గులాబీ చైర్ పర్సన్లపై అసమ్మతి కత్తి !
ఆయుధాలు నూరుతున్న అసమ్మతి వర్గాలు ఆందోళనలో మునిసిపల్ చైర్ పర్సన్లు అధిష్ఠానం దృష్టికి అవిశ్వాస సమస్య అవకాశం లేదని తేల్చిన మంత్రి కేటీఆర్ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులకు ఆదేశం కలవరపరుస్తున్న జనగామ ఎపిసోడ్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మునిసిపాలిటీ చైర్మన్ ల పైన అవిశ్వాస కత్తి వేలాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చైర్మన్ లు, చైర్ పర్సన్ల పదవీకాలం మూడేళ్లు ముగిసిన నేపథ్యంలో అసమ్మతి వాదులు ఆయుధాలు నూరుతున్నారు. జనగామలో ప్రారంభమైన అసమ్మతి శిబిరం […]

- ఆయుధాలు నూరుతున్న అసమ్మతి వర్గాలు
- ఆందోళనలో మునిసిపల్ చైర్ పర్సన్లు
- అధిష్ఠానం దృష్టికి అవిశ్వాస సమస్య
- అవకాశం లేదని తేల్చిన మంత్రి కేటీఆర్
- అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులకు ఆదేశం
- కలవరపరుస్తున్న జనగామ ఎపిసోడ్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మునిసిపాలిటీ చైర్మన్ ల పైన అవిశ్వాస కత్తి వేలాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చైర్మన్ లు, చైర్ పర్సన్ల పదవీకాలం మూడేళ్లు ముగిసిన నేపథ్యంలో అసమ్మతి వాదులు ఆయుధాలు నూరుతున్నారు. జనగామలో ప్రారంభమైన అసమ్మతి శిబిరం తాజాగా వికారాబాద్ కు చేరింది.
జనగామ, వికారాబాద్‌లలో అవిశ్వాస తీర్మాన రాజకీయం వేడెక్కింది. పరిష్కారం ఎలా ఉన్నా అధిష్ఠానాన్నిఈ పరిణామాలు కలవరపరుస్తున్నాయి. రాష్ట్రంలో మెజారిటీ మున్సిపాలిటీలలో గులాబీ పార్టీ అధికారంలో ఉంది. గతంలో చైర్ పర్సన్ పదవి ఆశించి భంగపడిన వారు, ప్రస్తుత చైర్ పర్సన్ తీరుపట్ల అసంతృప్తితో ఉన్నవారు తమదైన పద్ధతుల్లో గ్రూపు, క్యాంపు రాజకీయాలకు తెరతీసే అవకాశాలు ఉండటంతో గులాబీ పార్టీ నేతల్లో గుబులు పెరుగుతోంది. ఒక్కసారి అసమ్మతికి అవకాశం ఇస్తే కార్చిచ్చులా రాష్ట్ర మొత్తం రగులుకుంటుందని అధిష్ఠానం ఆందోళన చెందుతున్నది.
ఇప్పటికే జగిత్యాల మున్సిపాలిటీ చైర్ పర్సన్ బోగ శ్రావణి రాజీనామా చేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ సంఘటన ఇంకా మరవకముందే జనగామ మున్సిపాలిటీలో అసమ్మతి కార్పొరేటర్లు క్యాంపు నిర్వహించడం కలకలం రేపింది. దీంతో గులాబీ పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది.
జగిత్యాలలో చైర్ పర్సన్ రాజీనామా
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ తనపై సాగిస్తున్న ఆధిపత్యం, అణిచివేత, బెదిరింపులకు తట్టుకోలేక.. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాజీనామా చేస్తున్నట్లు మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ విషయం గులాబీ పార్టీ అధిష్టానాన్ని కొంత కలవరపరిచింది.
మీడియా సమావేశంలో చైర్ పర్సన్ కన్నీరు మున్నీరు కావడం పట్ల సానుభూతి వ్యక్తం అయింది. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ల పట్ల వరంగల్ లో చేయి కాల్చుకున్నారు. తాజాగా కామారెడ్డి, జగిత్యాల పట్టణాలలో రైతులు తిరుగుబాటు జెండాలు ఎగిరేసిన నేపథ్యం ఉంది. ఈ సమయంలో శ్రావణి రాజీనామా కలకలం సృష్టించింది.
అవిశ్వాస తేనె తుట్టె రగిలితే నష్టం
రాష్ట్రరాజకీయం వేడెక్కినందున మునిసిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలకు అవకాశం కల్పిస్తే కొత్త చిచ్చు రగిలే అవకాశాలు ఉన్నట్లు గులాబీ పార్టీ అధిష్టానం అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఈ కారణంగా అసమ్మతి వర్గం తిరుగుబాటు చేయకముందే దిద్దుబాటు చర్యలకు సమాయత్తమైంది.
జనగామలో అసమ్మతి క్యాంపు
జనగామలో అసమ్మతి కార్పొరేటర్లు క్యాంపు రాజకీయాలు ప్రారంభించడం సంచలనం రేపింది. జనగామ మున్సిపాలిటీలో సొంత పార్టీ కౌన్సిలర్లు చైర్మన్ పోకల జమునపై అసంతృప్తితో ఉన్నారు. చైర్ పర్సన్ పోకల జమునను, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్‌ను, అదేవిధంగా ఫ్లోర్ లీడర్ పాండును మార్చాలి అంటూ కౌన్సిలర్ బండ పద్మ ఆధ్వర్యంలో అసమ్మతి కౌన్సిలర్లు క్యాంపు రాజకీయం ప్రారంభించారు.
