BRS | బీఆరెస్‌ను వెంటాడుతున్న‌ డ‌బుల్ ట్ర‌బుల్‌

  • By: Somu    latest    Apr 12, 2024 10:30 PM IST
BRS | బీఆరెస్‌ను వెంటాడుతున్న‌ డ‌బుల్ ట్ర‌బుల్‌

రూ. 22 వేల కోట్ల‌తో 5.72 ల‌క్ష‌ల ఇండ్లు క‌ట్టిస్తామ‌న్నారు
2023 ఎన్నిక‌ల నాటికి లాట‌రీ తీసింది 44 వేలే
లాట‌రీ తీసిన ఇండ్లు ల‌బ్దిదారుల‌కు ఇవ్వ‌లే…
నిరుప‌యోగంగా డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు
కేసీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ల‌బ్దిదారుల ఆందోళ‌న‌
ఫామ్ హౌస్‌కు వెళ్లీ మ‌రీ నిర‌స‌న తెలిపిన ల‌బ్దిదారులు

విధాత: మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డింద‌నే సామెత లెక్క త‌యారైంది బీఆరెస్ ప‌రిస్థితి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 39 సీట్ల‌కు ప‌రిమిత‌మై, కాళేశ్వ‌రం, ఫోన్ ట్యాపింగ్‌, ఢిల్లీ లిక్క‌ర్ స్కాం ఆరోప‌ణ‌ల్లో నిత్యం ప్ర‌జ‌ల నోట్లో నానుతున్న కేసీఆర్ అండ్ పార్టీకి పార్ల‌మెంటు ఎన్నిక‌ల ముందు ఊహించ‌ని రీతిలో డ‌బుల్ ట్ర‌బుల్ మొద‌లైంది. ప‌దేళ్ల అధికారంలో డ‌బుల్ బెడ్రూం ఇళ్ల గురించి గొప్ప‌లు చెప్పుకున్న కేసీఆర్ అండ్ పార్టీకి ఇప్పుడు లాట‌రీ తీసిన లబ్ధిదారుల రూపంలో నిర‌స‌న సెగ మొద‌లైంది. శుక్ర‌వారం కేసీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన డ‌బుల్ బెడ్రూం ల‌బ్ధిదారులు ఏకంగా పెద్ద‌సారు ఫాం హౌస్ ముందే ధ‌ర్నా చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

బీఆరెస్‌కు డ‌బుల్ ట్రబుల్‌!

పార్ల‌మెంటు ఎన్నిక‌ల ముందు బీఆరెస్‌కు డ‌బుల్ ట్ర‌బుల్ ఇవ్వ‌నున్న‌ది. ఇప్ప‌టికే పీక‌ల‌లోతు అవినీతి ఆరోప‌ణ‌ల‌లో కూరుకు పోయి ప్ర‌తిష్ట మ‌స‌క బారిన బీఆరెస్ కు డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప‌థ‌కం త‌ల‌నొప్పిగా మార‌నున్న‌ది. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ స్వంత నియోజ‌క‌వ‌ర్గంలో డ‌బుల్ బెడ్ రూమ్ ల‌బ్దిదారులు ఫామ్ హౌజ్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. కేసీఆర్ ప్ర‌భుత్వ హ‌యాంలో గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో ల‌క్కీ డ్రా ప‌ద్ద‌తిలో 11 వంద‌ల ఇండ్ల‌ను ల‌బ్దిదారుల‌కు కేటాయించారు. కానీ ఇంత వ‌ర‌కు ల‌బ్దిదారుల‌కు ఇండ్ల ప‌ట్టాలు, ఇండ్లు ఇవ్వ‌లేదు. దీంతో సీఎంగా ఉండి ఇండ్లు ఇవ్వ‌లేన‌ప్పుడు ల‌క్కీ డ్రా ఎందుకు తీశావ‌ని ల‌బ్దిదారులు ఎర్ర‌వ‌ల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్ ముందు శుక్ర‌వారం ఆందోళ‌న చేప‌ట్టారు.

