ఏనుమాముల మార్కెట్ చైర్మన్ చుట్టూ గు’లాబీ’ ఎత్తులు! ఎమ్మెల్యేలు ఆరూరి VS నన్నపనేని
ఆరూరి, నన్నపనేని మధ్య తీవ్రపోటీ చైర్మన్ గిరి దక్కించుకునే యత్నం పాలకవర్గం ఎక్స్‌టెన్షన్ మర్మమేమిటి? కేవలం 18 రోజులకే పొడగింపు ఐదున్నర నెలల తర్వాత జీవో జారీ మూడుసార్లు ఎమ్మెల్యే ఆరూరి విఫలం దిడ్డి కుటుంబం పై నన్నపనేని అభిమానం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆసియా ఖండంలో రెండో అతి పెద్దదైన వరంగల్ ఏను'మాముల్లా' మార్కెట్ చుట్టూ గు'లాబీ' ఎమ్మెల్యేల ఎత్తులు పై ఎత్తులతో అంతర్గతంగా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలోని ఈ […]

- ఆరూరి, నన్నపనేని మధ్య తీవ్రపోటీ
- చైర్మన్ గిరి దక్కించుకునే యత్నం
- పాలకవర్గం ఎక్స్‌టెన్షన్ మర్మమేమిటి?
- కేవలం 18 రోజులకే పొడగింపు
- ఐదున్నర నెలల తర్వాత జీవో జారీ
- మూడుసార్లు ఎమ్మెల్యే ఆరూరి విఫలం
- దిడ్డి కుటుంబం పై నన్నపనేని అభిమానం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆసియా ఖండంలో రెండో అతి పెద్దదైన వరంగల్ ఏను’మాముల్లా’ మార్కెట్ చుట్టూ గు’లాబీ’ ఎమ్మెల్యేల ఎత్తులు పై ఎత్తులతో అంతర్గతంగా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలోని ఈ మార్కెట్ చైర్మన్ రేసులో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేష్ మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ సాగుతోంది.
ఈ పోటీలో పరకాల ఎమ్మెల్యే రెండు సార్లు, తూర్పు ఎమ్మెల్యే ఒకసారి చైర్మన్ గిరి దక్కించుకోవడంలో సక్సెస్ కాగా ముచ్చటగా మూడవ పర్యాయం కూడా ఆరూరి ఖాతాలో మార్కెట్ చైర్మన్ గిరి పడుతుందో? లేదో? గ్యారంటీ లేకుండా పోయింది. తాజా పరిణామాలు ఈ అనుమానానికి తావిస్తున్నాయి.
వర్ధన్నపేట పరిధిలో మార్కెట్
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని మార్కెట్ అయినప్పటికీ పాలకవర్గ నియామకంలో ఎందుకో తొలినుంచి స్థానిక ఎమ్మెల్యే రమేష్ పలుకుబడి పప్పులు ఉడకడం లేదు. గత ఎనిమిదేళ్ల కాలంలో ఏనుమాముల మార్కెట్ చైర్మన్ పదవి విషయంలో వర్ధన్నపేట నియోజకవర్గ వ్యక్తులకు అవకాశం లభించడం లేదు.
స్వరాష్ట్రంలో వర్ధన్నపేటకు రిక్త హస్తం
తెలుగుదేశం హయాంలో తప్ప స్వరాష్ట్రంలో వర్ధన్నపేట నియోజకవర్గానికి ఛాన్స్ కల్పించడం లేదు. ఒకప్పుడు అప్రతిహతంగా వర్ధన్నపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన తక్కల్లపల్లి నారాయణరావు దీర్ఘకాలం మార్కెట్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. అప్పటినుంచి వర్ధన్నపేటకు మరోసారి అవకాశం దొరకడం లేదు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మార్కెట్ పరిధిలోని మూడు నియోజకవర్గాలకు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పరకాల ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఆరూరి రమేష్ రెండు పర్యాయాలు, వరంగల్ తూర్పు నుంచి మొదట కొండా సురేఖ, ప్రస్తుతం నన్నపునేని నరేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
అయినప్పటికీ గత మూడు పర్యాయాలలో రెండు పర్యాయాలు పరకాలకు, ఒక పర్యాయం వరంగల్ తూర్పుకు చైర్మన్ గిరి దక్కింది. రెండవసారి రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న గులాబీ పార్టీ కాలపరిమితి కూడా సమీపిస్తున్నందున ఈ దఫాలోనైనా వర్ధన్నపేటకు అందులో ఎస్సీ మహిళకు చైర్మన్ దక్కుతుందని భావించినా ఆశాభంగమే మిగిలింది.
దిడ్డి పదవీకాలం పొడగింపు మతలబేంటీ?
కాల పరిమితి ముగిసిన దిడ్డి భాగ్యలక్ష్మి పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ జీవో జారీ చేయడం పెద్ద ట్విస్ట్ గా మారింది. గత ఐదు నెలల క్రితమే భాగ్యలక్ష్మి పదవీకాలం ముగిసింది. ఆమె కూడా రెండవ దఫా అవకాశం కోసం తమ ప్రయత్నాలను ఇటీవల ముమ్మరం చేశారు.
తమ గాడ్‌ఫాదర్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సహకారంతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భాగ్యలక్ష్మి పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ కావడం గులాబీ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ విషయంలో ఎమ్మెల్యే ఆరూరికి బీఆర్ఎస్ అధిష్టానం గట్టి షాకిచ్చింది.