తాజాగా అసమ్మతివాదులతో అధిష్టానం ప్రతినిధులతో, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చర్చించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను అధిష్టానం ముందు పెట్టినట్లు తెలిసింది. చైర్ పర్సన్‌పై అవిశ్వాసం కుదరకపోతే కనీసం వైస్ చైర్మన్‌ను, ఫ్లోర్ లీడర్లను అయినా తప్పించాలని, లేని పక్షంలో తాము రాజీ పడలేమని అసమ్మతి కౌన్సిలర్లు తేల్చి చెప్పినట్లు సమాచారం.
అవిశ్వాస చట్టబద్ధతకు సాంకేతిక సమస్య
పాత పాలకవర్గాలపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడానికి చట్టంలో సాంకేతిక సమస్యలు నెలకొన్నట్లు చెబుతున్నారు. అవిశ్వాసానికి గతంలో మూడేళ్ల కాలపరిమితి ఉండగా, ఈ కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచుతూ చేసిన చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లు గవర్నర్ ఆమోదం కోసం వెళ్ళినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంలో అవిశ్వాసం చెల్లుబాటు అవుతుందా లేదా అనేది చర్చగా మారింది.
అధిష్టానాన్నీ… ఎమ్మెల్యేను కాదనీ
ఇదిలా ఉండగా అధిష్టానాన్ని వ్యతిరేకించి, స్థానిక ఎమ్మెల్యేలను కాదని అసమ్మతివాదులు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడతారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎక్కడో ఒకచోట రాజీకి వచ్చి తమ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకే ఎక్కువ అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
అధికార పార్టీదే హవా
నిర్మాణ పరంగా పటిష్టత సంగతి ఎలా ఉన్నా… మెజారిటీ ఎమ్మెల్యేలు అధికార గులాబీ పార్టీకి చెందిన వారే కావడం తో ప్రారంభంలోనే ఈ అసంతృప్తి సెగలను అణచివేసి అవిశ్వాసానికి తావు ఇవ్వకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పట్టుదలతో ఉంది. ముఖ్యమంత్రి కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలో ఏ మునిసిపాలిటీలోనైనా అవిశ్వాసానికి అవకాశం కల్పిస్తే ఈ పరిణామం రాష్ట్రమంతా ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు. పైగా తాను బాధ్యతలు నిర్వహిస్తున్న శాఖ కావడంతో మరింత దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. ఒక్కసారి పట్టు సడలిస్తే పార్టీ ఆధిపత్యం కోల్పోయి… అసంతృప్తి వాదులు… అసమ్మతి వాదులు రెచ్చిపోయే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఎమ్మెల్యేల పై అసంతృప్తి
పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పై కూడా కొంత అసంతృప్తి ఉన్న నేపథ్యంలో చినికిచినికి గాలి వానగా మారి రానున్న ఎన్నికలపై ప్రభావం చూపుతందనే ఆందోళన పార్టీ పెద్దలను వేధిస్తున్నది. కొందరు ఎమ్మెల్యేలు తమకు గిట్టని చైర్‌పర్సన్‌ను తొలగించేందుకు తెరవెనక ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నందున అధిష్టానం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే అసంతృప్తి ప్రారంభమైన జనగామలో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అసంతృప్తి కౌన్సిలర్ల పై ఒత్తిడి చేస్తున్నారు.
అసంతృప్తికి అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూడా తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అవిశ్వాసాల పట్ల అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు ఇప్పటికే ఎమ్మెల్యే అసంతృప్తి కౌన్సిలర్లకు సంకేతాలు ఇచ్చారు. కాకుంటే అవకాశం ఉన్నచోట అభివృద్ధి పనులు, బేర సారాలు జరిగి ఇతరత్రా అవకాశాలు కల్పించి చల్లపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు గులాబీ వర్గాల్లో చర్చ సాగుతోంది. నయానభయాన మెప్పించే యత్నం ప్రారంభమైంది.
ఒకటి రెండు రోజుల్లో తెర
జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య దంపతులు, తిరుగుబాటు కౌన్సిలర్ బండ పద్మ, యాదగిరి రెడ్డి దంపతులు హైదరాబాద్‌లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని వేరువేరుగా కలిసి తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకు వెళ్లినట్లు కూడా తెలిసింది.
ఎమ్మెల్యేతో తిరుగుబాటు కౌన్సిలర్లు చైర్ పర్సన్ తీరు మార్చి తమకు గుర్తింపు ఇచ్చే విధంగా వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ఈ సందర్భంగా బేరసారాల వ్యవహారం చర్చకు వచ్చినట్లు సమాచారం. దీంతో కౌన్సిలర్లు శాంతిస్తారా? ఏదైన అనూహ్య పరిణామం జరుగుతుందా? జనగామ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
అసమ్మతిపై మంత్రి కేటీఆర్ సీరియస్
అవిశ్వాసం బెంగ ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీల చైర్మన్లు కేటీఆర్‌ను కలిసి తమ మున్సిపాలిటీల్లో జరుగుతున్న పరిణామాలను వివరించారు. దీనికి ప్రతిస్పందనగా మంత్రి కేటీఆర్ ఎక్కడైతే అవిశ్వాస సెగలు రగులుతున్నాయో? వారితో మాట్లాడాలని సంబంధిత ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులు, సమన్వయ కర్తలను ఆదేశించినట్లు తెలిసింది. జనగామతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రసక్తిలేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.