పార్టీ మారడం పక్కా..బీజేపీ నుంచే ఎంపీగా పోటీ
బీఆరెస్ మాజీ ఎంపీ సీతారాంనాయక్ బీజేపీలో చేరడం ఖాయమని తేలిపోయింది. ఆయన బీఆరెస్‌కు రాజీనామా చేసి మహబూబాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. త

విధాత: బీఆరెస్ మాజీ ఎంపీ సీతారాంనాయక్ బీజేపీలో చేరడం ఖాయమని తేలిపోయింది. ఆయన బీఆరెస్‌కు రాజీనామా చేసి మహబూబాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. తన పార్టీ మార్పుపై శనివారం మీడియాతో మాట్లాడిన సీతారాంనాయక్ బీఆరెస్‌లో తనకు గుర్తింపు దక్కలేదని, ఎన్నో అవమానాలు ఎదుర్కోన్నానని వాపోయారు.
రాజకీయంగా ముందుకెళ్లకుండా తొక్కిపెట్టారని ఆరోపించారు. నన్ను గుర్తించే జాతీయ పార్టీలో చేరుతానని, ఈ మేరకు నేను నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్వయంగా సీతారాంనాయక్ ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. 2014లో బీఆరెస్ నుంచి మహబూబాబాద్ ఎంపీగా గెలిచిన సీతారాంనాయక్‌కు 2019లో పార్టీ టికెట్ నిరాకరించడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు సీటు కోరినా ఇవ్వలేదు.
తాజాగా మహబూబాబాద్ టికెట్‌ను మరోసారి కేసీఆర్ మాలోతు కవితకే కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన సీతారాంనాయక్ కమల దళంలో చేరాలని నిర్ణయించుకున్నారు. అటు ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కూడా బీజేపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తుంది. ఖమ్మం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆయనను బరిలోకి దించాలని కమలనాథులు భావిస్తున్నారు.