. పార్టీ చేసిన అభివృద్ధి ని ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత సంపత్ కుమార్ నియోజకవర్గం లో పర్యటించి బీఆరెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.
వనపర్తి నియోజకవర్గంలో :
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జి. చిన్నారెడ్డి బలమైన నేతగా ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరోసారి గెలుపు సాధనకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు అందిoచేందుకు సమావేశాలు ఎర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాలే తన ప్రచార సాధనాలుగా ఉపయోగించుకుంటున్నారు.
అచ్చంపేట ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో :
ఇక్కడి బీఆరెస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు నోటి దురుసు ఎక్కువ. ఇదే ప్రధాన ప్రచార అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిక్కుడు వంశీ కృష్ణ ప్రజల్లో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యే ఆగడాలు ప్రజలకు వివరిస్తున్నారు.
కల్వకుర్తి నియోజకవర్గంలో :
బీఆరెస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు సొంత పార్టీ లో వ్యతిరేకం ఉంది. ఆయన ఒంటరిగా ప్రచారం చేస్తున్నా మరో వర్గం నేతలు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, బాలాజీ సింగ్ ఇతర నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడి కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి ఇంకా ప్రచారం ప్రారంభించలేదు.
కొడంగల్ నియోజకవర్గంలో :
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలమైన నేత, టీపీపీసీ అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి ఉండడంతో బీఆరెస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. బీఆరెస్ దృష్టిలో ఈ నియోజకవర్గం కత్తి మీద సామె అవుతుందనే ధోరణి ఉంది. రేవంత్ రెడ్డిని ఓడించేందుకు ఎన్ని అస్త్రాలు సిద్ధం చేస్తుందో వేచిచూడాలి.
షాద్ నగర్ నియోజకవర్గంలో :
ఈ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీర్లపల్లి శంకర్ ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఇక్కడి బీఆరెస్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. ఎమ్మెల్యే మాత్రం సంక్షేమ పథకాల పంపిణీలో బిజీ గా ఉన్నారు. సంక్షేమ పథకాలనే ఆయన ప్రచారంగా వాడుకుంటున్నారు.