Palakurti | పాలకుర్తి అసమ్మతిపై.. BRS అధిష్టానం దృష్టి
Palakurti | మంత్రి ఎర్రబెల్లి పై అసంతృప్తి నివారణ చర్యలు డాక్టర్ సుధాకర్ రావుకు స్టేట్ చైర్మన్ పదవి నష్టనివారణ చర్యల్లో గులాబీ ముఖ్య నేతలు వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా అడుగులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యంవహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలో ఇటీవల నెలకొన్న అసమ్మతి పై బీఆరెస్ అధిష్టానం దృష్టిపెట్టింది. ఇటీవల మంత్రి అమెరికా పర్యటన సందర్భంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి […]

Palakurti |
- మంత్రి ఎర్రబెల్లి పై అసంతృప్తి నివారణ చర్యలు
- డాక్టర్ సుధాకర్ రావుకు స్టేట్ చైర్మన్ పదవి
- నష్టనివారణ చర్యల్లో గులాబీ ముఖ్య నేతలు
- వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా అడుగులు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యంవహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలో ఇటీవల నెలకొన్న అసమ్మతి పై బీఆరెస్ అధిష్టానం దృష్టిపెట్టింది. ఇటీవల మంత్రి అమెరికా పర్యటన సందర్భంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలోని కొందరు ప్రధాన నాయకులు, సర్పంచ్ లు రహస్య సమావేశం నిర్వహించిన విషయం మంత్రికి పెద్ద షాకిచ్చింది.
మరోసారి పాలకుర్తి పీఠం దక్కించుకుంటాననే భరోసాతో ఉన్న మంత్రికి ఈ పరిణామం నిద్రలేకుండా చేసింది. అందుకే తన విజయానికి పార్టీనుంచి అడ్డంకిగా మారిన అసమ్మతికి చెక్ పెట్టే కార్యక్రమం చేపట్టింది. మంత్రి పై అసమ్మతి వర్గం చాపకింద నీరులా పావులు కదిపినట్లుగానే… తన పట్ల అసమ్మతి ఉందని బయటికి చెప్పకుండా మంత్రి సైతం అదేస్థాయిలో అధిష్టానం అండతో అడుగులు వేస్తున్నారు. సీఎం కేసీఆర్ అండతో అసమ్మతి నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ను వలలో వేసుకునే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తాజా పరిణామాలను పరిశీలిస్తే అర్ధమవుతోంది.
ఆపద కాలంలో డాక్టర్ సాబ్ కు చైర్మన్ గిరి
తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్టు చైర్మన్ గా పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమురుగొమ్ముల సుధాకర్ రావును సోమవారం నియమించారు. ఆకస్మికంగా చేపట్టిన ఈ నియామకంలో ఎర్రబెల్లి పాత్ర ఉందనేది బహిరంగ సత్యం. ఇంతకాలం సుధాకర్ రావు (డాక్టర్ సాబ్) మీద లేని శ్రద్ధ హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందనే చర్చ సాగుతోంది. ఇదంతా ఇటీవల జరిగిన అసమ్మతి సమావేశం ప్రభావమని చెబుతున్నారు.
ఎందుకంటే ఎర్రబెల్లికి ఈ దఫా చెక్ పెట్టాలని భావిస్తున్న వారిలో మిగతావారితో పాటు డాక్టర్ సాబ్ కూడా ఉన్నారని విస్తృతంగా ప్రచారం సాగింది. ఈ కారణంగా నియోజకవర్గంలో బలమైన నేతగా, మాజీ మంత్రి యతిరాజరావు కుమారుడిగా, సౌమ్యుడిగా పేరున్న డాక్టర్ సాబ్ ఎదురుతిరిగితే ఎర్రబెల్లి విజయం చాలా కష్టంగా మారుతోంది. అందువల్ల ముందుగా డాక్టర్ సాబ్ పై దృష్టి పెట్టినట్లు భావిస్తున్నారు.
