బాల్క సుమన్‌కు టికెట్‌ ఇస్తారనే?

పెద్దపల్లి నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేయడానికి ఎంపీ వెంకటేశ్‌ నేత సిద్ధపడుతున్నారని సమాచారం

బాల్క సుమన్‌కు టికెట్‌ ఇస్తారనే?

పెద్దపల్లి నుంచి మళ్లీ పోటీకి వెంకటేశ్‌ 

కానీ.. బీఆరెస్‌లో టికెట్‌పై అపనమ్మకం

వెంకటేశ్‌తో టచ్‌లో ఎమ్మెల్యే వివేక్‌

విధాత : పెద్దపల్లి నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేయడానికి ఎంపీ వెంకటేశ్‌ నేత సిద్ధపడుతున్నారని సమాచారం. అందుకే కాంగ్రెస్‌లో చేరారని ప్రచారం జరుగుతున్నది. 2018లో ఆయన చెన్నూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి బాల్క సుమన్‌ చేతిలో ఓడిపోయారు. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాల్క సుమన్‌ ‘కాంగ్రెస్‌ వాళ్లను ఏమీ అనవద్దు. వాళ్లు మనోళ్లే. మనమే కొంతమందిని ఆ పార్టీలోకి పంపించాం’ అని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాజాగా సోమవారం లోక్‌సభ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ మంచిర్యాల నియోజకవర్గస్థాయి సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డిపై బాల్క సుమన్‌ చేసిన వివాదాస్ప వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ సమావేశంలో ఎంపీ వెంకటేశ్‌ లేరు. ఈసారి సిట్టింగ్‌ ఎంపీలలో కొంతమందిని మారుస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఈసారి పెద్దపల్లి టికెట్‌ తనకు దక్కపోవచ్చనే సమాచారం ఎంపీకి ఉండి ఉంటుందని అంటున్నారు. 2014లో వివేక్‌ వెంకటస్వామి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత విద్యార్థి నేతగా ఉన్న సుమన్‌ను కేసీఆర్‌ బరిలోకి దింపారు. అప్పుడు ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత ఆయన చెన్నూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. ఆ సందర్భంగా కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాదని పార్టీ సుమన్‌కు టికెట్‌ కేటాయించింది. దీనిపై అప్పుడు ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఆ సందర్భంగా ఓదెలుకు మద్దతుగా ఒకరు ఆత్మాహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి ఓదెలు, సుమన్‌ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే మండే పరిస్థితులే ఉన్నాయి. అయితే పార్టీ అధిష్ఠానం ఇద్దరికీ సర్దిచెప్పి పార్టీలోనే కొనసాగేలా చూసింది. కానీ మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈసారి పెద్దపల్లి నుంచి సుమన్‌ టికెట్‌ ఆశిస్తుండటంతో తనకు టికెట్‌ వచ్చే అవకాశాలు ఉండవనే ఆలోచనతో వెంకటేశ్‌ పార్టీ మారినట్టు అంచనా వేస్తున్నారు. వెంకటేశ్‌కు కాంగ్రెస్‌ నేతలతో సత్ససంబంధాలే ఉన్నాయి. పెద్దపల్లిమాజీ ఎంపీ, ప్రస్తుత చెన్నూర్‌ ఎమ్మెల్యే వివేక్‌తో ఆయన టచ్‌లోనే ఉన్నారు. సుమన్‌కు చెక్‌ పెట్టాలని వివేక్‌ ఎప్పటి నుంచో చూస్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆ వ్యూహాన్ని పక్కాగా అమలు చేశారు. పెద్దపల్లి ఎంపీగా సుమన్‌ పోటీ చేస్తే మళ్లీ ఆయన ఓడించడానికే వెంకటేశ్‌ నేతను వివేక్‌ పార్టీలోకి తీసుకొచ్చినట్టు సమాచారం.