బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఫిరాయింపులపై సీబీఐ విచారణకు ఇదేశించాలి: పొన్నం
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం.. నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపడతాం మీడియాతో పొన్నం ప్రభాకర్ హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న నలుగురిలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది, బీఆర్ఎస్ పార్టీలో చేరారని, ఈ కేసును తనే బయటకు తీసినట్లు సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంలో అసెంబ్లీ స్పికర్ […]

- ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం..
- నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపడతాం మీడియాతో పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న నలుగురిలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది, బీఆర్ఎస్ పార్టీలో చేరారని, ఈ కేసును తనే బయటకు తీసినట్లు సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
పీసీసీ అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంలో అసెంబ్లీ స్పికర్ ఫార్మాట్ లో రాజీనామా సమర్పించారని ప్రభాకర్ గుర్తు చేశారు. ఇవాళ గాంధీ భవన్‌లో మాజీ ఎంపీ మల్లు రవితో కలిసి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యే లపై చర్య కోసం రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తామని, మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పదవి నుంచి బర్తరప్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రంలో 2014 నుంచి జరిగిన ఫిరాయింపులపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీకి శాసన వ్యవస్థలపై ఏమాత్రం గౌరవం ఉన్నా ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలన్నారు.
గవర్నర్ ను కలిసిన తరువాత సీబీఐకి 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి, వారి నియోజకవర్గాలలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి, రేగ కాంతారావు, బీరం హర్షవర్థన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి, బీఆర్ఎస్‌లో చేరారన్నారు. గారడి మాటలతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని, రాజకీయ వ్యభిచార కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చారని ప్రభాకర్ దుయ్యబట్టారు.
దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను ప్రధాని నరేంద్ర మోదీ కూల్చుతున్నట్లుగానే రాష్ట్రంలో కేసీఆర్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు వందల కోట్లు వెదజల్లుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్రంలో తన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్న తరుణంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసును తెరమీదికి తెచ్చి డ్రామాలు ఆడుతున్నారన్నారు.
తమ పార్టీ తెలంగాణ సమస్యలపై బరాబర్ మాట్లాడుతుందని, బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో కేసీఆర్ కు తెలంగాణతో బంధం పూర్తిగా కట్ అయ్యిందనన్నారు. బీఆర్ఎస్ విస్తరణ కోసం ఆంధ్రా నాయకులతో నిత్యం చర్చలు జరిపే బదులు తెలంగాణ రైతులతో మాట్లాడాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉలిక్కిపడి కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని మాజీ ఎంపి మల్లు రవి ఆరోపించారు. ఫామ్ కేసులో ఉన్న ముగ్గురు ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు మిగతా 9 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ జరపాలని గవర్నర్ ను కోరతామని, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి చేరిన 12 మంది ఎమ్మెల్యేలు వీరే. పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్థన్ రెడ్డి, డి.సుధీర్ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, హరిప్రియా నాయక్, ఆత్రం సక్కు, కందాల ఉపేందర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జాజుల సురేందర్, వనామా వెంకటేశ్వర్ రావు, పి.సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు.