BRS ఆవిర్భావ సభ అక్కడే ఎందుకంటే?

విధాత: ఖమ్మం జిల్లాలో BRS ఆవిర్భావ సభ నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నెల 18న జరగనున్న సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌, కేరళ సీఎం విజయన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌లకు ఆహ్వానం పంపారు. 18న ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం ఖమ్మం కలెక్టరేట్‌ సమీపంలోని 100 ఎకరాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాటు చేయాలని సీఎం […]

  • By: krs    latest    Jan 09, 2023 8:49 AM IST
BRS ఆవిర్భావ సభ అక్కడే ఎందుకంటే?

విధాత: ఖమ్మం జిల్లాలో BRS ఆవిర్భావ సభ నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నెల 18న జరగనున్న సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌, కేరళ సీఎం విజయన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌లకు ఆహ్వానం పంపారు. 18న ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం ఖమ్మం కలెక్టరేట్‌ సమీపంలోని 100 ఎకరాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాటు చేయాలని సీఎం అదేశించారు.

అక్కడే ఎందుకంటే?

ఏపీలో బీఆర్‌ఎస్‌ విస్తరణ పనులు సంక్రాంతి తర్వాత ఊపందుకోనున్నాయనే ప్రచారం జరుగుతున్నది. అక్కడ చాలామంది నేతలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇటీవల వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో టీడీపీ అధినేత ఇప్పటికే సభ పెట్టి ఆ పార్టీ పూర్వ వైభవానికి ఇక్కడి నుంచే నాంది కావాలన్నారు.

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు కూడా పాలేరులో సభ పెట్టి ఇక్కడి నుంచే తాను పోటీ చేస్తానని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇక్కడ బలంగా ఉన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏపీతో సరిహద్దు కలిగి ఉండటమే కాక వ్యాపారపరంగా అక్కడి ప్రజలకు ఇక్కడి ప్రజలకు రాకపోకలు ఉన్నాయి. ఏపీ ప్రజాప్రతినిధులకు రాజకీయంగా కూడా ఆ జిల్లాతో అవినాభ సంబంధం ఉన్నది. దీంతో ఖమ్మం మెట్టును ఏపీ నేతలు తెలంగాణకు ముఖద్వారంగా భావిస్తారు.

ఉద్యమ సమయంలో ఖమ్మం జిల్లాలో న్యూడెమోక్రసీ నేతల జేఏసీలో కీలకంగా పనిచేయడంతో అక్కడ ఉద్యమం ఉధృతంగా జరిగింది. కేసీఆర్‌ నిరాహారదీక్ష సందర్భంగా ఆయనను అక్కడి ఆస్సత్రికి తరలించడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారు. కానీ తెలంగాణలో రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 9 జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగినా టీఆర్‌ఎస్‌ ఒక్క సీటుకే పరిమితమైంది. అందుకే బీఆర్‌ఎస్‌ అదినేత అక్కడి నుంచే అనేక పార్టీలకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతోనే దృష్టి సారించినట్టు తెలస్తోంది.

పది స్థానాల్లో మెజారిటీ రిజర్వు స్థానాలే.. జనరల్‌ స్థానాలు మూడే

ఉమ్మడి ఖమ్మంలో పది అసెంబ్లీ సీట్లు, ఒక పార్ల మెంట్‌ స్థానం ఉన్నది. అందులో పినపాక, ఇల్లందు, ఆశ్వారావుపేట, భద్రాచలం, వైరా ఎస్టీ నియోజకవర్గాలు కాగా, మధిర, సత్తుపల్లి ఎస్టీ రిజర్వ్‌ స్థానాలు. పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం మాత్రమే జనరల్‌ స్థానాలు. జనరల్‌ స్థానాలకు అన్ని పార్టీల నుంచి చాలా పోటీ ఉన్నది. ముఖ్యంగా బీఆర్ఎస్‌లో అది ఎక్కువగా ఉన్నది.

అధికార పార్టీలో విభేదాలు.. నేతల అసంతృప్తి

2014లో కొత్తగూడెం, 2018లో ఖమ్మం సీటు మాత్రమే గెలుచుకున్నది. 2014లో వైపీసీ అక్కడ పినపాక, ఆశ్వారావుపేట, వైరా అసెంబ్లీ సీట్లతో పాటు పార్లమెంటు స్థానాన్ని కూడా దక్కించుకున్నది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో వాళ్లంతా బీఆర్‌ఎస్‌లో చేరారు. కానీ ప్రస్తుతం వాళ్లంతా అసంతృప్తితోనే ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పరిణామాలు పార్టీలో తీవ్రమై ఇటీవల ఆ విభేదాలు ఇటీవల బైటపడ్డాయి. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులు మంత్రి పువ్వాడ అజయ్‌ వైఖరిపై పరోక్షంగా విమర్శలు చేశారు.

దీనిపై మంత్రి స్పందిస్తూ రాజకీయాల్లో కుట్రలు సహజమని వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్లాలని తనపై ఆరోపణలు చేస్తున్నవారికి చురకలు అంటించారు. సమస్యలు ఉంటే సీఎం వద్దే తేల్చుకోవాలని సూచించారు. అలాగే మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాసరావు సీఎం కాళ్లు మొక్కడం వంటివి వివాదాస్పదం అయ్యింది. ఆయన కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వవచ్చు అనే చర్చ ఆ సందర్భంలో జరిగింది. వీటన్నింటి నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ అక్కడ జరుగుతున్నది.

ఎస్టీ రిజర్వేషన్‌ 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం, దళితబంధు పథకాన్ని అమలవుతున్నది. వీటిని ఓట్ల రూపంలో తమకు అనుకూలంగా మలుచుకోవడంతో పాటు పార్టీలో నెలకొన్న విభేదాలు పరిష్కరించి మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నది. అలాగే పార్లమెంటు స్థానం కూడా కీలకం. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రభావం పార్లమెంటు స్థానంతో పాటు ఆ పార్లమెంటు పరిధిలోని రెండు మూడు అసెంబ్లీ స్థానాలపై కూడా ఉంటుంది.

అలాగే పాలేరు స్థానానికి అధికారపార్టీలో పోటీ ఎక్కువగా ఉన్నది. అలాగే ఆంధ్రా ఓటర్ల ప్రభావం కూడా చాలా నియోజకవర్గాల్లో ఉంటుంది. కాబట్టి ప్రధానపార్టీలన్నీ వాళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి. సీపీఎం కూడా గట్టిగానే ఉంటుంది. కేరళ సీఎం వస్తే రానున్నరోజుల్లో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాటం చేస్తామని ఆ వేదిక ద్వారా ప్రకటన చేయవచ్చు. ఇట్లా అన్ని అవకాశాలను వినయోగించుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. వచ్చేసార్వత్రిక ఎన్నికల్లో ప్రతి సీటు ముఖ్యమే. అందుకే కేసీఆర్‌ అక్కడ ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది.