BRS కు.. కాంగ్రెస్ ‘బీసీ రిజర్వేషన్ల’ పెంపు ప్రతిపాదన సెగ
BRS విధాత: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందనేది ప్రచారమే గాని ప్రధాన పోటీ బీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్యే అన్నది సామాన్యుడిని అడిగినా తడుముకోకుండా సమాధానం ఇస్తాడు. కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు, జూన్ రెండవ తేదీన రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా పోడు భూముల పట్టాల పంపిణీ, వృత్తి కులాల వారికీ లక్ష వరకు సహాయం చేయాలనే నిర్ణయాలు […]

BRS
విధాత: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందనేది ప్రచారమే గాని ప్రధాన పోటీ బీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్యే అన్నది సామాన్యుడిని అడిగినా తడుముకోకుండా సమాధానం ఇస్తాడు.
కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు, జూన్ రెండవ తేదీన రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా పోడు భూముల పట్టాల పంపిణీ, వృత్తి కులాల వారికీ లక్ష వరకు సహాయం చేయాలనే నిర్ణయాలు చూస్తే కులాల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్టు తెలుస్తోంది.
అయితే గత తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్ నేతృత్వంలో అన్నివర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, తమ పాలన పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అధికారపార్టీ ప్రచారం చేసుకుంటున్నది.
అయితే కేసీఆర్ ప్రభుత్వంలో ఒకటి రెండు కులాలకే కీలక శాఖలు అప్పగిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో దాదాపు 80 శాతం వరకు ఉన్న బడుగు బలహీన వర్గాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం గాని, కీలకమైన సెక్రటేరియట్ వంటి చోట్ల దూరం పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అంతెందుకు టీఎస్-ఐపాస్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎస్ ప్రదీప్ చంద్ర కనీస వీడ్కోలు గౌరవం కూడా దక్కలేదన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి.
కర్ణాటకలో సీఎం సీటు కోసం తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ బీసీ సామాజికవర్గ నేత అయిన సిద్ధరామయ్య, దళిత నేత అయిన మల్లిఖార్జున ఖర్గే వంటి నేతకు పార్టీ జాతీయ అధ్యక్ష పదవులు దక్కాయి. ఇది కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమౌతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కర్ణాటక ఇచ్చిన బూస్టింగ్‌తో తెలంగాణలో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం వచ్చింది.
కేసీఆర్ ప్రభుత్వంలో ఏ వర్గాలైతే అసంతృప్తితో ఉన్నాయో ఆయా వర్గాలకు భరోసా ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైంది. కర్ణాటక తరహాలోనే ఐదు హామీ ఇవ్వాలని వాటిని అమలు చేయాలని భావిస్తున్నది. నిరుద్యోగులు, రైతులు, మహిళలతో పాటు అధికారంలోకి వస్తే బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని టీపీసీసీ నిర్ణయం తీసుకున్నది.
ఈ అంశాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టాలని ఆలోచిస్తున్నది. దీన్ని జనంలోకి తీసుకెళ్లడానికి జూన్ 3 వ వారంలో బీసీ గర్జన సభ భారీ ఎత్తున నిర్ణయించాలనుకుంటున్నది. ఈ సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లను ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ తీర్మానించింది.
కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రధాని తాను బీసీని అని చెప్పుకున్నా.. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు. కనీసం కులాల వారీగా కులగణన చేపట్టాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు అనేక ప్రాంతీయ పార్టీల అధినేతలు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేస్తున్నా కేంద్రం పెడచెవిన పెడుతున్నది. కానీ దీనిపై స్పష్టమైన సమాధానం మాత్రం చెప్పడం లేదు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కదనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీలను ప్రసన్నం చేసుకోవడానికి అటు అధికారపార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడానికి సిద్ధ పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గనుక అధికారంలోకి వస్తే 40 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెడితే అది అధికారపార్టీకి నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఎందుకంటే గత తొమ్మిదేళ్ల కాలంలో ఈ వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అధికారపార్టీపై అసంతృప్తితో ఉన్నారు. వారిలో మెజారిటీ శాతం మార్పు కోరుకుంటే కేసీఆర్ ప్రభుత్వానికి కష్టకాలమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తున్న బీసీ రిజర్వేషన్ బీఆర్‌ఎస్ ఓట్లకు భారీగా గండి కొడుతుందని అంటున్నారు.