ప్రేముంటే పదవి ఎప్పుడో వచ్చేది
నిజంగా డాక్టర్ సాబ్ మీద బీఆర్ఎస్ అధిష్టానానికి ప్రేమ ఉంటే రాష్ట్రంలో మంచి పేరున్న డాక్టర్ గా, అన్ని విధాలుగా అర్హుడైన సుధాకర్ రావుకు ఈ చైర్మన్ గిరి ఎప్పుడో దక్కేది. కానీ, ఇప్పుడు మరీ ఎన్నికల సమయంలో నియమించడం వెనుక మతలబుందంటున్నారు. డాక్టర్ సాబ్ ను మచ్చిక చేసుకుని వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడమనే ఎర్రబెల్లి పథకంలో భాగమంటున్నారు. పైగా ప్రత్యర్ధి పార్టీ కాంగ్రెస్ లోకి వెళతారనే భయంతో అసమ్మతినేతలను బుజ్జగించేందుకు తెరవెనుక ఛక్రం తిప్పుతున్నారు.
అందులో భాగంగా డాక్టర్ సాబ్ కు చైర్మన్ గిరి ఇప్పించడమంటున్నారు. ఎర్రబెల్లికి గానీ, బీఆర్ఎస్ అధిష్టానానికి చిత్తశుద్ది ఉంటే డాక్టర్ సాబ్ కు ఎప్పుడో ఈ నామినేటెడ్ పదవి ఇచ్చేవారంటున్నారు. ముందుగా ఇస్తే ఎర్రబెల్లికి నియోజకవర్గంలో మరో అధికార కేంద్రం ఏర్పడుతుందనే భయంతో ఇవ్వలేదని, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిల్లో ఇచ్చారంటున్నారు. అసమ్మతిని తగ్గించేందుకే ఈ నియామకమని చర్చసాగుతోంది.
కష్ట కాలంలో పాలకుర్తికి ఎర్రబెల్లి
పాలకుర్తి నియోజకవర్గానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కష్టకాలంలో వలసవచ్చి పోటీ చేశారు. గతంలో ఆయన వర్ధన్నపేట ఎమ్మెల్యేగా, వరంగల్ ఎంపీగా గెలుపొందారు. ఈ క్రమంలో 2009లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయి. సెగ్మెంట్ ఎస్సీ రిజర్వుడ్ గా మారిపోయింది. తన మీద కోపంతోనే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గం లేకుండా చేయాలని భావించారని ఎర్రబెల్లి ఆరోపణ. ఇది కూడా నిజమే అన్పిస్తోంది.
ఈ కారణంగా అప్పటి తమ టీడీపీ అధినేత చంద్రబాబు సహకారంతో ఎర్రబెల్లి వర్ధన్నపేటను వదిలిపెట్టి తన పక్క నియోజకవర్గమైన పాలకుర్తి పై దృష్టిపెట్టారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సాబ్ కు నచ్చచెప్పి 2009లో అక్కడి నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. 2014లోనూ టీడీపీ నుంచి గెలుపొందారు.
ఆ తర్వాత టీడీపీ శాసనసభా పక్ష నేతగా ఉంటూ బీఆరెస్ లో చేరిపోయారు. 2018లో బీఆరెస్ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచి కేసీఆర్ కేబినేట్లో మంత్రయ్యారు. మరోసారి ఈ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా సాగుతున్న క్రమంలో ఇటీవల సొంత పార్టీలో నెలకొన్న అసమ్మతితో మంత్రి ఎర్రబెల్లి ఏకపక్ష పరుగుకు సడన్ బ్రేకు పడింది.
అసమ్మతి పైన అధిష్టానం కేంద్రీకరణ
రాబోయే ఎన్నికలు బీఆరెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రతీ నియోజకవర్గం అత్యంత ముఖ్యమైనదిగా మారిపోయింది. అందులో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాలకు తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. అందువల్ల ఆశాభావ నియోజకవర్గంలో అసమ్మతి తలెత్తితే అధిష్టానం వణికిపోతోంది.
పాలకుర్తిలో జరుగుతున్న తాజా పరిణమాలు దీనికి సూచికగా పేర్కొంటున్నారు. అసమ్మతి గళమెత్తితే ఓటమిఖాయమని భావించి డాక్టర్ సుధాకర్ రావుకు నామినేటెడెడ్ పదవి ఇచ్చినట్లు భావిస్తున్నారు. ఈ సెగ్మెంట్ లో మిగిలిన అసమ్మతి నాయకులను తమదైన పద్ధతిలో బుజ్జగింపులు చేపట్టినట్లు తెలుస్తోంది.