మాజీ సీఎం కేసీఆర్ తాను రెండు ప‌ర్యాయాలు అధికారంలో ఉండి కూడా సొంత నియోజ‌క‌వ‌ర్గం గ‌జ్వెల్‌లోనే ల‌బ్దిదారుల‌కు డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వ‌లేని ప‌రిస్థితి వ‌చ్చిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. కేసీఆర్ తాను అధికారం కోల్పోయాక కూడాప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న‌లు ఎదుర్కొనే దుస్థితి ఏర్ప‌డింది. మూడుసార్లు గ‌జ్వెల్ ప్ర‌జ‌లు కేసీఆర్‌కు ప‌ట్టం క‌డితే క‌ట్టిన ఇండ్లు కూడా ల‌బ్దిదారుల‌కు ఇవ్వ‌లేని చేత‌గానిత‌నంపై నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

చెప్పింది కొండంత‌, పూర్తి చేసింది గోరంత‌

కేసీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడు 2016 మార్చి 5న ఎంతో అట్ట‌హాసంగా ప్రారంభించిన డ‌బుల్ బెడ్ రూమ్ ప‌థ‌కం 2023 నాటికి అబాసు పాలైంది. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన 5.72 ల‌క్ష‌ల మంది పేద కుటుంబాల‌కు డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ను రూ.22 వేల కోట్ల‌తో నిర్మించి 2018 మార్చి నాటికే పూర్తి చేసి ల‌బ్దిదారుల‌కు అందిస్తామ‌న్నారు. వీటిలో ఒక్క జీహెచ్ ఎంసీ ప‌రిధిలోనే 2ల‌క్ష‌ల ఇండ్లు నిర్మిస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ ఆచ‌ర‌ణ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.

కాగా.. 2018 నాటికి ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదు. అక్క‌డ‌క్క‌డ ఒక‌టి రెండు ప్రాంతాలు మిన‌హా ఎక్క‌డా ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డ‌టానికి ముందు 2023 సెప్టెంబ‌ర్ 2వ తేదీన మొద‌టి ద‌శ కింద 9 ప్రాంతాల్లో 11,700 ఇండ్ల‌కు లాట‌రీ తీసే ప‌థ‌కం ప్రారంభించారు. అలాగే రెండ‌వ విడ‌త 2023 సెప్టెంబ‌ర్ 21వ తేదీన 9 ప్రాంతాల్లో 13,300, మూడ‌వ విడ‌త 2023 అక్డోబ‌ర్ 2వ తేదీన మ‌రో 19,020 ఇండ్ల‌ను ప్రారంభించారు. మొత్తం క‌లిపి 44,020 డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ను మాత్ర‌మే నిర్మించారు.

నిర్మించిన ఇండ్లూ నిరుప‌యోగంగానే…!

నిర్మించిన వాటిని కూడా ల‌బ్దిదారుల‌కు అందివ్వ‌లేని స్థితిలో ఆనాడు బీఆరెస్ ప్ర‌భుత్వం ఉంది. ల‌బ్దిదారుల ఎంపిక‌పైన కూడా నాడు అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ల‌బ్దిదారుల ఎంపిక‌, ఇండ్ల కేటాయింపు వ్య‌వ‌హారంలో ఏదో గూడు పుఠాని ఉండ‌డంతోనే డ్రా తీసిన చోట్ల కూడా ల‌బ్దిదారుల‌కు ఇండ్లు అందించ‌లేద‌న్న విమ‌ర్శ‌ల‌ను బీఆరెస్ మూట క‌ట్టుకున్న‌ది. నిర్మించిన ఇండ్ల‌ను ల‌బ్దిదారుల‌కు అందించ‌క పోవ‌డంతో అవి నిరుప‌యోగంగా మారుతున్నాయి.

మ‌రో వైపు నిర్మించిన త‌రువాత కూడా త‌మ‌కు ఎందుకు డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వ‌లేద‌ని ల‌బ్దిదారులు నేరుగా ఎర్ర‌వ‌ల్లి ఫామ్ హౌజ్ ముందే ఆందోళ‌న‌కు దిగుతున్నారు. ముఖ్యంగా ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా ప‌రిధిలోని కొల్లూరులోనే అత్య‌ధికంగా డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు. కొల్లూరులో రెండు ద‌శ‌ల‌లో నిర్మించిన డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల టౌన్‌షిప్‌లు నిరుప‌యోగంగా మారాయి. కోట్ల రూపాయ‌లు ప్ర‌జాధ‌నం ఖర్చు చేసి నిర్మించిన ఇండ్లు ల‌బ్దిదారుల‌కు అందివ్వ‌క పోవ‌డం బీఆరెస్ పార్టీకి పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో శాపంగా మారనున్న‌ది.