భాగ్యలక్ష్మి చైర్‌పర్సన్‌గా ఉన్న కమిటీ పదవీకాలం గత ఆగస్టు 19వ తేదీన ముగిసింది. ఆ తర్వాత చైర్మన్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వు చేస్తూ జీవో విడుదలైంది. కానీ.. అప్పటి నుంచి కొత్త పాలక వర్గాన్ని నియమించకుండా, పాత పాలకవర్గాన్ని రెన్యూవల్ చేయకుండా ఉండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఓ వైపు రెన్యూవల్ కోసం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పట్టుబట్టగా, ఎస్సీ మహిళకు రిజర్వు అయిన పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని ఎమ్మెల్యే అరూరి ప్రయత్నం చేసినట్లు తెలిసింది.
ఈ సమయంలో ఈ ఉత్కంఠకు తెరదించుతూ జనవరి 31వ తేదీన పాత పాలకవర్గం పదవీకాలం ముగిసినప్పటి నుంచి అంటే 19-08-2022 నుంచి ఆరు నెలలపాటు రెన్యూవల్ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కేవలం ఆరు నెలల పదవీకాలంలో మిగిలింది కేవలం 18 రోజులే కావడం గమనార్హం.
ఈ రెన్యూవల్ పాలకవర్గం పదవీ కాలం కూడా ఫిబ్రవరి 18, 2023తో ముగుస్తుంది. అంటే మిగిలిన 18 రోజుల కోసమే రెన్యూవల్ చేయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటన్న దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆదివారం నాటికి ఇంకా కేవలం 12 రోజుల కాలపరిమితి మాత్రమే ఉంది. అయితే.. ఆ తర్వాత కూడా మరో ఆరు నెలలపాటు రెన్యూవల్ చేసుకోవడానికే ఇలా చేసినట్లు భావిస్తున్నారు. మరో రెండు వారాలకు ఏ విషయం తేలనున్నది.
ప్రతీసారీ ఆరూరి వైఫల్యం
కారణాలు ఏమైనా ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు అధిష్టానం వద్ద పట్టు లేదనే చర్చ సాగుతోంది. గత మూడు పర్యాయాలు తన నియోజకవర్గానికి చైర్మన్ పదవి సాధించలేని ఎమ్మెల్యే మరోసారి ఫెయిల్ అయ్యారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి నుంచి ఎమ్మెల్యే అరూరి రమేష్ కు షాక్ తగులుతోంది.
తన నియోజకవర్గ పరిధిలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పదవిని దక్కించు కోవడంలో విఫలం చెందుతున్నారు. ఈసారైనా వర్ధన్నపేటకు పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. చివరకు మళ్లీ నిరాశే ఎదురవడంతో నియోజకవర్గ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే అరూరి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన సహచర పరకాల తూర్పు ఎమ్మెల్యేలతో ఆరూరి ఏమైనా రాజీ పడుతున్నారా? అధిష్టానం వద్ద చేస్తున్న తన ప్రయత్నాలు ఫలించడం లేదా? అనే చర్చ సాగుతుంది. వారిని ప్రసన్నం చేసుకోవడంలో వైఫల్యముందంటున్నారు.
పైగా తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తొలిసారి ఎమ్మెల్యే కాగా ఆరూరి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నా మార్కెట్ చైర్మన్‌ను తన నియోజకవర్గానికి దక్కించుకోవడంలో విఫలమవుతున్నారు. చైర్మన్ విషయంలో ఏదో మతలబు ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
దిడ్డి కుటుంబం పై నన్నపనేని అభిమానం
దిడ్డి కుటుంబంపై తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వల్ల మాలిన అభిమానం కనపరుస్తున్నారని చర్చ సాగుతోంది. గతంలో తాను మేయర్ గా పనిచేస్తున్న కాలంలో కాలపరిమితి ముగియక ముందే తన పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించింది.
ఈ సమయంలో తన స్థానంలో కార్పొరేటర్ గా తనకు సన్నిహితుడైన దిడ్డి నరేందర్ కుమారుడికి కార్పొరేటర్ గా అవకాశం కల్పించి ఆయన ఏకగ్రీవంగా గెలిచేందుకు సర్వశక్తులొడ్డారు. తదుపరి వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దిడ్డి కుటుంబంలోని మరో వ్యక్తి కుమారస్వామికి టికెట్ ఇచ్చి గెలిపించారు.
అంతకుముందు కుమారస్వామిని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా గెలిపించేందుకు తెర వెనుక ముమ్మరంగా ప్రయత్నించారు. ఆ తరువాత దిడ్డి కుమారస్వామి భార్య భాగ్యలక్ష్మికి ఏనుమాముల మార్కెట్ చైర్మన్ ఇప్పించడంలో కూడా సక్సెస్ అయ్యా రు.
తాజాగా ఆమె పదవి కాలం ముగిసినప్పటికీ తిరిగి ఆరు నెలలు పొడిగించడంలో కూడా ఎమ్మెల్యే నరేందర్ పాత్ర ప్రధానమైంది. పొడిగింపుకే పరిమితం కాకుండా మరో టర్మ్ అవకాశం దక్కే విధంగా ప్రయత్నిస్తున్నట్లు గులాబీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమంలో ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో అనేకమంది నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ దిడ్డి కుటుంబంపై నరేందర్ ప్రత్యేక ప్రేమను కనపరచడం నియోజకవర్గంలో ఒక చర్చనీయాంశం. అన్నింట వారికి అవకాశం కల్పిస్తున్నట్లు పదవులు దక్కని మిగిలిన నాయకులు పరోక్షంగా విమర్శిస్తున్నారు.