మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన.. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని పట్టు
శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని ఆందోళన చేపట్టారు

- పోడియంలోకి దూసుకు వెళ్లిన బీఆరెస్ ఎమ్మెల్సీలు
- శాసన మండలిలో గందరగోళం
- బీఆరెస్ నేతల చిట్టా మా వద్ద ఉందన్న మంత్రి జూపల్లి
- కేసీఆర్‌కు పెగ్గులు పోసే వ్యక్తికి రాజ్యసభ ఇచ్చారని వ్యాఖ్య
- బీఆరెస్‌కు ప్రొటెస్ట్ చేసే హక్కు లేదన్న జూపల్లి
విధాత: శాసన మండలి సమావేశాలు మొదలు కాగానే బీఆరెస్ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. శాసన మండలి ఇరాన్ కేఫ్‌లాగా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి గతంలో సభ బయట ఎక్కడో చేసిన వ్యాఖ్యలపై బీఆరెస్ ఎమ్మెల్సీలు శుక్రవారం మండలిలో ఆందోళన చేపట్టారు. మండలి చైర్మన్ పోడియం వద్దకు బీఆరెస్ ఎమ్మెల్సీలు దూసుకెళ్లారు. మంత్రులు జూపల్లి కృష్ణరావు, తుమ్మల నాగేశ్వరరావులు సమాధానం చెప్పినా బీఆరెస్ ఎమ్మెల్సీలు సభలో అందోళన చేశారు. సభ ఆర్డర్లో లేక పోవడంతో పలు సార్లు వాయిదా వేశారు. సభకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభను చైర్మన్ వాయిదా వేస్తే సభ బయట బీఆరెస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు.
శాసన మండలి లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలిపే సందర్భంగా బీఆరెస్ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు దైసుకు వెళ్లి ఆందోళన చేపట్టగా జోక్యం చేసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కేసీఆర్ కు పెగ్గులు పోసే వ్యక్తికి రాజ్యసభ ఇచ్చాడన్నారు. సంతోష్ కు ఎలా ఎంపి టికెట్ ఇచ్చారని అడిగారు. ఏ ఫామ్ లో రావాలో ఆ ఫామ్ లో రావాలని సూచించారు. సభను అడ్డుకోవడం సరికాదు.. సభ్యత కాదని అన్నారు. కమిటీలు ఎంది అని మాట్లాడితే ఎట్లా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారని, ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి బయట మాట్లాడారు. ఆ లెక్కకు వస్తే బీఆర్ఎస్ కు ప్రొటెస్ట్ చెసే నైతిక అర్హత లేదన్నారు. మాజీ సీఎం తనకు పెగ్గులు పోసే వ్యక్తికి రాజ్యసభ మెంబర్ ఇచ్చి విలువలను మంట కల్పి, సభ మర్యాదలు పోగోట్టాడన్నారు. మీరు కాదా విలువలను మంట కలిపింది అని ఆందోళన చేస్తున్న బీఆరెస్ ఎమ్మెల్సీలను ప్రశ్నించారు. ఎంత చెప్పినా బీఆరెస్ సభ్యులు వినిపించుకోక పోవడంతో సీరియస్ అయిన మంత్రి జూపల్లి బీఆరెస్ నేతల చిట్టా తమ వద్ద ఉందని, ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో మాకు తెలుసు, వాటన్నింటిని బయటకు తీస్తామన్నారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకుంటూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలపకుండ అడ్డుకోవడం మంచిది కాదని బీఆరెస్ ఎమ్మెల్సీలకు హితవు పలికారు. సభ గౌరవం పాటించక పోవడం సబబు కాదన్నారు.
సభలోనే బస చేసేందుకు బీఆరెస్ ఎమ్మెల్సీలు యోచన
అయితే సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలికి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న బీఆరెస్ ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డి సభకు వచ్చి క్షమాపణ చెప్పక పోతే ఈ రాత్రికి శాసన మండలిలోనే ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.